Konaseema News: అమలాపురం ఘటనకి చంద్రబాబు, పవనే కారణం - రాష్ట్రానికి ఏకైక విలన్ ఆయనే: దాడిశెట్టి రాజా
Dadisetti Raja: ఆందోళనకారులు జై జనసేన.. జై పవన్ కల్యాణ్.. అంటూ నినాదాలు చేయడాన్ని రాష్ట్రప్రజలంతా టీవీల్లో చూశారని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు.
![Konaseema News: అమలాపురం ఘటనకి చంద్రబాబు, పవనే కారణం - రాష్ట్రానికి ఏకైక విలన్ ఆయనే: దాడిశెట్టి రాజా Minister Dadisetti raja accuses Chandrababu Pawan Kalyan over Konaseema Amalapuram incident Konaseema News: అమలాపురం ఘటనకి చంద్రబాబు, పవనే కారణం - రాష్ట్రానికి ఏకైక విలన్ ఆయనే: దాడిశెట్టి రాజా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/25/17b586567c2f0496771a9d55086a066e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అమలాపురం విధ్వంసం వెనుక చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉన్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. రాష్ట్రానికి ఏకైక విలన్ చంద్రబాబే అంటూ ఆయన అభివర్ణించారు. రాష్ట్ర ప్రజలన్నా, వ్యవస్థలన్నా బాబుకు భయం లేకపోవడం వల్లే విధ్వంసకర చర్యలు జరుగుతున్నాయని అన్నారు. ఆందోళనకారులు జై జనసేన.. జై పవన్ కల్యాణ్.. అంటూ నినాదాలు చేయడాన్ని రాష్ట్రప్రజలంతా టీవీల్లో చూశారని అన్నారు. అమలాపురం విధ్వంసంలో నిందితులు ఎవరైనా వదిలిపెట్టేదిలేదని హెచ్చరించారు.
మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. ‘‘కోనసీమ జిల్లాకు కోనసీమ - అంబేడ్కర్ పేరు పెట్టాలని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి, మరికొన్ని పార్టీలు వినతిపత్రాలు ఇచ్చాయి. మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజలు మొత్తంగా ఏకకంఠంతో కోనసీమ-అంబేడ్కర్ జిల్లాకు మద్దతు పలికారు. ప్రభుత్వం ఆ విధంగా ముందుకువెళ్ళి నిర్ణయం తీసుకున్నాక, టీడీపీ, జనసేన పార్టీలు అగ్గి రాజేశాయి. టీడీపీ, జనసేన లు సమన్వయంతో కుట్రలు చేస్తూ, ప్రజల ముందు ఒకరకంగా, ప్రజలు వెనుక మరోరకంగా మాట్లాడుతూ, ప్రశాంతంగా ఉన్న కోనసీమలో చిచ్చు పెట్టారు. ఇటువంటి కుట్ర రాజకీయాలను రాష్ట్ర ప్రజలంతా ముక్త కంఠంతో ఖండించాలి. అటువంటి పార్టీలను శిక్షించాలి.
ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి వరకు రాష్ట్రానికి ఏకైక విలన్ ఎవరన్నా ఉన్నాడంటే.. అది చంద్రబాబు నాయుడే. ఎన్టీఆర్ గారి నుంచి వైఎస్ఆర్ గారు, కేసిఆర్, వంగవీటి మోహన్ రంగా, జగన్ గారి వరకు.. అందరికీ విలన్ చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు మచ్ఛలను కవర్ చేయడానికి పచ్చ మీడియా, ఎల్లో ఛానల్స్, వ్యవస్థల్లోని కొంతమంది వ్యక్తులు తనకు ఉన్నారన్న నమ్మకంతోనే చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు. కొన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని, ప్రజలంటే భయం లేకుండా, రాష్ట్ర ప్రజలతో తన ఇష్టం వచ్చినట్లుగా చెత్త రాజకీయం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
అమలాపురం ఘటనల్లో నిందితులను ఎవరైనా ప్రభుత్వం వదిలిపెట్టదు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుంటాం. దర్యాప్తు జరుగుతుంది. నేరం చేసిన వారికి, తగిన శిక్షలు కూడా పడతాయి. నాడు తుని ఘటనకు కూడా చంద్రబాబే కారణం.. ఈరోజు అమలాపురంలో విధ్వంసం జరగటానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ళకు నిప్పు పెట్టడం, విధ్వంసం చేయడానికి కూడా బాబే కారణం. ఒక రైలును తగులబెట్టాలంటే.. అగ్గి పెట్ట గీసి వేస్తే మంటలు రావు... అదే ట్రైన్ లో ప్రయాణించి, ట్రైన్ లోపల నుంచే నిప్పు పెట్టి, అప్పట్లో తుని విధ్వంసానికి పాల్పడ్డారు. అదేరీతిలో, ఈరోజు కూడా పక్కా ప్రీ ప్లాన్డ్ గానే వైఎస్ఆర్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై దాడులు చేశారు. ఇందుకు కారణం.. చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలన్నా, వ్యవస్థలన్నా భయం లేకపోవడమే.
కోనసీమలో ఉన్న ప్రజలంతా ముక్తకంఠంతో కోనసీమ-అంబేడ్కర్ జిల్లాను కోరుకున్నారు. ప్రశాంతమైన కోనసీమలో చంద్రబాబు, పవన్ లు కలిసి అలజడిని సృష్టించి ప్రశాంతతను పాడు చేస్తున్నారు. ప్రజలంటే భయం, గౌరవం లేని వ్యక్తులే ఇలాంటి పనులు చేయగలరు. అటువంటి వ్యక్తి చంద్రబాబే. అందుకే అడ్డమైన రాజకీయం చేయడానికి చంద్రబాబు వెనుకాడడు.
కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్ చేయలేదా? జనసేన పార్టీ తరఫున, మీరు కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వలేదా? అంబేడ్కర్ పేరు పెట్టాలని జనసేన దీక్షలు చేయలేదా? ప్రజలు, మేధావుల కోరిక మేరకు కోనసీమ- అంబేడ్కర్ జిల్లాను ప్రకటిస్తే.. బహిరంగంగా ఒక మాట, వెనుక మరో మాట మాట్లాడటం పవన్ కల్యాణ్ కు సరికాదు.
అమలాపురం ఘటనలో.. ప్రభుత్వం తక్షణమే స్పందించి, చర్యలు తీసుకున్నది కాబట్టే, అల్లర్లు అగాయి. చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా పోలీసులను రప్పించి, రాత్రి 9 గంటల నుంచి పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చింది. అమలాపురం విధ్వంసం వెనుక ఎవరున్నారనే దానికి.. నిన్న మీడియాలో వచ్చిన వీడియో క్లిప్స్ చూస్తే అర్థమవుతుంది. అన్ని టీవీల్లోనూ, పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళుతున్న ఆందోళనకారులు జై జనసేన.. జై పవన్ కల్యాణ్.. అంటూ నినాదాలు చేయడాన్ని రాష్ట్ర ప్రజలంతా చూశారు.
పవన్ కల్యాణ్ సహకారంతో చంద్రబాబే ఇవన్నీ చేస్తున్నాడు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తే.. ఖాళీ రోడ్లకు దండాలు పెట్టుకుంటూ, చేతులు ఊపుకుంటూ వెళ్ళాడు. ఆ పరిస్థితిని చూసి తట్టుకోలేక, ఇప్పుడు కులాలు, మతాల మధ్య చంద్రబాబు గొడవలు పెడుతున్నాడు.
గడపగడపకు ప్రభుత్వంలో భాగంగా, మేం ప్రతి గడపకు వెళుతున్నాం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారు. ప్రతి కుటుంబానికి ఇంత చేస్తున్న జగనన్నను ప్రతి ఒక్కరూ తమ సొంత బిడ్డ, అన్న, తమ్ముడు అని ఆప్యాయంగా చెబుతున్నారు. ఈ పరిస్థితిని చూసి, చంద్రబాబుకు కన్నుకుట్టి, ఇటువంటి కుట్ర రాజకీయాలను చేస్తున్నాడు.’’ అంటూ మత్రి దాడి శెట్టి రాజా ఆరోపణలు చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)