Chandrababu Health: జైల్లో చంద్రబాబు ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్ ఇదే, హెల్త్ బులిటెన్ రిలీజ్
Chandrababu Health: చంద్రబాబు ఆరోగ్యంపై రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. శనివారం సాయంత్రం దీనిని రిలీజ్ చేశారు.
Chandrababu Health: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై జైలు అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. శనివారం చంద్రబాబు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. జైలు సూపరింటెండెంట్ రాహుల్ పేరుతో ఈ హెల్త్ బులిటెన్ విడుదలైంది. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని ఇందులో పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని తరచూ ప్రత్యేక వైద్యులు పర్యవేక్షిస్తున్నారని, అవసరమైతే పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. మెడిసిన్స్ కూడా డాక్టర్లు సూచిస్తున్నారని బులిటెన్‌లో స్పష్టం చేశారు.
చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇటీవల గత కొద్దిరోజులుగా జైలు అధికారులు తరచూ హెల్త్ బులిటెన్ విడుదల చేస్తోన్నారు. ఇప్పటికే చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన నివేదికలను కుటుంబసభ్యులకు లిఖితపూర్వకంగా అందించాలని ఆయన తరపున న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు ఆరోగ్యంపై శ్రేణుల్లో ఆందోళన నెలకొందని, ఎప్పటికప్పుడు నివేదికలు విడుదల చేయాలని న్యాయవాదులు కోరుతున్నారు. దీంతో జైలు అధికారులు కొద్దిరోజులుగా హెల్త్ బులిటెన్ విడుదల చేస్తోన్నారు.
చంద్రబాబు ఆరోగ్యంపై ఇటీవల అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్దం చోటుచేసుకుంది. బాబుకు స్కిన్ అలర్జీ రావడంతో ఆయనను చల్లని వాతావరణంలో ఉంచాలని జైలు అధికారులకు వైద్యులు సూచించారు. దీంతో ఏసీ సౌకర్యం కల్పించాలని కోర్టులో చంద్రబాబు కుటుంబసభ్యులు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. బాబుకు టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో కోర్టు ఆదేశాలతో వెంటనే చంద్రబాబు రూమ్‌లో జైలు అధికారులు ఏసీ ఏర్పాటు చేశారు. అంతకుముందు చంద్రబాబు ఆరోగ్యం తీవ్రంగా ఉందనే వార్తలతో టీడీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అప్పటినుంచి రాజమండ్రి ప్రభుత్వ వైద్యులు రోజు చంద్రబాబుకు పరీక్షలు చేస్తుండగా.. జైలు అధికారులు ఆ డీటైల్స్‌ను మీడియాకు విడుదల చేస్తోన్నారు.
శుక్రవారం కూడా జైలు అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇందులో బాబుకు బీపీ 130/80 ఉండగా.. బాడీ టెంపరేచర్ సాధారణంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే పల్స్ 70, లంగ్స్, ఫిజికల్ యాక్టివిటీ బాగానే ఉన్నాయని తెలిపారు. కానీ నిన్నటి బులిటెన్‌లో మాత్రం చంద్రబాబు బరువు గురించి ప్రస్తావించలేదు. చంద్రబాబు 5 కేజీల బరువు తగ్గినట్లు ఆయన సతీమణి భువనేశ్వరి వ్యాఖ్యలు చేయడంతో.. బులిటెన్‌లో చంద్రబాబు బరువును కూడా మెన్షన్ చేస్తున్నారు. చంద్రబాబు జైలుకు వచ్చిన తర్వాత ఒక కేజీ బరువు పెరిగినట్లు అధికారులు చెబుతుండగా.. 5 కేజీలు తగ్గినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. దీంతో చంద్రబాబు బరువు చుట్టూ ఏపీ రాజకీయాల్లో వివాదం చెలరేగింది. అటు చంద్రబాబు వయస్సు, ఆరోగ్యం రీత్యా బెయిల్ మంజూరు చేయాలని కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరుగుతోంది. ఇక క్వాష్ పిటిషన్‌పై నవంబర్ 8న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. దీంతో ఈ తీర్పు కోసం టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు.