Kovvur Railway Station: కొవ్వూరులో రైళ్లను ఎందుకు ఆపడం లేదు ? ద.మ రైల్వే జీఎంను కలిసిన పురంధేశ్వరి
Rajamahendravaram MP Purandeswari | కొవ్వూరు రైల్వేస్టేషన్ లో 2019కి ముందు 36 రైళ్లు ఆగేవి. ఇప్పుడు 10 మాత్రమే ఆగుతున్నాయి. పుష్కరాలు జరగనున్న తరుణంలో పాత రైళ్ల కోసం డిమాండ్ పెరుగుతోంది.

తూర్పుగోదావరి జిల్లాలో అతి ముఖ్యమైన ఊళ్లలో కొవ్వూరు ఒకటి. రాజమండ్రి కి ఐదు కిలోమీటర్ల దూరంలో గోదావరి నదికి ఇవతలి వైపున ఉండే కొవ్వూరు ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ముఖ్యమైన ప్రాంతం. చెన్నై- హౌరా రైలు మార్గంలో తగిలే కొవ్వూరు రైల్వే స్టేషన్ లో 2019కి ముందు 36 రైళ్లు ఆగేవి. కొవ్వూరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అన్ని విధాల అనుకూలమైన రైల్వే స్టేషన్ ఇది. నోరు ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే కొవ్వూరు వచ్చి అక్కడ నుంచి రైలు మార్గంలో వెళ్లేవాళ్లు. దేవరపల్లి, పోలవరం, తాళ్లపూడి లాంటి ప్రాంతాలకు వెళ్లే ప్రజలు రాజమండ్రి వరకు వెళ్లే అవసరం లేకుండా కొవ్వూరు లోనే దిగి తమ తమ ఊళ్ళకు ఈజీగా చేరుకునేవారు. దీనివల్ల చాలా సమయం కలిసి వచ్చేది. అయితే ఇప్పుడు కొవ్వూరులో ఆగే రైళ్ల సంఖ్య చాలా తగ్గిపోయింది.
కొవ్వూరు లో ఆగే రైళ్లు ప్రస్తుతం ఇవే
2019లో కొవ్వూరు లో ఆగే చాలా రైళ్లను రద్దు చేసేసారు. రాజమండ్రి విజయవాడ మధ్య తిరిగే రెండు మెము ట్రైన్లు, కాకినాడ విజయవాడ, రాజమండ్రి -నరసాపురం మెము రైళ్లు మాత్రమే కొవ్వూరు లో ఆగుతున్నాయి. ప్రధాన రైళ్లలో కాకినాడ -లింగంపల్లి మధ్య తిరిగే గౌతమి ఎక్స్ ప్రెస్,పూరి/బిలాస్ పూర్ -తిరుపతి ఎక్స్ ప్రెస్ ఎక్స్ ప్రెస్ లు మాత్రమే ఇక్కడ నుండి అందుబాటులో ఉన్నాయి.

ఒకప్పుడు 36 రైళ్లు ఆగేవి
2019 కి ముందు విజయవాడ చెన్నై రూట్లో వెళ్లే 36 రైళ్లు ( 18 రైళ్లు ఒకవైపు, 18 రైళ్లు మరోవైపు ) కొవ్వూరు లో ఆగేవి. ఈ రైళ్ల లో గుంటూరు వైజాగ్ మధ్య తిరిగే సింహాద్రి ఎక్స్ ప్రెస్, కాకినాడ -చెన్నై (చెంగల్ పట్టు) మధ్య తిరిగే సర్కార్ ఎక్స్ ప్రెస్, గుంటూరు- రాయగడ,విశాఖ -తిరుపతి (తిరుమల) ఎక్స్ ప్రెస్ చాలా ముఖ్యమైన రైళ్లు. ఇప్పుడు అవేవీ కొవ్వూరులో ఆగడం లేదు. రైళ్ల వేగం పెంచే కారణంతో చాలా స్టేషన్లలో హాల్ట్స్ ఎత్తివేసింది రైల్వే శాఖ. అయితే గోదావరి జిల్లాల కత్తి ముఖ్యమైన కొవ్వూరులో ముఖ్యమైన రైళ్ల హాల్టింగ్ ఎత్తివేయడం ఇబ్బందికరంగా మారింది అన్న ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.

గోదావరి పుష్కరాల సమయంలో ఈ రైల్వే స్టేషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందరూ రాజమండ్రి వైపు వెళ్ళనవసరం లేకుండా గోదావరికి ఇవతల వైపునే స్నానాలు ఆచరించే అవకాశం భక్తులకు కలుగుతుంది. గోష్పాద క్షేత్రం లాంటి ప్రముఖమైన తీర్ధాలు కొవ్వూరు లోనే ఉన్నాయి. ఒకానొక దశలో కొవ్వూరు స్టేషన్ మొత్తాన్ని తీసేస్తారన్న ప్రచారం జరిగింది. దానితో 'కొవ్వూరు రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి ' పేరుతో ఇక్కడ ప్రజలు స్టేషన్ కోసం, ముఖ్యమైన రైళ్ల హాల్టింగ్ కోసం పోరాడుతున్నారు.

రైల్వే అధికారులను కలిసిన ఎంపీ పురంధ్రీశ్వరి
ప్రజల డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి ఎంపీ పురంధ్రీశ్వరి దక్షిణ మధ్య రైల్వే GM సంజయ్ కుమార్ శ్రీ వాత్సవ ను కలిసి కొవ్వూరులో అదనపు రైళ్లను ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై రైల్వే శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.





















