పోలవరం దుస్థితి చూస్తే కన్నీళ్లు వస్తున్నాయ్, చంద్రబాబు ఎమోషన్
సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి కార్యక్రమం చేపట్టిన ఆయన పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.
పోలవరం సందర్శించిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత భావోద్వేగానికి గురయ్యారు. ప్రజల జీవితాలను మార్చే కలల ప్రాజెక్టును నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ పరిస్థితులు చూస్తుంటే గుండె పగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి కార్యక్రమం చేపట్టిన ఆయన పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలవరాన్ని సందర్శిన సందర్భంగా మీడియా మాట్లాడిన చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు.
రాష్ట్రానికి ఏదో చేయాలనే తపన ఉన్న ఇలా నిస్సహాయ స్థితిలో ఉండటం తట్టుకోలేకపోతున్నానంటూ ఎమోషన్ అయ్యారు. మనం ఏదో ఊహించుకుంటాం. రాష్ట్రం బాగుపడిపోవాలి. ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలి. ఇదొక మంచి అవకాశం మనకు. ఈ నీళ్లు తీసుకుపోతే సిరులు పండించుకుంటారు. అని తపనతో చేపట్టిన ప్రాజెక్టు పోలవరం. ఈరోజు చూస్తే అందరికన్నా ఎక్కువ బాధ పడుతున్న వ్యక్తిని నేనే. అని అన్నారు.
ఇలాంటివి చూస్తుంటే ఒక్కోసారి నిస్సాహయతగా ఉంటుందన్నారు చంద్రబాబు. ఇది సాధ్యం కాదన్న ప్రాజెక్టును అడ్డంకులన్నింటినీ తొలగించి మొదలు పెట్టామన్నారు. ఎక్కడికక్కడ అడ్డంకులు వచ్చాయని అభిప్రాయపడ్డారు. స్ఫిల్‌వే వద్ద మూడు గ్రామాలు కోర్టుకు వెళ్తే వాని కన్విన్స్ చేసి హ్యాపీగా వాళ్లను పంపించిన తర్వాత పనులు ప్రాంభించామన్నారు. 23 సార్లు ప్రాజెక్టును నేరుగా, 86 వర్చువల్‌గా రివ్యూలు చేసిన వ్యక్తి ఎవరూ ఉండరేమో అన్నారు. అలా ఏ అడ్డంకులు లేకుండా పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టు నేడు ఇలా ఉండటం చూసి బాధ కలుగుతుందని కొన్ని సార్లు కన్నీళ్లు కూడా వస్తున్నాయన్నారు.
తర్వాత ట్వీట్ చేసిన చంద్రబాబు... పోలవరాన్ని చూసి నా గుండె పగిలిపోయింది. లక్షలాది తెలుగు ప్రజల జీవితాలను మార్చే కలల ప్రాజెక్టు ఇది. కానీ అది నేడు నిర్లక్ష్యానికి గురై నాశనమైపోతంది. నేను పోలవరాన్ని 23 సార్లు సందర్శించాను. 83 సార్లు వర్చువల్ సమీక్షలు నిర్వహించాను. ఏం చేసైనా దాని నిర్మాణాన్ని వేగవంతం చేయాలని తాపత్రయ పడ్డాను భవిష్యత్తు తరాలు ప్రయోజనాలు పొందుతారనే సంకల్పంతో పని చేశాను అన్నారు.
నేను ఈ రోజు చాలా మందితో మాట్లాడాను. ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అవుతుందనే దానిపై ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. ప్రాజెక్ట్ సాంకేతి అంశాలను కావాలని ఉద్దేశపూర్వకంగా తారుమారు చేశారు. ఇది ప్రమాదకరం. సీఎం అబద్ధాలు మాత్రమే చెబుతున్నారు. అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
అనంతరం దేవరపల్లిలో చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహించారు. రాష్ట్రంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టును చూసి వచ్చానని.. పోలవరం పూర్తి చేసుకుంటే రాష్ట్రంలో సిరులు పండించవచ్చన్నారు. రాష్ట్రానికి వరం లాంటి ప్రాజెక్టుకు ఒక దద్దమ్మ, సైకో నాశనం చేశారని ఆరోపించారు. తాము 72 శాతం పూర్తి చేశామన్నారు. అంత ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టును జగన్ నాశనం చేశారని విమర్శించారు.
ఒక్క పోలవరం ప్రాజెక్టే కాదని సాగునీటి రంగానికి జగన్ తీరని ద్రోహం చేశారని ఆరోపించారు చంద్రబాబు. టీడీపీ హయాంలో 68 వేల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఖర్చు పెడితే...జగన్ కేవలం 22 వేల కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. ఇలా అయితే ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి అవుతాయని ప్రశ్నించారు.
జగన్ పాలనలో ఒక్కరు కూడా ఆనందంగా లేరన్నారు చంద్రబాబు. అన్ని ధరలు పెరిగిపోయాయన్నారు. నిత్యావసర వస్తువులు ధరలతోపాటు 8సార్లు కరెంట్ చార్జీలుపెరిగాయని గుర్తు చేశారు. 5 ఏళ్లు ఒక్క రూపాయి కూడా కరెంట్ చార్జీలు తాము పెంచలేదని వివరించారు. రేపు అధికారంలోకి వచ్చిన తరవాత కరెంట్ చార్జీలు పెంచబోను అని హామీ ఇచ్చారు. కుదిరితే కరెంట్ చార్జీలు తగ్గిస్తా అని భరోసా ఇచ్చారు.
ఆర్టీసీ టిక్కెట్లు రేట్లు పెరిగాయన్నారు చంద్రబాబు. ఇంటి పన్నులు పెరిగాయని తెలిపారు. ప్రతి పనికి బటన్ నొక్కాను అంటున్న జగన్ తన నొక్కుడు గురించి చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మందు బాబుల బలహీనతను ఆయుధంగా మార్చకుని మద్యం ధరలు పెంచారన్నారు. నాణ్యత లేని మద్యం అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. మద్యం షాపుల్లో ఆన్లైన్ చెల్లింపులు లేవని... మద్యం షాపుల్లో డబ్బు తాడేపల్లి కొంపకు పోతుందని ఆరోపించారు.
జగన్ వచ్చిన తరువాత ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అని ప్రజలను చంద్రబాబు ప్రశ్నించారు. ఒక్క డిఎస్సి వచ్చిందా అని క్వశ్చన్ చేశారు. అందుకే అంతా జాబు రావాలి అంటే బాబు రావాలి అంటున్నరని అన్నారు. యువగళం అనే పథకాన్ని ప్రకటించామని... యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని లేకుంటే నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయింది. ధాన్యం రైతులకు కనీసం గోనె సంచులు కూడా ఇవ్వలేకపోయిన ప్రభుత్వం ఇదని ఎద్దేవా చేశారు.
రేపు జరిగే ఎన్నికల్లో ఒక పక్క సైకో ఉంటే మరో పక్క 5 కోట్ల రాష్ట్ర ప్రజలు ఉన్నారని చంద్రబాబు అన్నారు. ఇలాంటి సిఎంను ఇప్పటి వరకు ఎవరూ చూడలేదని... ఆయనవన్నీ పిచ్చి చేష్టలు, తప్పుడు పనులేనన్నారు. కోడికత్తి డ్రామాలు, బాబాయ్ హత్య డ్రామాలు చూశామన్నారు. చెల్లికి తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వలేని జగన్... ప్రజలు అడిగే ప్రశ్నకు సమాధానం కూడా చెప్పలేదన్నారు. అందుకే చెపుతున్నా సైకో పోవాలి సైకిల్ రావాలి అని నినదించారు.