Konaseema Latest News: కె.గంగవరం వద్ద కుప్పకూలిన 132 కేవీ విద్యుత్తు టవర్- అంధకారంలో కోనసీమ జిల్లా
Konaseem News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అంధకారం అలముకుంది. కొత్తపేట వైపుగా వచ్చే 132 కేవీ విద్యుత్తు టవర్ కుప్పకూలడంతో విద్యుత్తు సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు

Konaseema Latest News: కాలం చెల్లిన టవర్ వల్లనో లేక చిన్నపాటి సుడిగాలి ప్రభావానికో కానీ మొత్తం మీద రామచంద్రపురం నుంచి కొత్తపేట సబ్ స్టేషన్‌కు వచ్చే 132 కేవీ విద్యుత్తు లైన్ల టవర్ ఈనెల 15 రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని కె.గంగవరం గ్రామ పరిధిలో పంటపొలాల మధ్య ఉన్న టవర్ కూలిపోయినట్లు గుర్తించిన విద్యుత్తుశాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన పునఃనిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే 15వ తేదీ రాత్రి నుంచి కోనసీమ ప్రాంత ప్రజలు మాత్రం నరకం చూస్తున్నారు.
కోనసీమ విద్యుత్తు ఉపకేంద్రానికి వచ్చే ఈ లైను ద్వారా కొత్తపేట, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు నియోజవర్గాల ప్రజలకు విద్యుత్తు సరఫరాలు అందిస్తున్నారు. ఇంత కీలకమైన ఈ విద్యుత్తు లైను వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అధికారులు భీమవరం 132 సర్క్యూట్ పరిధి నుంచి కోనసీమ ప్రాంతానికి విద్యుత్తు సరఫరా చేస్తున్నారు.
అధికారులు చేసే విద్యుత్ సరఫరా ఆ ప్రాంతానికి ఏ మాత్రం సరిపడటం లేదు. లోడ్ రిలీఫ్ పేరుతో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీని వల్ల కోనసీమలోని ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అసలే వేసవికాలం.. పైగా గత మూడు రోజుల నుంచి పట్టుమని రెండు గంటల సేపు కూడా విద్యుత్తు సరఫరా జరగడం లేదు. దీంతో కోనసీమ ప్రాంతం అంతా అంధకారంలోకి వెళ్లింది. పగటి పూట ఓ పక్క ఎండల తీవ్రత పెరగడం మరోపక్క విద్యుత్తు సరఫరా లేకపోవడంతో పగటిపూటే ప్రజలు చుక్కలు చూస్తున్నారు.
విద్యుత్తు లేక ఆక్వారంగం కుదేలు..
ఆక్వాసాగులో ఏరియేటర్లు అత్యంత కీలకం.. ఏరియేటర్లే కాకుండా సాగు కోసం నీరు తోడేందుకు, దింపేందుకు విద్యుత్తు మోటార్లు కూడా అత్యంత అవసరం. అయితే రెండు రోజులుగా విద్యుత్తు సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్తు సరఫరా లేకపోవడంతో జనరేటర్లపై ఆధారపడడం వల్ల ఆర్థికంగా భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓపక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బతో ధరల పతనం కొనసాగుతుంటే మరోపక్క విద్యుత్తు అంతరాయంతో మరింత కుదేలైన పరిస్థితి ఎదుర్కొంటున్నామని రైతులు గొగ్గోలు పెడుతున్నారు.
టవర్ పునర్మిణం పూర్తి అయ్యే లోపు ఆక్వా రంగం కుదేలైపోతోందని, టవర్ నిర్మాణం పూర్తయ్యేలోపు పక్క జిల్లాల సర్క్యూట్ల నుంచి ప్రత్యామ్నాయంగా విద్యుత్తు సరఫరా చేయాలని ఆక్వారైతులు డిమాండ్ చేస్తున్నారు..
ఉక్కబోతతో అవస్థలు..
ఓ పక్క పగటి పూట ఉష్ణోగ్రతలు బాగా పెరగడంతోపాటు తీవ్రమైన ఉక్కబోతతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో రాత్రివేళల్లో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో లోడ్ రిలీఫ్ పేరిట ఎక్కువ సమయం విద్యుత్తు లేకపోవడం వల్ల ఇన్వర్టర్లు ఆగిపోవడంతో ప్రజలు రోడ్లు మీద అటూ ఇటూ తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు..
శరవేగంగా టవర్ పునర్‌నిర్మాణ పనులు..
కె.గంగవరం వల్ల పంట పొలాల్లో కుప్పకూలిన 132 కేవీ విద్యుత్తు లైన్ టవర్ స్థానంలో కొత్త టవర్ నిర్మాణం పనులు శరవేగంగా చేపట్టినట్లు విద్యుత్తుశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే టవర్ నిర్మాణం చాలా వరకు పూర్తి అయ్యిందని, టవర్ పైభాగం కూడా పూర్తిచేసి వైర్లు కనెక్టివిటీ ఇస్తే విద్యుత్తు సరఫరాను యథాతధంగా పునరుద్ధరిస్తామని చెబుతున్నారు.
పరిశీలించిన మంత్రి సుభాష్, ఎంపీ, ఎమ్మెల్యేలు..
కె.గంగవరం పంట పొలాల్లో కూలిపోయిన టవర్ స్థానంలో కొత్త టవర్ నిర్మాణ పనులను రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధూర్, ముమ్మిడివరం ఎమ్మెల్యే నడిరపల్లి సుబ్బరాజు, జిల్లా ఆక్వా సంఘ అధ్యక్షుడు, రాష్ట్ర క్షత్రియ కార్పోరేషన్ డైరెక్టర్ దెందుకూర్తి సత్తిబాబురాజు, స్థానిక ఆర్డీవో, విద్యుత్తు శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. టవర్ నిర్మాణాన్ని మరింత వేగంగా పూర్తి చేసి ప్రజలకు కలిగిన అసౌకర్యం నుంచి విముక్తి కలిగించాలని అధికారులను ఆదేశించారు.





















