Chandrababu Naidu: నష్టపోయిన రైతులు ఈ సీఎంకు కనిపించరా? చంద్రబాబు ధ్వజం
Chandrababu Naidu: కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించే తీరిక ఈ సీఎంకు లేదా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
Chandrababu Naidu: అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, అన్నదాతలను పరామర్శించే తీరిక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేదా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను బాబు పరిశీలించారు. అకాల వానలకు తీవ్రంగా నష్టపోయి కష్టాల్లో ఉన్న రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. కష్టాలు వచ్చినప్పుడు ఆదుకునే వాడే అసలైన నాయకుడు అవుతాడని, కష్టాలు చూసి పారిపోయేవాడు నాయకుడు ఎలా అవుతాడని బాబు ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి అన్నారు. పంట పొలాలను పరిశీలించిన చంద్రబాబు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాలకు తడిసి దెబ్బతిన్న, మొలకలు వచ్చిన ధాన్యాన్ని బాబు పరిశీలించారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని చూపి రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
'రైతుల గోస ముఖ్యమంత్రికి పట్టదా'
రైతుల గోడు కళ్లారా చూసి, వారి ఆవేదన విన్న చంద్రబాబు.. అనంతరం మాట్లాడుతూ ఎక్కడ చూసినా అకాల వర్షానికి తడిసి ధాన్యం మొలకలు వచ్చిందని అన్నారు. ఇంకా 60 శాతం ధాన్యం పొలాల్లోనే ఉందని చెప్పారు. రైతుల బాధ వింటుంటే గుండె తరుక్కుపోతుందని పేర్కొన్నారు. చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయనకు బాధ్యత లేదా అని, ఎందుకు రైతుల వద్దకు రారు అని నిలదీశారు. హుద్ హుద్ తుపాను సమయంలోనే అహర్నిశలు పని చేశానని బాబు గుర్తు చేశారు. ఆ సమయంలో జగన్ అటు వైపు చూడలేదని తెలిపారు. అదేమని ప్రశ్నించే తాను అధికారంలో లేనని సమాధానం చెప్పారని, మరి ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు, ఎందుకు రాలేదు అంటూ టీడీపీ అధినేత జగన్ పై మండిపడ్డారు.
'అప్పుడు ముద్దులు పెట్టి తలనిమిరావు ఇప్పుడేమైంది'
రైతులను పరామర్శించే తీరిక లేదా.. ధాన్యం సంచులు కూడా ఇవ్వలేని ప్రభుత్వాన్ని ఏమనాలి అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఈ నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడైనా జగన్ పొలంలా దిగారా అంటూ నిలదీశారు. ఓ వైపు అకాల వర్షాలతో రైతులు ఇబ్బందుల్లో ఉంటే ఎయిర్ పోర్టుకు శంకుస్థాపనా చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆ శంకుస్థాపన కూడా గతంలో చేసిన దానికి మళ్లీ చేస్తారని అని ఎద్దేవా చేశారు. చెత్త ముఖ్యమంత్రి.. చెత్త వ్యవస్థను తీసుకువచ్చారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాలు దగా కేంద్రాలుగా మారి పోయాయని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. అరెస్టు చేస్తే చేసుకోండి.. భయపడేది లేదంటూ సవాల్ విసిరారు. కష్టాలు వచ్చినప్పుడు ఆదుకునే వాడు నాయకుడు అవుతాడని, కష్టాలు చూసి పారిపోతే నాయకుడవుతారా అని టీడీపీ అధినేత ప్రశ్నించారు. పాదయాత్రలో ముద్దులు పెట్టి.. తల నిమిరావు.. ఇప్పుడు ఏమైంది అంటూ జగన్ పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే ఓ మహిళా రైతు కుమార్తె చదువుకు రూ.2.30 లక్షలు చంద్రబాబు అందజేశారు.