Floods in AP: ధవలేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ.. అప్రమత్తమైన అధికారులు!
Floods in AP: ఎగువ నుంచి వస్తున్న భారీ వరదల వల్ల ధవలేశ్వరం కాటన్ బ్యారేజీకి వరద ఉద్ధృతి పెరిగింది. అప్రమత్తమైన అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
![Floods in AP: ధవలేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ.. అప్రమత్తమైన అధికారులు! Third Danger Alert Issued at Dhavaleshwaram Cotton Barrage Floods in AP: ధవలేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ.. అప్రమత్తమైన అధికారులు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/15/dd42de73956a087f2b79d9e23d5d2bc51657875227_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Floods in AP: ఎగువ ప్రాంతాల్లో కరుస్తున్న భారీ వర్షాల వల్ల ధవలేశ్వరం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దాదాపు 18 అడుగుల స్థాయికి పైగా వరద ప్రవహిస్తోంది. దీంతో 19,54, 822 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న జలాశయంలోకి వదులుతున్నారు. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. దిగువ ప్రాంతాలైన కోనసీమ జిల్లా పరిధిలోని లంక గ్రామాలన్నీ వరద ముంపు ముప్పులోకి వెళ్తున్నాయి.
పొంగిపొర్లుతున్న నదులు..
పైనుంచి పొడుస్తున్న వరదతో గౌతమి, వశిష్ట, వైనతేయ, వృద్ధ గౌతమి నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో నదీ పరివాహక గ్రామాలన్నింటిని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 75కు పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లంక గ్రామాలన్నింటిని ఈ శిబిరాలకు తరలించే ఏర్పాటు చేస్తున్నారు. వరద ప్రభావిత అన్ని గ్రామలను ఖాళీ చేయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
లంక గ్రామాలన్నీ జలదిగ్బంధంలోనే..!
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే వశిష్ట వారిధిపై వరద ఉద్ధృతి పెరిగింది. మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇలాగే జరిగితే... ఈరోజే వరద నీరు పాత బ్రిడ్జ్ ను తాకుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ అయోధ్య లంక, పుచ్చల లంక, పెద్దమల్లం లంక, అనగార లంక , మర్రిమూల లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి.
గంటల పాటు శ్రమించి 500 గేదెలను ఒడ్డుకు...
లంక గ్రమాలన్నీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ప్రజలంతా పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. అయితే తమకు జీవనోపాధి కల్పించే పశువులను ఎలాగైనా సరే కాపాడుకోవాలనున్న ప్రజలు.. వరద ప్రవాహంలోనే తిరుగుతు 500 గేదెలను ఒడ్డుకు చేర్చారు. గంటల పాటు శ్రమించి తమతు జీవనోపాధి కల్పించే పశువులను కాపాడుకున్నారు.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి..
కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత గ్రామాలను జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి జోగి రమేష్ పరిశీలించారు. పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండల పరిధిలోని ముంపు గ్రామాలను ఆయన స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, ఎంపీ చింతా అనురాధ తదితరులతో కలిసి నావపై వెళ్లి పరిశీలన చేశారు. అయినవిల్లి ఎదురు బిడిం కాజ్వే పై బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటికే ముఖ్య మంత్రి హామీ ఇచ్చారని... అది త్వరలో కార్యరూపం దాల్చనుందని తెలిపారు. వరద ముంపుకు గురైన వరద బాధిత కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. అదే విధంగా ముమ్మిడివరం నియోజక వర్గంలోని పలు వరద ముంపు గ్రామాలను మంత్రి జోగి రమేష్ సందర్శించారు.
వరద ప్రభావం తగ్గేవరకు ప్రజలంతా పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. అక్కడ భోజనంతో పాటు అన్ని రకాల వసతులు ఉంటాయన్నారు. ముఖ్యంగా వైద్య శిబిరాలను వరద ప్రభావం తగ్గినా కొనసాగిచాలని అధికారులకు ఆదేశించారు. అలాగే ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ... ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)