Rajamahendravaram News: కాలయముడిని ఎదురించిన పదమూడేళ్ల బాలిక - సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడుకున్న కీర్తన
Rajamahendravaram News: తల్లితో పాటు తననూ చెల్లిని రెండో తండ్రి గోదావరి నదిలో తోసేశాడు. కానీ బ్రిడ్జిని పట్టుకున్న బాలిక అక్కడే అరగంట సేపు ఉండి తనను తాను రక్షించుకుంది.
Rajamahendravaram News: కన్నతండ్రిగా భావించిన వాడు కళ్ల ముందే కన్నతల్లిని, ఏడాది వయస్సున్న చెల్లిన గోదార్ట్లోకి తోసేశాడు.. తేరుకునే లోపే తనను వందల అడుగుల ఎత్తున్న వంతెన పైనుంచి తోసేశాడు. తల్లీ చెల్లీ ఏమయ్యారో తెలియదు. తాను మాత్రం వంతెనకు ఉన్న పైప్‌ను పట్టుకుని వేలాడుతోంది. అటువంటి ఆపద సమయంలోనూ ఆ బాలిక చూపిన తెగువ, ధైర్యం గురించి ప్రతక్ష్యంగా చూసిన వారికే కాదు.. ఈ ఘటన గురించి విన్నా కంటినీరు ఉబికి వస్తుంది. తన జేబులో ఉన్న సెల్‌ఫోన్‌తో డయల్ 100 కు ఫోన్ చేసి తనను తాను కాపాడుకోవడమే కాకుండా తన తల్లిని, తన చిన్నారి చెల్లిని, తనను నయవంచన చేసి గోదారిలోకి తోసేసిన దుర్మార్గుని గురించి బాహ్య ప్రపంచానికి తెలియజెప్పింది. ఈ సంఘటనలో బతికి బయట పడ్డ చిన్నారి కీర్తన గురించి పోలీసులే కాదు.. ఈఘటన గురించి విన్నవారు కడా బాలిక కీర్తనను అభినందించకుండా ఉండ లేకపోతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే గౌతమీ నదీపాయపై ఉన్న జొన్నాడ వంతెన వద్ద ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఈ దారుణమైన సంఘటన ప్రతీ ఒక్కరినీ కంటనీరు పెట్టిస్తోంది.
అసలేం జరిగిందంటే..?
కృష్టాజిల్లా గుడివాడకు చెందిన 36 ఏళ్ల పుప్పాల సుహాసినికి అప్పటికే పెళ్లి జరిగింది. వీరికి ఓ పాప కూడా పుట్టింది. అయితే భర్తతో విభేదాలతో కారణంగా ఆమె అతడితో విడిపోయింది. ఈక్రమంలోనే గుంటూరు జిల్లా తాడేపల్లికి వచ్చి ఓ హోటల్‌లో పని చేసుకుంటూ కుమార్తె లక్ష్మీ సాయి కీర్తనతో కలిసి జీవిస్తోంది. ఇదే హోటల్‌లో పని చేస్తున్న ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి చెందిన ఉలవ సురేష్‌తో పరిచయం ఏర్పడిరది. సురేష్‌కు కూడా వివాహం కాగా గత కొన్నేళ్లుగా ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. వీరికి జెర్సీ అనే ఏడాది పాప జన్మించింది. ఆ తరువాత ఇద్దరూ తరచూ గొడవలు పడుతుండగా సుహాసిని ఇద్దరు బిడ్డలతో కలసి గుంటూరులోని క్రిస్టియన్ పేటలో నివాసం ఉంటుంది. సురేష్ తరచూ సుహాసిని వద్దకు వచ్చి గొడవ పడుతూ ఉండేవాడు. తాను లేనప్పుడు ఎవరైనా వచ్చి గొడవ పెడితే డయల్ 100కు చేయాలని తల్లి కీర్తనకు చెప్పేది. అయితే గతకొంత కాలంగా సురేష్, సుహాసిని మధ్య మనస్పర్థలు తలెత్తడంతో.. ఆమెను పిల్లలను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని సురేష్ అదిరిపోయే ప్లాన్ వేశాడు. వారికి ఏమాత్రం అనుమానం రాకుండా బయటకు తీసుకు వెళ్లాలనుకున్నాడు.
శనివారం రాత్రి సురేష్.. సుహాసిని వద్దకు వచ్చి రాజమండ్రి వెళదాం అని చెప్పాడు. అక్కడ సరదాగా గడిపి బట్టలు కొనుక్కుని వద్దాం అని కారు వేసుకుని వచ్చి వీరిని నమ్మించాడు. దీంతో అంతా కలిసి శనివారం రాత్రి కారులో రాజమండ్రి బయలు దేరారు. ఆదివారం తెల్లవారు జామున రావులపాలెం వచ్చాక సుమారు 3 గంటల సమయంలో గౌతమీ నదిపై ఉన్న పాత వంతెన పైన కారు ఆపి అందరూ దిగుదామని చెప్పాడు. ముందు సుహాసిని, ఏడాది చిన్నారి జెర్సీను ఎత్తుకుని కారు దిగింది. సెల్ఫీ తీసుకుందామని చెప్పి సుహాసిని కాళ్లు ఎత్తి గోదావరిలోకి తోసేశాడు. ఆ తరువాత కారులో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్న కీర్తనను కారులో నుంచి దింపి గోదావరిలోకి ఎద్తిపడేశాడు.
బ్రిడ్జి కేబుల్ పైపును పట్టుకుని డయల్ 100కు..
బాలిక కీర్తనను గోదావరిలో తోసేసే క్రమంలో కిందకు పడిపోయిన కీర్తన వంతెనకు కేబుల్ పైప్‌ను బలంగా పట్టుకుంది. అయితే ఈ విషయం తెలియని సురేష్.. కారులో అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లిపోయాడు. వంతెన పక్కగా వేసిన కేబుల్ పైపు చేతికి అందడంతో దానికి చరుచుకుపోయింది కీర్తన. ఒక చేత్తో పైపును పట్టుకొని వేలాడుతూనే తన ప్రాణాలు ఎలా కాపాడుకోవాలా అని ఆలోచించింది. వెంటనే తన జేబులో ఉన్న ఫోన్ విషయం గుర్తుకు వచ్చింది. ఓ చేత్తో ఆ పైపును పట్టుకునే తన జేబులో ఉన్న సెల్‌ఫోన్ తీసి డయల్ 100కు ఫోన్ చేసింది. అప్రమత్తమైన పోలీసులు హైవే పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఫోన్ లొకేషన్ ఆధారంగా పది నిముషాల్లోనే అక్కడికి చేరుకున్నారు. చిన్నారి కీర్తనకు ఫోన్‌లో ధైర్యం చెబుతూనే ఆమెను రక్షించేందుకు అన్ని విధాలా అత్యంత వేగంగా ప్రయత్నించారు. 108 వాహనాన్ని సైతం అక్కడికి రప్పించి ఉంచారు.
చివరకు సురక్షితంగా వంతెన గొట్టానికి వేళాడుతున్న కీర్తనను బయటకు తీసి ప్రథమ చికిత్స అందించి డీఎస్పీ కార్యాలయానికి చేర్చారు. కీర్తన ద్వారా తన తల్లి, చెల్లిల సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రత్యేక బోట్లను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసి గాలించారు. అయితే వారు గోదావరి ప్రవాహ వేగానికి గల్లంతయ్యారు. కీర్తన ద్వారా నిందితుని వివరాలు సేకరించిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. చిన్నారి కీర్తనను కాపాడి పోలీసులను ఎస్పీ శ్రీధర్ అభినందించారు.