Ambati Rambabu: పోలవరంలో ఆ పనుల కోసం కేంద్ర నిధులు రావాల్సిందే, ప్రాజెక్టు సందర్శించిన అంబటి
మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుని పరిశీలించినట్లు చెప్పారు.
ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టులో దిగువ కాఫర్ డ్యాం వద్ద జరుగుతున్న డీ వాటరింగ్ పనులను మంత్రి పరిశీలించారు. తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ఉన్న సీ ఫేజ్ నీటిని మరల్చడానికి నిర్మాణం చేస్తున్న కాలువల పనులను కూడా మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. అంబటి రాంబాబు వెంట చీఫ్ ఇంజినీర్ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి ఉన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుని పరిశీలించినట్లు చెప్పారు. లోయర్, అప్పర్ కాఫర్ డ్యాంల మధ్య ఏరియాలో డీ వాటర్ వర్క్స్ జరుగుతున్నాయని అన్నారు. డీ వాటరింగ్ పనుల తర్వాత వైబ్రో కాంపాక్ట్ పనులు మొదలు పెడతామని చెప్పారు. లోయర్, అప్పర్ కాఫర్ డ్యామ్ ల మధ్య.. సీఫేస్ ఎక్కువ ఉండటం వల్ల పనులకు ఆటంకం కలుగుతుందని అన్నారు. లోగడ నిర్మించిన డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని, దానికి సమాంతరంగా కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టే విషయంలో కేంద్ర జలశక్తి విభాగం ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.
పోలవరం నిర్వాసితుల సమస్యను పరిష్కరించడం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి తెలిపారు. 41.15 కాంటూరు వరకు టీడీపీ హయాంలో వేసిన అంచనా వ్యయానికి, ఇప్పటికి ఖర్చు పెరిగిందని చెప్పారు. 41.15 వరకు రూ.31,625 కోట్లతో సీడబ్ల్యూసీ రివైజ్డ్ కాస్ట్ కమిటీకి బిల్లు పంపినట్లు మంత్రి వివరించారు. 45.72 కాంటూరు వరకు మరో రూ.16 వేల కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పారు. 41.15 వరకు పూర్తి అయ్యాక మిగిలిన వాటి పనుల గురించి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని, దీనికి సంబంధించి ప్రధాని మోదీని కూడా సీఎం జగన్ కలిసి మాట్లాడారని మంత్రి అంబటి రాంబాబు వివరించారు.