MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
AP Liquor Scam Case | ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ4గా ఉన్న వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆయనను పోలీసులు రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు.

YSRCP MP Mithun Reddy Remanded Till August 1 | విజయవాడ: ఏపీ మద్యం కుంభకోణం (AP Liquor Scam) కేసులో వైఎస్సార్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డికి ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరైన మిథున్ రెడ్డిని దాదాపు ఏడు గంటలపాటు సుదీర్ఘంగా విచారించిన అనంతరం శనివారం సాయంత్రం సిట్ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారని తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం విజయవాడ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డిని హాజరుపరిచారు.
వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు..
అంతకు ముందు సిట్ ఆఫీసు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఎంపీ మిథున్ రెడ్డిని తీసుకెళ్లారు. బీపీ, షుగర్, ఈసీజీ వంటి సాధారణ వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని డాక్టర్లు నిర్ధారించడంతో సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విజయవాడలోని ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరు పరిచారు. మిథున్ రెడ్డిపై సెక్షన్ 409, 420, 120(బీ), రెడ్ విత్ 34, 37, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్లు 35 7, 72, 8, 13(1)(2), 13(2) కింద కేసు నమోదు చేసినట్లు సిట్ కోర్టుకు నివేదించింది. సిట్ తరఫున కోటేశ్వరరావు, ఎంపీ మిథున్ రెడ్డి తరఫున నాగార్జున రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది.
ఎంపీ మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సి ఉందని ఆయనను గుంటూరు సబ్ జైలుకు తరలించాలని సిట్ లాయర్ కోరారు. వై కేటగిరి సెక్యూరిటీ ఉన్న నేత, ఎంపీ మిథున్ రెడ్డి అని ఆయనకు రిమాండ్ విధిస్తే నెల్లూరు జైలులో ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని ఎంపీ తరఫు లాయర్ కోరారు. ప్యానెల్ స్పీకర్ గా పనిచేసిన మిథున్ రెడ్డి అరెస్టుపై స్పీకర్ కు సమాచారం ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు.






















