TDP Mahanadu: మహానాడుకి అంతా రెడీ, రెండోరోజు 15 లక్షల మంది అంచనా - ఆసక్తికర విషయాలు చెప్పిన అచ్చెన్నాయుడు
తెలుగుదేశం పార్టీ చేపట్టిన మహానాడు కార్యక్రమం సర్వాంగ సుందరంగా, అంగరంగ వైభవంగా జరగబోతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
రాజమండ్రి వేమగిరి వద్ద శనివారం, ఆదివారం (మే 27, 28) జరగబోయే తెలుగుదేశం పార్టీ చేపట్టిన మహానాడు కార్యక్రమం సర్వాంగ సుందరంగా, అంగరంగ వైభవంగా, కనీవినీ ఎరుగని రీతిలో జరగబోతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మహానాడు ఏర్పాట్లుకు సంబందించి ఇప్పటికే 95 శాతం పనులన్నీ పూర్తిచేశామని, చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉంటే పరిస్థితులకు అనుగుణంగా అవికూడా కంప్లీట్ చేస్తామన్నారు. తాను చాలా మహానాడు చూశానని, రాజమండ్రి వేదికగా జరగబోతోన్న మహానాడు అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈసారి ప్రతినిధుల సభ, బహిరంగ సభ వేర్వేరుగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఎప్పుడూ చాలా కన్ఫ్యూజ్ ఉండేదని, అయితే ఈసారి అవన్నీ అధిగమించేలా ఏర్పాట్లు ఉన్నాయన్నారు.
ప్రతినిధుల సభకు 15 వేలు మంది..
మహానాడు తొలిరోజు అయిన శనివారం ప్రతినిధుల సభను ఏర్పాటు చేశామని, ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి, తెలంగాణ నుంచి ముఖ్యనాయకులు, ప్రతినిధులు హాజరవుతారన్నారు. ప్రతినిధుల సభకు 15,000 మందిని ఆహ్వానించామన్నారు. నాలుగు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి రాష్ట్రంలో చేస్తున్న విధ్వంసకర విధానాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. నూటికీ నూరు శాతం టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని ఏవిధంగా గాడిలోకి పెట్టాలి, పెట్టుబడులు పెట్టేందుకు ఎటువంటి నమ్మకాన్ని ఇవ్వాలని ప్రధానమైన ఉద్దేశ్యంతో ప్రతినిధుల సభ జరుగుతుందన్నారు. అయిదు వింగ్‌లుగా తీసుకుని టీడీపీ బ్యాక్‌బోన్‌గా ఉన్నటువంటి బీసీల గురించి, దీంతోపాటు ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు సంక్షేమం గురించి, యువత, మహిళలు, రైతులు గురించి ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు. వీటిపై ప్రత్యేక తీర్మానాలు ఉంటాయని తెలిపారు.
మ్యానిఫెస్టో విడుదల లేనట్లేనా..
టీడీపీ ఎన్నికల మ్యానిఫేస్టో ఎలా ఉండబోతుందో అధినేత చంద్రబాబు వివరించనున్నారని తెలిపారు. రాబోయే విజయదశమి రోజున మ్యానిఫెస్టో ముసాయిదాను విడుదల చేసి ప్రజల ముందు ఉంచుతారని, ప్రజల అభిప్రాయం తీసుకుని ఎన్నికల మ్యానిఫెస్టోను రూపకల్పన చేస్తామన్నారు. ప్రసంగికులు విషయంలో కూడా పాత కొత్త కలయికతో అవకాశం కల్పించనున్నారన్నారు. తెలుగు జాతికి మహానాడు ద్వారా మంచి సందేశం ఇవ్వబోతున్నామన్నారు.
మహానాడు ఫెయిల్ అవ్వాలని చూస్తోంది..
తెలుగుదేశం పార్టీ మహానాడు ఫెయిల్ అవ్వాలని ఈ జగన్‌రెడ్డి ప్రభుత్వం అడుగడుగునా అనేక ఆటంకాలు సృష్టిస్తోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. బస్సులు ఇవ్వడం లేదని, ప్రయివేటు వాళ్లు ఇస్తామంటే భయపెడుతున్నారన్నారు. ఆటోవాళ్లమీద కేసులు పెడుతున్నారన్నారు. అందుబాటులో ఏ వాహనాలుంటే వాటిపై రావాలని లేకుండా కాలినడకన అయినా తరలిరావాలన్నారు.
జగన్మోహన్ రెడ్డి బ్లేడ్ బ్యాచ్‌కు ఇంకేం పనిలేదు..
మహానాడు జరగనున్న నేపథ్యంలో రాజమండ్రి సిటీ అంతా పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు,తోరణాలు కట్టుకుంటే రాత్రికి రాత్రి జగన్మోహన్‌రెడ్డి బ్లేడ్ బ్యాచ్ నానా ఆటంకాలు సృష్టిస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో పోలీసుల పాత్ర చాలా కీలకమని, జడ్‌ఫ్లస్ సెక్యూరిటీ కలిగిన మా నాయకుడు వస్తున్న ఈసభకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా ఎక్కువ పోలీసులతో బందోబస్తు నిర్వహించాలని కోరారు. తాను ఇప్పటికే డీజీపీకు లేఖ రాశానని, జిల్లా ఎస్పీను మా నాయకులు కలిశారని, ఆయన సానుకూలంగా మాట్లాడారని తెలిపారు.
సాయంత్రం 5 గంటలకు పొలిట్ బ్యూరో సమావేశం..
టీడీపీ అధినేత విజయవాడలో రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం రెండు గంటలకు బయలు దేరుతారని, ఆయన రాజమండ్రి సాయంత్రం 5 గంటలకు హోటల్ మంజీరకు వస్తారన్నారు. ఆతరువాత వెంటనే అక్కడే పొలిట్ బ్యూరో సమావేశం ఉంటుందన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న మహానాడులో తీసుకోబోతున్న నిర్ణయాలపట్లా, ప్రవేశపెడుతున్న తీర్మాణాలపైన చర్చించి ఆమోదం తెలిపిన తరువాత మహనాడులో ప్రకటించనున్నారన్నారు. ప్రతినిధుల సభకు 15 వేల మందికి ఆహ్వానం ఇచ్చామని అయితే చాలా మంది వస్తారన్నారు.
అభ్యర్ధుల ప్రకటన ఇప్పుడు ఉండదు..
వైసీపీ దుర్గామార్గులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని, టీడీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలనే పేరు మార్చి అమలు చేస్తున్నారన్నారు. టీడీపీ వస్తే సంక్షేమం ఎత్తివేస్తాదని, పథకాలు రద్దుచేస్తారని ప్రచారం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి సంక్షేమం పితామహునిగా, ప్రపంచంలో ఎక్కడా సంక్షేమం అందనట్లుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారన్నారు. మహానాడు వేదికగా కేవలం ఎన్నికల మ్యానిఫెస్టో ముసాయిదా గురించే ప్రకటన ఉంటుందని, అభ్యర్ధుల విషయంలో ఎటువంటి ప్రకటన ఉండబోదన్నారు.
రెండో రోజు మహానాడు సభకు 15 లక్షల మంది అంచనా..
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలనుంచి సుమారు 15లక్షల మంది జనాభాతరలివస్తారని అంచనా ఉందన్నారు. పోలీసులు సహకరిస్తారని భావిస్తున్నామని, లేకపోయినా ప్రతీ కార్యకర్త ఒక వాలంటీర్‌గా మారి సేవలందిస్తారన్నారు. మహానాడు అయ్యాక బాదుడే బాదుడే తోపాటు మరిన్ని సరికొత్త కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల సంఖారావంపూరిస్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.