RRR Movie: RRR ఆడుతున్న థియేటర్‌కు తుపాకీతో వచ్చిన యువకుడు, ఫోజులిస్తూ హల్ చల్ - భయపడిపోయిన జనం
East Godavari District: ఓ వ్యక్తి థియేటర్‌లో తుపాకీతో హల్ చల్ రేపాడు. అది చూసి సినిమాకు వచ్చిన జనం ఒక్కసారిగా భయపడిపోయారు.
RRR సినిమా విడుదల సంబరాలు తెలుగు రాష్ట్రాలు సహా దేశమంతా విపరీతంగా ఉన్న వేళ తూర్పు గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి థియేటర్‌లో తుపాకీతో హల్ చల్ రేపాడు. అది చూసి సినిమాకు వచ్చిన జనం ఒక్కసారిగా భయపడిపోయారు. గన్‌తో ఫొటోలకు ఫోజులిస్తూ స్థానికులను భయాందోళనలకు గురి చేశాడు. థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రదర్శితమవుతుండగా ఆ యువకుడు స్క్రీన్ ముందు గన్‌తో కేరింతలు కొడుతూ అటూ ఇటూ తిరిగాడు. అనంతరం యువకుడు థియేటర్ బయట గన్‌తో తిరుగుతుండగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న గన్‌ను స్వాధీనం చేసుకొని పరిశీలించగా.. అది డమ్మీ గన్ అని తేలింది. ఆ యువకుడు సినిమాలపై ఉన్న ఇష్టంతో సినిమా థియేటర్‌లో అలా గన్‌తో ఫోటోలకు ఫోజులిచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.
మరోవైపు, ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని విషాద పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మొత్తం నలుగురు మరణించారు. విజయవాడ అన్నపూర్ణ థియేటర్ లో RRR సినిమా సాంకేతిక కారణాలతో రద్దు అయ్యింది. దీంతో అభిమానుల ఆందోళనలతో థియేటర్ అద్దాలు ధ్వంసం చేశారు. దాంతో ఆగ్రహించిన అభిమానులు థియేటర్ అద్దాలను ధ్వంసం చేశారు.
అనంతపురంలో అభిమాని మృతి
అనంతపురం జిల్లాలో మాత్రం విషాదం చోటు చేసుకుంది. RRR సినిమా చూస్తూ గుండె పోటుతో ఓబులేసు (30) అనే అభిమాని మృతి చెందాడు. ఎస్‌వీ మాక్స్ థియేటర్‌లో RRR సినిమా చూస్తుండగా ఓబులేసు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చికిత్స నిమిత్తం ఓబులేసును స్నేహితులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తమ అభిమాన హీరో సినిమాలో కనిపించిన దృశ్యాలను చిత్రీకరిస్తూ ఓబులేసు కుప్పకూలిపోయినట్లు అతడి స్నేహితులు తెలిపారు. అయితే, ఓబులేసుకు గతంలోనే గుండె సమస్య వచ్చిందని, ఆ సమయంలో అతనికి స్టంట్ కూడా వేశారని స్నేహితులు తెలిపారు. అయితే, ఆ సమస్య ఉండగా.. RRR సినిమా చూస్తూ ఎమోషన్‌కు గురై గుండె పోటు వచ్చి ఉంటుందని స్నేహితులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
Chittoor: చిత్తూరు జిల్లాలో ముగ్గురు దుర్మరణం
మరోవైపు, చిత్తూరు జిల్లాలోనూ విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని వి.కోటకు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు చనిపోయారు. వీరు నేడు RRR విడుదల సందర్భంగా థియేటర్‌ను అలంకరించి ఇంటికి వెళ్తున్నారు. వి కోటలోని థియేటర్ ముందు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల సందర్భంగా భారీ కటౌట్లు కట్టి తిరిగి ఇంటికి బైక్‌పై వెళుతున్నారు. ఆ సమయంలో అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.