(Source: ECI | ABP NEWS)
Ramachandrapuram Crime News: రామచంద్రపురంలో బాలిక అనుమానాస్పద మృతి; ఇంటి యజమాని కుమారుడిపైనే డౌట్
Ramachandrapuram News:అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో పదేళ్ల చిన్నారి సిర్రా రంజిత మృతి సంచలనం రేపింది. ఇంటి యజమాని కుమారుడు జాకీర్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Ramachandrapuram Crime News: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో పదేళ్ల చిన్నారి సిర్రా రంజిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈమె మరణం స్థానికంగా సంచలనం రేపింది. మంగళవారం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన చిన్నారి రంజిత ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగత జీవిగా కనిపించింది. రామచంద్రపురంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో అయిదో తరగతి చదువుతున్న చిన్నారి రంజిత స్కూల్ టీచర్లు ఒత్తిడి కారణంగానే ఆత్మ హత్యకు పాల్పడిందని అంతా భావించారు. అయితే తల్లి తన కుమార్తె మృతిపై అనుమానాలున్నాయని ఆరోపించడంతో ఆ దిశగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తన కుమార్తె మృతిలో వారు అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కుమారుడు జాకీర్ హుస్సేన్ పాత్రపై అనుమానం వ్యక్తం చేసిన క్రమంలోనే పోలీసులు అతన్నిఅదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ కుమార్ మీనా తెలిపారు.
కాకినాడ వెళ్లి వచ్చే సరికి విగత జీవిగా
రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాప్‌నర్స్‌గా పని చేస్తున్న సిర్రా సునీత ఉద్యోగ రీత్తా రామచంద్రపురంలో టి.నగర్ కమల్ కాంప్లెక్స్‌లో అద్దెకు ఉంటోంది. భర్త ముంబైలో ఉంటుండగా వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె వేరే ప్రాంతంలో చదువుకుంటుండగా మృతి చెందిన బాలిక రంజిత స్థానిక ఓ ప్రైవేటు స్కూల్‌లో 5వ తరగతి చదువుతుంది.. మంగళవారం కాకినాడ వెళ్లిన తల్లి సునీతకు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన చిన్నకుమార్తె రంజిత ఫోన్ చేసి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసినట్లు తెలిపింది. అయితే సుమారు 7 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన సునీతకు ఇంటి గది తలుపు లోపల గడియ పెట్టి ఉండడంతో తలుపు తీయమని ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో కంగారుపడింది. దీంతో చుట్టుపక్కల వారు వచ్చారు. అదే సమయంలో ఇంటి యజమాని కుమారుడు జాకీర్ కూడా వచ్చి కిటికీ తలుపులు తీసి దానినుంచి తలుపు గడియ తీశాడు. అప్పటికే ఇంట్లో ఫ్యాన్‌కు ఉరికి వేళాడుతూ విగత జీవిగా కనిపించింది చిన్నారి రంజిత. ఉరి నుంచి దింపి చిన్నారిని హుటాహుటీన ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి రంజిత మృతిచెందినట్లు వైద్యులు దృవీకరించారు..
అనుమానస్పద మృతిపై దర్యాప్తు వేగవంతం...
రామచంద్రపురంలో పదేళ్ల చిన్నారి రంజిత అనుమానస్పద మృతి తీవ్ర కలకలం రేపింది. తల్లి సునీత ఫిర్యాదు మేరకు డీఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్కూల్ నుంచి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే మృతిచెందడంతో తొలుత స్కూల్ యాజమాన్యాన్ని, టీచర్లను విచారించారు పోలీసులు. అయితే చిన్నారి రంజిత మెరిట్ స్టూడెంట్ అని, చాలా యాక్టివ్‌గా ఉంటుందని, తను ఆత్మహత్యచేసుకునేందుకు ఎటువంటి కారణం లేదని తేలడంతో రంజితను స్కూల్ నుంచి ఇంటికి తీసుకువచ్చే ఆటోడ్రైవర్‌ను విచారించారు. అయితే బుధవారం ఉదయం చిన్నారి తల్లి వ్యక్తం చేసిన ఇంకో అనుమానాన్ని ఆధారంగా చేసుకుని ఇంటి యజమాని కుమారుడు జాకీర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీఎస్పీ రఘువీర్ తెలిపారు. లోపల గడిచ పెట్టి ఉండడంతో ఇంటి యజమాని కుమారుడు జకీర్ వచ్చి కిటికీలోనుంచి చాలా సునాయాసంగా ఇంటి గడియ తీశాడని చెప్పింది. గతంలో అతనిపై రెండు హత్యా నేరాలున్నాయని తేలడంతో ఆదిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. క్లూస్ టీమ్ ద్వారా ఇంటి వద్ద ఆధారాలను సేకరించామని డీఎస్పీ రఘువీర్ తెలిపారు. ఇంక్వెస్టు రిపోర్టు ఆధారంగా కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
అనుమానితునికి నేర చరిత్ర...
బాలిక తల్లి సునీత ఇంటి ఓనర్ కుమారుడు జకీర్‌పై అనుమానం వ్యక్తంచేయడంపై పోలీసులు జకీర్‌ను అదుపులోకీ తీసుకుని విచారిస్తున్నారు. జకీర్ 2004లో ఓ మహిళ హత్య కేసులో నిందితుడు. ఇంకో హత్య కేసులో కూడా నిందితుడు.. రెండు హత్య కేసుల్లో నిందితుడైన జకీర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తల్లి ఆరోపిస్తుంది..
అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.. మంత్రి సుభాష్..
అనుమానస్పదంగా మృతిచెందిన చిన్నారి రంజిత మెరిట్ స్టూడెంట్ అని, చాలా చలాకీగా ఉంటుందని తెలిసిందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఎవ్వరూ ఎటువంటి అపోహలకు పోవద్దని తెలిపారు. మైనర్ అనుమానాస్పద మృతి విషయంలో ఇంకా దర్యాప్తులో కేసు ఉందని, ఎన్డీఏ కూటమిలో పోలీసులను ప్రభావితం చేసేవారు ఉండరని, తప్పు చేసిన వాడు రోడ్డు మీద తిరిగే అవకాశం ఇవ్వదని అన్నారు. బాలిక తల్లి సునీతను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.




















