Forced Marriage: పరాయి వ్యక్తితో మాట్లాడిందని దారుణం, ఆ వ్యక్తితో వివాహితకు బలవంతంగా పెళ్లి!
తెల్లవారుజామున వాకింగ్ వెళ్తున్న వ్యక్తితో మాట్లాడినందుకు అతనితో అక్రమ సంబంధం అంటగట్టి ఆ వ్యక్తితో తనకు బలవంతపు పెళ్లి చేశారని భర్త, అత్తమామలు, పెద్దలపై ఓ వివాహిత ఫిర్యాదు చేసింది.

Forced marriage in Konaseema | ఈ మధ్య సొసైటీలో విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తెలిసిన వ్యక్తి కదా అని కొంచెం చనువుతో మాట్లాడుతున్న వ్యక్తితో అక్రమ సంబంధం అంటగట్టిన అత్తింటివారు.. చివరికి కోడలికి ఆ వ్యక్తితో పెళ్లి చేసిన షాకింగ్ ఘటన బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు పిర్యాదు చేసిన కోడలు తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన ముమ్మిడివరం మండలంలోని ఠాణేలంక గ్రామం చినలంకలో మంగళవారం జరిగింది. తనకు జరిగిన అన్యాయంపై బాధిత మహిళ పోలీసులకు పిర్యాదుచేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
కేవలం మాట్లాడితే అక్రమ సంబంధం అంటగడతారా?
ఠాణేలంక గ్రామంలో బాధితురాలు అదే గ్రామంలో పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తోంది. మంగళవారం తెల్లవారు జామున అటువైపుగా వాకింగ్‌కు వెళ్తున్న ఇదే గ్రామంలోని వార్డు సభ్యునిగా వ్యవహరిస్తున్న ఇసుకపట్ల ఈశ్వర్‌కుమార్‌తో తన ఉద్యోగం విషయం గురించి మాట్లాడింది. అంతలో అత్తింటి వాళ్లు చూసి తనకు, వార్డు సభ్యునికి సంబంధం అంటకట్టారని ఫిర్యాదులో పేర్కొంది. అదే రోజు గ్రామ పెద్దల సమక్షంలో తగువు పెట్టి అంబేడ్కర్ విగ్రహం వద్ద తన మాట వినకుండా ఈశ్వర్‌కుమార్‌తో బలవంతంగా పెళ్లి జరిపించారని వాపోయింది.. బాధితురాలు భర్త కూడా ఇదే పాఠశాలలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. తన భర్త, అత్తింటి వాళ్లు కలిసి లేనిపోనివి అంటగట్టి పెద్దలకు చెప్పడంతో అంతా కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారని భర్త, అత్తమామలు, గ్రామ పెద్దలపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.. ఇదిలా ఉంటే వివాహితతో వివాహం జరిపించిన వార్డు సభ్యుడు ఈశ్వర్ కుమార్‌కు ఇదివరకే వివాహం అయ్యింది.
కేసు నమోదు చేసిన పోలీసులు...
వివాహితకు వేరే వ్యక్తితో బలవంతంగా వివాహం జరిపించారన్న బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ముమ్మిడివరం ఎస్సై డి.జ్వాలాసాగర్ గ్రామంలో బుధవారం విచారణ చేపట్టారు.. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, బాధితురాలి ఫిర్యాదుపై నిందితులపై కేసులు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

