Konaseema District News: సంక్రాంతికి కోనసీమలో పందేలు లేనట్లేనా - పక్క జిల్లాకు క్యూ కడుతున్న పందెం రాయుళ్లు
Konaseema District News: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. దీంతో ఈసారి పందేలు లేనట్లు తెలుస్తోంది.
Konaseema District News: ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగలో కోడి పందేలంటే భీమవరం తరువాత కోనసీమ కూడా అంతే స్పెషల్. ఒక్క మాటలో చెప్పాలంటే భీమవరం కంటే కూడా కోనసీమలోనే గ్రామ గ్రామాన పందేలు జోరుగా సాగుతుంటాయి. సంక్రాంతి పండుగ సంబరం ఎలా ఉన్నా దేశ విదేశాల నుంచి సైతం కోడిపందేలు కోసం రెక్కలు కట్టుకుని వాలిపోతుంటారు ఇక్కడికి చాలా మంది. అయితే అమలాపురం అల్లర్ల తరువాత శాంతి భద్రతలను సమర్ధవంతంగా కాపాడేందుకు సరైన అధికారిని నియంమించాలన్న ఆలోచనలో భాగంగానే "ఎవ్వరి మాట వినడు.." అనే ప్రత్యేక పేరును సంపాదించుకున్న ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డిని అనూహ్యంగా తెరమీదకు తీసుకొచ్చి యుద్ధప్రాతిపదికన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం.
వచ్చీ రాగానే పోలీస్ అంతర్గత వ్యవస్థపై దృష్టి సారించిన ఎస్పీ పలు పోలీస్ స్టేషన్లలో కింగ్ మేకర్లుగా ఉంటున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై వేటు వేశారు. ఆకస్మిక బదిలీలతో బెంబేలెత్తించారు. పలువురు ఎస్సైలను సస్పెండ్ చేశారు. పలువురుకి వార్నింగ్‌లు ఇచ్చారు. అమలాపురం అల్లర్ల కేసుల్లోనూ నిష్పక్షపాతమైన దర్యాప్తు చేసి పలువురికి విముక్తి కల్పించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కోనసీమలో కోడి పందేలు జరుగుతాయా లేదా అన్న అనుమానం చాలా మందిలో ఉండేది. కానీ ఆయన తాజాగా పెట్టిన మీడియా సమావేశంలోని విషయాలు వింటే కచ్చితంగా అక్కడ కోడి పందేలు జరగవని తెలుస్తోంది. కోడిపందేలు ఆడితే ఊరుకునేది లేదని, చాలా సీరియస్‌గా చెప్పారు ఎస్పీ. దీంతో ఈ జిల్లాలో పందేలు జరిగే ప్రసక్తే లేదని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పందెం రాయుళ్లందరూ పక్క జిల్లా కాకినాడకు వెళ్తున్నారు. అక్కడే పందేలు జరుపుకోవాలని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు.
కాకానాడ జిల్లాలో బరులు..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాకు ఎస్పీగా బాద్యతలు నిర్వర్తిస్తున్న సుధీర్ కుమార్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాకు ఇంచార్జ్ ఎస్పీగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లోనూ కోడి పందేలు జరగవనే నిర్ధారణకు వచ్చారు పందెం రాయుళ్లు. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లా పరిధిలోని తాళ్లరేవు, కోరంగి, కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ప్రాంతాల్లో పందేలు బరులు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే అమలాపురం, కాకినాడ బైపాస్ రోడ్డుకు సమీపంలో తాళ్లరేవు గ్రామ పరిధిలోకి వచ్చే 20 ఎకరాల విస్తీర్ణంలో బరులు సిద్ధం చేస్తున్నారు. కోనసీమ జిల్లా పరిధిలో ఉండే ముమ్మిడివరం, కాట్రేనికోన, అల్లవరం తదితర ప్రాంతాల్లో ఉండే పెద్దబరులు ఈసారి లేనట్లేనని తెలుస్తోంది.
బరులు సిద్ధం చేస్తే కేసులు..
జిల్లా పరిధిలో ఎక్కడైనా బరులు సిద్ధం చేస్తే వారు ఎంతటివారైనా వెంటనే కేసులు నమోదు చేయాలని ఇప్పటికే ఎస్పీ అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో డీఎస్పీలకు, సీఐ, ఎస్సైలకు స్ఫష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఇందులో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా వారిపై చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చిరించినట్లు తెలుస్తోంది. దీంతో ముందస్తుగానే పోలీసులు బరుల నిర్వాహకులకు ఇందులో మేము ఏం చేసేది లేదని, బరులు సిద్ధం చేస్తే కేసుల్లో ఇరుక్కుంటారని చెబుతుండడంతో ఎవరికి వారు బరులు సిద్ధం చేసే బాధ్యతలను మీద వేసుకోవడం లేదని తెలుస్తోంది. అయితే కనీసం సంక్రాంతి పండుగ మూడు రోజునైనా ఎక్కడో చోట పందేలు జరుపుకునేలా చూడండంటూ ప్రజాప్రతినిధలు వద్దకు వెళ్లి మొర పెట్టుకుంటున్నారట పందెం రాయుళ్లు. అయితే వారు మాత్రం ఎస్పీ మా మాట కాదు కదా ఎవ్వరి మాటా వినడు ఈ సారికి వదిలేయండి అని చెబుతున్నట్లు సమాచారం. చూడాలి మరి కోనసీమలో ఈ సారి కోడి కాలుదువ్వుతుందో, లేక ఖాకీ కంట్రోల్ చేస్తుందో.!