చిట్టి రోబో లాంటి ఫ్రెండ్.. టెక్ ప్రపంచాన్ని షేక్ చేయనున్న ఏజెంటిక్ AI
మీరు OG సినిమాకు వెళ్లాలి అంటే మీ టిక్కెట్ మీరే బుక్ చేసుకుంటున్నారు కదా. ఏ హాల్లో టికెట్లు ఉన్నాయి. ఎంత రేట్ లో ఉన్నాయి. వెనుక వరుసల్లో సీట్లు ఉన్నాయా లేదా ముందు కూర్చోవాలా ఇవన్నీ చెక్ చేసుకుంటున్నాం కదా. ఇంక కొద్ది రోజులు ఆగితే మనం ఇంత కష్టపడక్కర్లేదు. నేను SSMB 29 కి వెళ్లాలనుకుంటున్నారు. టికెట్ బుక్ చేయి అని కమాండ్ ఇస్తే చాలు...టెక్నాలజీ అదే యాప్స్ ను వెతుక్కుని మనకు కావాల్సిన బెస్ట్ సీట్స్...బెస్ట్ థియేటర్ ఇన్ పుట్స్ తీసుకుని..టిక్కెట్లు కూడా బుక్ చేసి..వెళ్లండి సార్ అని ఇస్తుంది. ఏంటీ నమ్మట్లేదా..మనందరం ఇప్పుడు విచ్చలవిడిగా వాడేస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కి అడ్వాన్స్డ్ వెర్షన్ ఏజెంటిక్ AI వచ్చేస్తోంది. నమ్మశక్యంగా లేదా..అసలేంటీ ఏజెంటింక్ AI..ఈ టెక్నాలజీ వల్ల లాభనష్టాలేంటీ..ఈ వారం టెక్నలాజియాలో మాట్లాడుకుందాం.
మనందరం రజినీకాంత్ రోబో సినిమా చూశాం కదా. అందులో సైంటిస్ట్ వశీకర్ చెప్పినట్లుగా చిట్టి రోబో చేసే పనులు గుర్తున్నాయిగా. అచ్చం అలాంటిదే ఏజెంటిక్ AI కూడా. అంటే ఫిజికల్ గా ఆ హ్యూమనాయిడ్ రోబో రూపం ఉండదు కానీ కమాండ్స్ ప్రోసెస్ ను చేసుకోవటం...సొంతంగా నిర్ణయాలు తీసుకోవటం..మనం చెప్పిన పనిని చేసి పెట్టడం ఇక్కడ వరకూ ఏజెంటిక్ AI చేసి పెడుతుంది. జనరల్ గా ఇప్పుడు మనం వాడుతున్న AI టూల్స్ అయిన ఛాట్ జీపీటీ, జెమినై, పర్ ప్లెక్సిటీ ఇవన్నీ ఏం చేస్తున్నాయి. మనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే ఇస్తున్నాయి. కానీ ఏజెంటిక్ AI మాత్రం మనం ఇచ్చే టాస్క్ లను మొత్తం అదే సొంత నిర్ణయాలు తీసుకుంటూ పూర్తి చేసి పెడుతుంది. పేరులోనే ఉన్నట్లు ఈ AI మన పనులన్నింటినీ ఓ ఏజెంట్ లా చేసి పెడుతుందన్నమాట. అందుకే ఆ పేరు. ఈ టెక్నాలజీ ద్వారా అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయి. మ్యాన్ పవర్ పై పెడుతున్న డబ్బులు కంపెనీలకు మిగలటంతో పాటు కంప్లీట్ ఆటోమేషన్ కారణంగా హ్యూమన్ ఎర్రర్ కి ఛాన్సే లేకుండా పనులు చక్కబెట్టొచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
AI పై పరిశోధనలైనప్పుడే ఏజెంటిక్ AI పైనా ప్రయోగాలు మొదలయ్యాయి. అయితే ఏజెంటిక్ AI ను వినియోగించటంలో ఎన్ని లాభాలు ఉంటాయో అన్నే సవాళ్లు కూడా ఉంటాయి. అందుకే ఈ టెక్నాలజీ నార్మల్ పీపుల్ చేతుల్లోకి రావటానికి కాస్త టైమ్ పట్టింది. బట్ ఇప్పుడు ప్రపంచమంతా ఆటోమేషన్ వైపు పరుగులు తీస్తున్న టైమ్ లో ఏజెంటిక్ AI ని వీలైనంత త్వరగా మార్కెట్లోకి తీసుకురావాలని టాప్ టెక్ కంపెనీలన్నీ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. OpenAI, Microsoft, GitHub, AWS లాంటి సంస్థలు ఏజెంటిక్ AIను డెవలప్ చేసి ఓ ఫినిషింగ్ ప్రొడక్ట్ గా ప్రజలకు పరిచయం చేయాలని కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి.
Agentic AI బిజినెస్ వైపు ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏజెంటిక్ AI మార్కెట్ విలువ 6లక్షల కోట్లుగా ఉంది. 2032 నాటికి ఈ బిజినెస్ 200 బిలియన్ డాలర్స్ అంటే 16లక్షల కోట్లు కావొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బిజినెస్ లో నార్త్ అమెరికా మార్కెట్టే 40 నుంచి 46శాతం వరకూ హోల్డ్ చేస్తోంది. ఇండియా విషయానికి వస్తే ప్రపంచంలో ఉన్న ఏ AI కంపెనీకైనా సరే 40 శాతం బేస్ ఇండియన్ మార్కెట్టే. మనోళ్లు AI ను అంతలా వాడేస్తున్నారు. 2026నాటికి 90శాతం భారత కంపెనీలు తమ వ్యాపారంలో AI ను భాగస్వామ్యం చేస్తారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇంత అగ్రెసివ్ గా ఉన్న భారత్ ఏజెంటిక్ AI ను కూడా అంతే ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకోగలదని అందరూ విశ్వసిస్తున్నారు.
సరే దీని వల్ల ప్రాబ్సమ్ ఏం రావా అంటే అదే అసలు. కొద్ది రోజుల క్రితం మన కింగ్ నాగార్జున ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు చూశారు. ఆయన పర్సనాలిటీ రైట్స్ మీద ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. అంటే ఇప్పుడు వస్తున్న సాంకేతికత సాయంతో నాగార్జున వాయిస్ ను ఇమిటేట్ చేసినా..ఫేషియల్ ఫీచర్స్ ను వాడుకున్నా...అదంతా ఆయన పర్మిషన్ తో జరగాలి లేదంటే వాడుకున్న వాళ్లు చట్టప్రకారం శిక్షకు అర్హులవుతారు. అంటే AI తీసుకువస్తున్న మార్పులు ఇలా మనుషల్లో భయాలను కూడా నింపుతున్నాయి. ప్రైవసీ థెఫ్ట్, సెక్యూరిటీ రిస్క్, హ్యాకింగ్ లాంటి భయాలు ఏజెంటిక్ AI వల్ల ఉంటాయని టెక్ నిపుణులే భయపడుతున్నారు. అయితే ఎలా వాట్సప్ లాంటి వాటికి ఎండ్ టూ ఎండ్ ట్రాన్స్ స్క్రిప్షన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయో అలానే ఏజెంటింక్ AI ను కొన్ని పనులకు మాత్రమే పరిమితం చేస్తూ టెక్ కంపెనీలు పబ్లిక్ డొమైన్ లోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాయి. అదే జరిగితే మరో రెండేళ్లలో ప్రతీ మనిషికి సాంకేతికతంగా చిట్టి రోబో లాంటి ఫ్రెండ్ చేతిలో ఉన్నట్లే.






















