Vahana Mitra scheme: అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి నగదు, జాబితాలో పేరు లేకపోతే టెన్షన్ వద్దు: సీఎం చంద్రబాబు
ఆటో డ్రైవర్లకు రూ.15వేల సాయం అందజేసే ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమాన్ని అక్టోబర్ 4న ప్రారంభిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శాసనసభలో శనివారం ఆయన మాట్లాడారు.

CM Chandrababu about Vahana Mitra scheme: ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి పనిచేస్తున్నామని, ఊపిరి ఉన్నంత కాలం పేదల కోసమే పనిచేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. శాసనసభలో శనివారం ఆయన మాట్లాడారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నందునే 15 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేయగలిగామని తెలిపారు. ప్రధాని మోదీ, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహకారంతో ప్రభుత్వం ఎంతో అంకితభావంతో పనిచేస్తోందని చెప్పారు.
అర్హుల పేర్లు లేకపోతే జాబితాలో చేర్చుతాం
ఆటో డ్రైవర్లకు రూ.15వేల సాయం అందజేసే ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమాన్ని అక్టోబర్ 4న ప్రారంభిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఏమైనా కారణాలతో అర్హుల పేర్లు లేకపోతే గ్రీవెన్స్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి జాబితాలో చేర్చుతామని చెప్పారు. ఎమ్మెల్యేలంతా రాష్ట్ర పునర్నిర్మాణానికి పాటుపడాలని సీఎం పిలుపునిచ్చారు. వ్యక్తిగత ఎజెండాతో పనిచేస్తే రాష్ట్రాభివృద్ధి లక్ష్యానికి ఆటంకం కలుగుతుందని అన్నారు.
‘స్త్రీశక్తి’తో ఎంతో సంతృప్తి
తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిన పథకం ‘స్త్రీశక్తి’ అని ఏ ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో 8.86 కోట్ల మంది ఉచిత ప్రయాణాలు చేశారని తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చామన్నారు. ఈ పథకం అమలు కోసం డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది సమర్థంగా పనిచేస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు 8.86 కోట్ల మంది ఫ్రీగా ప్రయాణం చేశారని, ఇందుకు ఏడాదికి రూ.2,963 కోట్లను ప్రభుత్వం చర్చు చేస్తోందని తెలిపారు.
తొలిరోజే 97 శాతం మందికి ఫించన్లు
ప్రతినెలా అందించే ఫించన్ల కార్యక్రమంలో పాల్గొనడం సంతృప్తికరంగా ఉందని చంద్రబాబు అన్నారు. వాలంటీర్లు లేకపోతే ఫించన్లు ఇవ్వలేమని గత ప్రభుత్వం పేర్కొందని.. వృద్ధులు లైన్లో నిలబడి చనిపోతే ఆనందపడ్డారని సీఎం విమర్శించారు. ఇప్పుడు సచివాలయం సిబ్బందితో కలిసి తొలిరోజే 97 శాతం మందికి ఫించన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ‘తల్లికి వందనం’ పథకాన్ని సమర్థంగా అమలు చేస్తున్నామన్నారు.
ఏటా లక్ష మంది పారిశ్రామికవేత్తలుగా..
ఏటా లక్ష మంది స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం అన్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో వెయ్యి మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా కృషి చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల రుణాల రికవరీ అద్భుతంగా ఉందని కొనియాడారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. విశాఖకు త్వరలోనే గూగుల్ సంస్థ రాబోతున్నట్లు చెప్పారు. గూగుల్ సంస్థ ప్రతినిధులతో లోకేశ్ మాట్లాడారని పేర్కొన్నారు.
దీపావళికి ముందే 3 లక్షల మంది పేదలకు ఇళ్లు
రైతులకు అండగా నిలుస్తున్నామని సీఎం చెప్పారు. రైతు కుటుంబం నుంచి వచ్చి అన్నదాతకు అండగా నిలుస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ‘పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా వచ్చే దీపావళికి ముందే 3 లక్షల మంది పేదలకు ఇళ్లు అందిస్తామన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి 6.15 లక్షల ఇళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని, 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో అనేక అపవిత్ర కార్యకలాపాలు చేశారని చంద్రబాబు అన్నారు. రామతీర్థంలో రాముడి తలను నరికేశారని, అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టారని, దుర్గమ్మ గుడిలో వెండి సింహాలను దొంగిలించారని పేర్కొన్నారు.





















