Kovvur Bhadrachalam Railway line: కొవ్వూరు -భద్రాచలం రైల్వే లైన్ ఎందుకు లేట్ అవుతోంది...? అదే కారణమా
40 ఏళ్లుగా కొవ్వూరు -భద్రాచలం రైల్వే లైన్ కోసం ఉమ్మడి గోదావరి, ఖమ్మం జిల్లాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఏపీ ప్రభుత్వం తమ ఖర్చు నిధులను విడుదల చేయనుంది.

Bhadrachalam Kovvur Railway line project | రాజమండ్రి: గోదావరి జిల్లాల ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొవ్వూరు -భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణం ఎంతకూ మొదలు కావడం లేదు. పుష్కరాలకు పుష్కరాలు గడిచిపోతున్నా ఈ రైల్వే లైన్ మాత్రం అలా వెనకబడిపోతూనే ఉంది.
రైల్వే మంత్రిని కలిసిన రాజమండ్రి ఎంపీ పురంధ్రీశ్వరి
కొవ్వూరు నుంచి భద్రాచలం వైపు రైల్వే లైన్ నిర్మాణం వేగవంతం చేయాలని కోరుతూ రాజమండ్రి ఎంపీ మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి ఇటీవల సికింద్రాబాద్ లో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీ వాత్సవ ను కలిశారు." ఈ రైల్వే లైన్ శాంక్షనై చాలా ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం ముందుకు సాగడం లేదనీ దీనిపై దృష్టి పెట్టాలని ఆమె దక్షిణ మధ్య రైల్వే GM ని కోరారు. సర్వే కూడా పూర్తి అయిపోయిన ఈ ప్రాజెక్ట్ నిర్మాణం మొదలు కావడం లేదని " ఆమె శ్రీ వాత్సవ కు తెలిపారు. గత 40 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు టూరిజం, సరుకు రవాణా, ప్రజల సౌకర్యాలపరం గా చాలా ముఖ్యమైన రైల్వే లైన్" గా ఆమె అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆలస్యం చేస్తోందా...?
ఈ ప్రాజెక్టు కే అయ్యే ఖర్చులో రాష్ట్ర వాటాగా 50 శాతం భరించాల్సి ఉంది. అలాగే కొంత భూసేకరణ కూడా జరగాలి. ఇదే విషయాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ వాత్సవ వివరంగా ఎంపీ దగ్గుబాటి పురంధ్రీశ్వరికి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తన వాటా ఇచ్చేసింది అనీ భద్రాచలం నుండి సత్తుపల్లి వరకూ లైన్ పూర్తి అయిపోయిందని ఏపీ ప్రభుత్వం ఇంకా తన వంతు వాటా ఇవ్వలేదని ఆ ప్రక్రియ పూర్తయితే కొవ్వూరు వైపు నుంచి కూడా పనులు ప్రారంభిస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం తెలిపినట్టు ఎంపీ కార్యాలయం ప్రకటించింది. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎప్పటికి ముందుకు వస్తుందో చూడాలి.

గోదావరి జిల్లాల కల -కొవ్వూరు -భద్రాచలం రైల్వే లైన్
40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కొవ్వూరు- భద్రాచలం రైల్వే లైన్ గోదావరి జిల్లాల ప్రజలకు ఎప్పటినుంచో ఒక కలగా ఉండిపోయింది. ప్రస్తుతం రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లాలంటే రంపచోడవరం మారేడుమిల్లి మీదుగా ఘాట్ రోడ్, లేదు గోపాలపురం, అశ్వరావుపేట, జంగారెడ్డి గూడెం మీదుగా మరో హైవే రూట్ ఉన్నాయి. ఇది కాకుండా గోదావరి మీదుగా లాంచీల్లో వెళ్లే అవకాశం ఉన్నా అది బాగా టైం తీసుకుంటుంది. పైగా మధ్యలో రెండు లాంచీలు మారాలి. అదే కొవ్వూరు- భద్రాచలం రైల్వే లైన్ వచ్చేస్తే ప్రజలకు ఖర్చు,టైం రెండూ కలిసి వస్తాయి. పైగా ఇంతవరకూ రైల్వే లైన్ లేని చాలా ప్రాంతాలకు ట్రైన్ వెళ్లే అవకాశం అందుబాటులోకి వస్తుంది. అవన్నీ అద్భుతమైన సీనిక్ బ్యూటీ ఉన్న ప్రాంతాలు కావడంతో టూరిజం పరంగానూ ఈ రైల్వే లైన్ లాభసాటిగా ఉంటుంది. పైపెచ్చు గిరిజన ప్రాంత రైతులకు తమ ఉత్పత్తులను ఈజీగా రవాణా చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది.

ఈ రూట్ పూర్తయితే వైజాగ్ -సికింద్రాబాద్, కాకినాడ -సింగరేణి మధ్య మరో రూట్ అందుబాటులోకి వచ్చినట్టు అవుతుంది. బొగ్గు, స్టీల్ లతో పాటు పారిశ్రామిక ఉత్పత్తులను ఈ రూట్లో ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అందుకే ఆ ప్రాంత ప్రజలు కొవ్వూరు- భద్రాచలం రైల్వే లైన్ ఎప్పుడు పూర్తవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
కొవ్వూరు - భద్రాచలం రైల్వే రూట్ ఇలా...
ప్రస్తుతానికి సమాచారం మేరకు కొవ్వూరు -భద్రాచలం రైల్వే లైన్ దేవరపల్లి,గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, దమ్మపేట, అశ్వరావుపేట, జీలుగుమిల్లి, సత్తుపల్లి లాంటి ఊళ్ళ గుండా సాగుతుంది. 2012-13 లో 119 కిమీ దూరం కవర్ చేసేలా 1445 కోట్లు వ్యయం తో శాంక్షన్ అయ్యింది. తరువాత దూరం 151 కిమీ లకు సవరించగా ప్రస్తుత వ్యయం ప్రకారం దాని ఖర్చు 2155కోట్లు కు చేరుకుంది. ఇందులో కేంద్రం 50%, ఆంధ్ర -తెలంగాణ కలిపి చెరో 50% పెట్టుకోవాలి.
తెలంగాణ తన వాటా ఇచ్చేయడంతో భద్రాచలం రోడ్ నుండి సత్తుపల్లి వరకూ (56కిమీ ) ఆల్రెడీ లైన్ పూర్తయింది. మిగిలిన రైల్వే లైన్ పూర్తి కావాలంటే ఆంధ్రప్రదేశ్ తన వాటా చెల్లించాలని రైల్వే అధికారులు చెబుతున్నారు. అలాగే ఈ రైల్వేలైన్ నిర్మాణానికి 2030ని ప్రస్తుత టార్గెట్ గా పెట్టుకున్నారు.





















