Montha Cyclone Impact: ఆంధ్రప్రదేశ్‌లో మొంథా బీభత్సం- నిలిచిపోయిన రాకపోకలు, విద్యుత్ సరఫరాకు అంతరాయం - విద్యాసంస్థలకు 31 వరకు సెలవులు
Montha Cyclone Impact: మొంథా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలమైంది. ఈ ప్రభావం మరో రెండు మూడు రోజులు ఉంటుందని తెలుసుకున్న అధికారులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

Montha Cyclone Impact: ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. కాకినాడ-మచిలీపట్నం అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన తుపాను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జోరువానలు పడుతున్నాయి. గాలులు కూడా అదే స్థాయిలో వీస్తున్నాయి. కోస్తా వ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించిన ప్రభుత్వం, ప్రజలెవరూ బయటకు రావద్దని హెచ్చరించింది. కాకినాడ పోర్టులో అత్యంత ప్రమాదకరమైన పదో నెంబర్ హెచ్చరికను జారీ చేసింది. తుపాను తీరం దాటుతున్న టైంలో వంద కిలోమీటర్లకుపైగా వేగంతో గాలులు వీచాయి.
వణికించిన తుపాను
ఏపీని వణికించిన మొంథా తుపాను తీరాన్ని రాత్రి 7 గంటల తర్వాత తాకినట్టు అధికారులు ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వర్షాలు, ఈదురు గాలులు వణికించాయి. ప్రభుత్వ అప్రమత్తమై ప్రాణ నష్టం తగ్గించగలిగింది. పూర్తిగా రాకపోకలను నిషేధించారు. ఉదయం ఆరు గంటల వరకు ప్రజలు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. జాతీయ రహదారిని, రైల్వే లైన్‌లను పూర్తిగా షట్ డౌన్ చేశారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వారికి వాహనదారులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ స్థాయిలో ఈదురు గాలులు వీస్తాయనే అంచనాలతో ప్రభుత్వం ఈ జాగ్రత్తలు తీసుకుంది. దీంతో భారీ స్థాయి ప్రమాదాలు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
ఎక్కడికక్కడ రెస్క్యూ టీంలు
తుపాను ప్రభావం ఏపీ వ్యాప్తంగా ఉన్నప్పటికీ ఎక్కువ ప్రభావం మాత్రం కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాలపై ఎక్కువగా కనిపిస్తోంది. ఈ జిల్లాలకు సమీపంలోనే తీరం దాటడంతో ఈ జిల్లాలను తుపాను అతలాకుతలం చేసింది. 403 మండలాలపై తుపాను ప్రభావం కనిపించింది. దీన్ని ముందే పసిగట్టిన ప్రభుత్వం ఆయా ప్రాంతాల ప్రజలను, అధికారులను అప్రమత్తం చేసింది. ఎక్కడికక్కడ క్యాంపులను ఏర్పాటు చేసింది. మెడికల్ టీంలను కూడా సిద్ధం చేసింది. రెస్క్యూ బృందాలను కూడా రెడీ చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునేలా సన్నద్ధమైంది.
31 వరకు విద్యా సంస్థలకు సెలవులు
తుపాను ధాటికి చాలా ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేల కూలిపోయాయి. వీటి కారణంగానే చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జోరు వానలోనే అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. పరిస్థితి అంత విధ్వంసకరంగా లేని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇంకా వర్షాలు పడుతూ గాలులు విపరీతంగా వీస్తున్న ప్రాంతంలో విద్యుత్ పునరుద్ధరించలేదు. ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని విద్యాసంస్థలకు 31 వరకు సెలవులు పొడిగిస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది.
జిల్లాల్లో అల్లకల్లోలం
తుపాను తీరం దాటే సమయంలో రాజోలు అల్లవరం మధ్య బీభత్సం సృష్టించింది. అంతర్వేది వద్ద అలలు భారీగా ఎగిసిపడ్డాయి. సముద్రపు అలలు లైట్‌హౌస్ కట్టడాలను తాకాయి. రాజోలు నియోజకవర్గం మొత్తం అంధకారంలోకి వెళ్లిపోయింది. పలు చోట్ల దెబ్బతిన్న సెల్ టవర్స్ దెబ్బతిన్నాయి. కొత్తవలస కిరొండోల్ లైన్లో బొర్రా- చిమిడిపల్లి మధ్యలో 66/6 కిలోమీటర్ వద్ద సమీపంలో ఉన్న టన్నల్ నంబర్ 32 A దగ్గర రైల్వే ట్రాక్ పై నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సుమారు 100 మీటర్ల దూరం వరకు ట్రాక్ కొట్టుకుపోయింది. బురద కూడా పేరుకుపోవడంతో రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. పాసింజర్ రైలుతోపాటు గూడ్స్ రైళ్లను కూడా ఆపేశారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు వరద నీరు ట్రాక్‌పైకి చేరకుండా డ్రైనేజ్ కాలువలకు మళ్లించే ప్రయత్నం చేశారు. తైడా రైల్వే స్టేషన్ గృహాలు వద్ద బండరాళ్లు విరిగిపడ్డాయి. త్యాడ, చిమిడిపల్లి సెక్షన్ మధ్య Km 59/18–19 వద్ద సొరంగం దగ్గర ట్రాక్‌పై బండరాళ్లు పడిపోయాయి.
గర్భిణిని సురక్షితంగా ఆసుపత్రికి చేర్చిన 108 వాహనం
అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన సాకేరి అనితకు పురిటినొప్పులు రావడం ఆసుపత్రికి బయల్దేరారు. ఇంతలో వారి ప్రాంతాన్ని వరద నీరు చుట్టుముట్టింది. వెంటనే 108కి ఫోన్ చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది గెడ్డవాగును సురక్షితంగా దాటించారు. అనంతరం ఆమెను డుంబ్రిగుడ ఆసుపత్రిలో చేర్పించారు.
అంధకారంలో కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో పూర్తిగా అంధకారంలో ఉన్నాయి. తుపాను ప్రభావంతో చెట్లు కూలి విద్యుత్ తీగలపై పడటంతో అంతరాయం ఏర్పడింది. మొంథా తుపాన్ ప్రభావంతో ఈదురు గాలులు ప్రభావంతో మచిలీపట్నంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బైపాస్ రోడ్డులోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో 33కేవీ విద్యుత్ లైన్ పై ప్లెక్సీ పడటం, మంగినపూడి బీచ్ రోడ్డులో కూడా విద్యుత్ వైర్లపై తాటి చెట్టు పడటంతో సరఫరాకు అంతరాయం కలిగింది. ఫలితంగా మచిలీపట్నం అంధకారమయమైంది.
కృష్ణాజిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ ఆంజనేయులు నేతృత్వంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. సమాచారం అందిన వెంటనే గంటల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకొని రోడ్లపై కూలిన వృక్షాలను తొలగిస్తున్నారు.
నిర్మానుష్యంగా హైవే-16
మొంథా తుపాను నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రాత్రి 7 గంటల నుంచి నేషనల్ హైవే–16పై అన్ని రకాల వాహనాల రాకపోకలను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేయాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. తుపాను తీవ్రతను పరిగణనలోకి తీసుకుని భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున వాహనాలను రహదారి పక్కన భద్రంగా నిలిపివేయాలని సూచించారు. వాహనదారులు తమ భద్రత కోసం సమీపంలోని పార్కింగ్ బేలు లేదా సురక్షిత ప్రదేశాల్లో వాహనాలు నిలిపివేయాలని పేర్కొన్నారు. ప్రజలు, డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు జిల్లా పోలీసులు సమన్వయ చర్యలు చేపట్టారని, ప్రయాణికులతో ఉన్న బస్సులను సురక్షిత ప్రదేశాలైన రెస్టారెంట్లు, హోటళ్లు, విశ్రాంతి కేంద్రాల్లో ఆపేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అత్యవసర సేవల వాహనాలు, అంబులెన్సులు, ఫైర్ సర్వీసులు, పోలీసు వాహనాలు, అవసరమైన ప్రభుత్వ వాహనాలు మాత్రం ఈ ఆంక్షల పరిధిలోకి రావని స్పష్టం చేశారు.





















