Jogi Ramesh: రంగాని చంపింది టీడీపీ, చంద్రబాబు! వారికే పవన్ కళ్యాణ్ సపోర్ట్- జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు
YSRCP Samajika Sadhikara Yatra: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రంగాని పొట్టనపెట్టుకుంది ఈ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు అని ప్రజలు గుర్తించాలన్నారు మంత్రి జోగి రమేష్. సైకిల్ గుర్తును ఓడించాలన్నారు.
AP Minister Jogi Ramesh fires on chandrababu: రాజానగరం: ఈ ఎన్నికలు పేదలకి, పెత్తందార్లకు జరుగుతున్న యుద్ధం.. పెత్తందార్లు చంద్రబాబు ఆయన మద్దతుదారులు అయితే... పేదల మనిషి జగనన్న అని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఎన్నికల్లో జగన్ (AP CM YS Jagan) వైపు నిలబడి, ఫ్యాన్ గుర్తుకు ఎప్పుడు ఓటేయాలి అని ప్రజలంతా తహతహలాడుతున్నారని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సామాజిక సాధికార యాత్ర (YSRCP Samajika Sadhikara Yatra) సభలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు.
రంగాని పొట్టన పెట్టుకుంది టీడీపీ, చంద్రబాబు!
ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. విజయవాడలో గొప్ప నేత వంగవీటి మోహన్ రంగాని పొట్టన పెట్టుకున్న వ్యక్తులు గురించి ప్రజలు తెలుసుకోవాలి. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రంగాని పొట్టనపెట్టుకుంది ఈ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు అని ప్రజలు గుర్తించాలన్నారు మంత్రి జోగి రమేష్. రంగా అభిమానులు ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. అలాంటి పార్టీ టీడీపీని ఓడించాల్సిందేనని పిలుపునిచ్చారు. సైకిల్ గుర్తును తుక్కుతుక్కుగా విరగ్గొట్టాల్సిన బాధ్యత మనపైన ఉంది. ఈ సమావేశం చూస్తే నూటికి నూరు పాళ్లు ఫ్యాన్ గుర్తుకు తిరుగులేదనేది స్పష్టం అవుతోందని ప్రసంగించారు.
రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ క్రీడను ప్రజలు ఒకసారి గమనిస్తే వారికి అంతా అర్థమవుతుందన్నారు. పేదల పక్షాన, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల పక్షాన నిలిచిన వ్యక్తి ఏపీ సీఎం జగన్ అని పేర్కొన్నారు. మరోవైపు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, పచ్చ మీడియా వాళ్లంతా పెత్తందార్లు అని.. ఢిల్లీ నుంచి వీళ్లందరికీ మద్దతుగా ఒక జాతీయ పార్టీ అడుగుపెట్టబోతోందని వ్యాఖ్యానించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, కాపులు.. అందరూ ఈ ప్రభుత్వలో భాగస్వాములుగా ఉన్నారు. పేదల కోసం ఆరాటపడుతున్న జగన్ ను ఓడించాలని అందరూ కలసి కట్టుగా కుట్రలతో రాబోతున్నారని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
రాష్ట్రంలో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించిన నేత జగన్ మాత్రమే అని జోగి రమేష్ చెప్పారు. 9 రాజ్యసభ సభ్యుల్లో 4 స్థానాలు బీసీలకే ఇచ్చి గౌరవించారు. ఎమ్మెల్సీ, ఛైర్మన్‌ల స్థానాలిచ్చారు. వారంతా సామాజిక సాధికారిక యాత్ర ద్వారా రాష్ట్రం అంతా తిరిగివస్తోంటే ప్రతిపక్షాలు బెంబెలేత్తిపోతున్నాయని ఎద్దేవా చేశారు. రాజానగరంలో మా జక్కంపూడి రాజా పెట్టిన మీటింగుకు వచ్చిన జనం కూడా నీకు రాలేదు అని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కొన్ని కోట్లు ఖర్చు బెట్టి తిరువూరులో చంద్రబాబు సభ పెడితే అది వెలవెలబోయింది అన్నారు.
మంచిని ప్రేమించాలి.. పేదల మనిషి జగన్ ను నిలబెట్టుకోవాలి:
ఎవరైనా సరే మంచిని ప్రేమించాలని, నీతి,నిజాయితీలను గౌరవించాలి కనుక పేదల పక్షాన నిలిచిన సీఎం జగన్ ను గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబుకు తోడుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వస్తున్నాడని, కానీ తాను ముఖ్యమంత్రి పదవికి అర్హుడిని కాదు అంటున్నారని గుర్తుచేశారు. తాను కనీసం అసెంబ్లీలోనైనా అడుగుపెట్టేందుకే చంద్రబాబు వెంట తిరుగుతున్నానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.