Resumption Of Fishing: చేపల వేట పునఃప్రారంభం; మత్స్యకారుల ఆనందం, సీఫుడ్ ప్రియులకు పండగ, తీరాల్లో సందడి!
Resumption Of Fishing: సముద్రంలో మత్స్యసంపద పునరుత్పత్తి కాలంను దృష్ట్యా విధించిన రెండు నెలల చేపల వేట నిషేదం ముగిసింది. దీంతో శనివారం నుంచి చేపల వేట మొదలైంది.

Resumption Of Fishing: సముద్రంలో మత్స్యసంపద పునరుత్పత్తి కాలంను దృష్ట్యా విధించిన రెండు నెలల చేపల వేట నిషేదం ముగిసింది. శనివారం నుంచి చేపల వేట మొదలైంది. ఈ రెండు నెలలు పాటు వేర్వేరు పనుల్లో నిమగ్నమైన మత్స్యకారులు తీరానికి చేరుకున్నారు. చేపల వేట షురూ అయిన నేపథ్యంలో మాంసాహర ప్రియులు ముఖ్యంగా సీఫుడ్ ఇష్టంగా తినే వారు తీరానికి క్యూ కడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 15నుంచి ఈనెల 14 వరకు సముద్రంపై చేపల వేట నిషేధం విధించారు. సుమారు 61 రోజుల పాటు మత్స్యకారులు వేటకు దూరంగా ఉన్నారు. దీంతో కేవలం సముద్రంలోని వేటే జీవనాధారంగా చేసుకుని జీవనం సాగించే కుటుంబాలు ఒకింత ఆర్థికంగా ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపించింది.. మత్స్యకార భరోసా ద్వారా ప్రభుత్వం కొంత వరకు ఆదుకున్నా అది కుటుంబంలో ఒక్కరికే వర్తించడంతో ఒకే ఇంట్లో ఇద్దరు ఉన్నవారు, పెద్దకుటుంబాల వారు కొంత అవస్థలు పడ్డామంటున్నారు.
కళకళలాడుతోన్న తీరప్రాంతం..
రెండు నెలలపాటు సముద్రంలో వేట నిషేదాజ్ఞల నేపథ్యంలో సముద్రతీరం వెలవెల బోయినట్లయ్యింది. ఎందుకుంటే ఎప్పడూ మత్స్యకారుల బోట్లు, చేపల కొనుగోళ్లతో కళకళలాడే ఫిషింగ్ హార్బర్లు ఈ హడావిడిలేక నిర్మాణుష్యంగా మారింది.. అయితే శనివారం నుంచి చేపలవేట మళ్లీ ప్రారంభం కావడంతో సముద్రతీర ప్రాంతం, ఫిషింగ్ హార్భర్లు మత్స్యకారులు, కొనుగోళ్లు దారులుతో కళకళలాడుతోంది.. లంగరులేసిన బోట్లు అన్నీ తెల్లవారు జామునే తీరానికి తీసుకువచ్చి సముద్రంలోకి పయనమయ్యారు.. చేపలవేట నిషేదం ముగియడంతో కాకినాడ ఫిషింగ్ హార్బర్, విశాఖ, శ్రీకాకుళం, మచిలీపట్నం తదితర ఫిషింగ్ హార్బర్లు కళకళలాడుతున్నాయి.
గంగమ్మకు పూజలు..
సముద్రంలో చేపల వేటకు వెళ్లే ముందు మత్స్యకారులు గంగమ్మ తల్లికి పూజలు చేస్తారు. సముద్రంలో వేటకు వెళ్లిన ప్పుడు తమను చల్లగా కాపాడు. తిరిగి వచ్చేలా చూడమ్మా.. అంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదేవిధవగా మత్స్య సంపదతో సిరిసంపద పెరిగేలా చూడాలని కోరుకుంటుంటారు.. తెల్లవారు జామునుంచే తీరం వెంబడి ఫిషింగ్ హార్బర్ల వద్ద మత్స్యకార మహిళలు పూజలు చేశారు.. సముద్రంలో కుంకుమ, పసుపు సమర్పించారు..
సీఫుడ్ లేక అసంతృప్తితోనే వేడుకలు..
చాలా మంది వివాహ, ఇతర వేడుకల్లో ఉండే మెనూలో కచ్చితంగా సీఫుడ్ ఉండాలని కోరుకుంటారు.. ఇది ముఖ్యంగా గోదావరి జిల్లల్లో అయితే మరింత ప్రతిష్టాత్మకం.. అందుకే చాలా వివాహ వేడుకల రిసెప్షన్లలోనూ, ఇతర శుభకార్యాల్లోనూ ఖరీదైన చందువ, పండుగప్ప, సొర, కోనామా ఇలా రకాల చేపలతో విందు ఏర్పాటు చేస్తుంటారు.. ఇవి కిలో రూ.600 నుంచి 1500 వరకు ఆయా రకాల చేపలను బట్టి ఉంటుంది.. అయితే చేపల వేట నిషేదంతో ఇవి అందుబాటులో లేకపోవడంతో కొంత మంది చెరువు చేపలతోనే సరిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అయితే చాలా మంది చెరువు చేపలను తినడానికి ఇష్టపడకపోవడంతో కొంత మంది ఆప్రయత్నాన్ని విరమించుకున్నారు.





















