Godavari Floods: ఆ వరదలతో ఒక తరమంతా నాశనం! తలచుకుంటేనే వెన్నులో వణుకు - చరిత్రలోనే అదొక చేదు జ్ఞాపకం
Godavari కి ప్రస్తుతం వచ్చిన వరద ప్రవాహం 15 లక్షల క్యూసెక్కులుగా ప్రభుత్వం చెబుతోంది. దీనికి రెట్టింపు స్థాయి వరద 1986 లో వచ్చింది. వరద ప్రవాహం ఏకంగా 36 లక్షల క్యూసెక్కులు అంటే నమ్మగలరా?
ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల గోదావరికి వచ్చిన వరద ప్రవాహం 15 లక్షల క్యూసెక్కులుగా ప్రభుత్వం చెబుతోంది. ఈ స్థాయి వరదను జూలై నెలలో ఎన్నడూ చూడలేదని కూడా చెబుతోంది. కానీ, దీనికి రెట్టింపు స్థాయి వరద 1986 ఆగస్టులో వచ్చిందని ఇప్పటి తరానికి తెలియదు. ఆ రాత్రి వచ్చిన వరద ప్రవాహం ఏకంగా 36 లక్షల క్యూసెక్కులు అంటే నమ్మగలరా? ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద భయపెడుతున్న వరదకు అది డబుల్.
రాత్రికి రాత్రి కొట్టుకుపోయిన ఊళ్ళు
1986, ఆగస్టులో భారీ వర్షాలు ఆగకుండా కురిశాయి. దానితో గోదావరి నీటిమట్టం పెరుగుతూ పోయింది. అయితే, నెమ్మదిగా అదే తగ్గిపోతుంది అనుకున్నారంతా. ఆగస్టు 15వ తేదీ రావడంతో అంతా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుని, సెలవు రోజు కావడంతో ఇళ్ల దగ్గరే ఉన్నారు. ఆ అర్ధరాత్రి అంటే ఆగస్టు 16 వ తేదీన, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల తాలూకు వరద ప్రవాహం భద్రాచలాన్ని ముంచి, ఒక్కసారిగా రాజమండ్రి వద్దకు చేరుకుంది. గట్లు తెగిపోవడంతో వరద నీరు ఊళ్లలోకి వచ్చేసింది. అటు రాజమండ్రి పట్టణంలోకి నీళ్లు వచ్చెయ్యడంతో పాటు.. లంక గ్రామాలను ముంచేసింది. గోదావరికి మరొక వైపున ఉన్న కొవ్వూరు, నిడదవోలు, డి.ముప్పవరం, కలవ చర్ల, కానూరు లాంటి ఊళ్లన్నీ రాత్రికి రాత్రే కొట్టుకుపోయాయి. ఎంతో మంది నిద్రలోనే చనిపోయారు. ఇప్పటికీ వారి సంఖ్య కచ్చితంగా తెలియదు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా మధ్య సంబంధాలు తెగిపోయాయి.
కొట్టుకుపోయిన రైల్వే ట్రాకులు
అప్పుడు వచ్చిన వరద ఉధృతి ఏ స్థాయిలో ఉంది అంటే.. రాజమండ్రి సమీపంలో రైల్వే ట్రాకులు కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల ట్రాకుల మీదకు వరద నీరు చేరుకోవడంతో ఎక్కడి ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. అలాంటి వారికి ప్రభుత్వం పులిహోర ప్యాకెట్లు పంచింది.
కొట్టుకు పోయిన వేలాది ఇళ్ళు
1986 నాటికి ఇంకా సిమెంట్ తో కట్టిన ఇళ్ళు అందరికీ ఉండేవి కావు. గుడిసెలు, పాకలే ఎక్కువగా ఉండేవి పెంకుటిళ్లు ఉన్నా అవన్నీ మట్టి గోడలతో కట్టినవే ఎక్కువగా ఉండేవి. అలాంటి ఇళ్లన్నీ వరదలో కొట్టుకుపోయిన సంఘటలు అనేకం. ఎంతోమంది తమ సర్టిఫికెట్ లనూ.. ఇళ్ల పట్టాలనూ కోల్పోవడంతో ప్రభుత్వం వారికి పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చింది. ఇప్పటికీ వాటిలోనే ఉంటున్న వారు నిడదవోలు, కలవచర్ల, కానూరు, జీడిగుంట, పీ.గన్నవరం లాంటి ఊళ్లలో కనపడతారు. ఇక కాస్త గట్టి గోడలతో కట్టిన ధనవంతుల ఇళ్లు మాత్రం ఆ వరదను తట్టుకున్నాయి. ఆనాటి ఇళ్ళు ఇంకా మిగిలి ఉంటే.. వాటి గోడలపై చాలా ఎత్తున నాటి వరద తాలూకూ ప్రవాహం వెళ్లిన ఆనవాళ్లను చూడవచ్చు. అలాగే గోదావరి పైన రాజమండ్రి వద్ద బ్రిటీషర్లు కట్టిన పాత హెవెలాక్ బ్రిడ్జ్ గోడలపై కూడా నాటి ప్రవాహం ఆనవాళ్లు కనిపిస్తాయి.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిర్దేశించిన వరద అది
ఈ వరద తరువాతనే గోదావరి వరదల నీటి మట్టం కొలవడం మొదలు పెట్టారు అధికారులు. ప్రస్తుతం కడుతున్న పోలవరం ప్రాజెక్టును కూడా 1986 వరదల్లో వచ్చిన 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఒక్కసారిగా వచ్చినా తట్టుకునేలా నిర్మిస్తున్నారు. కృష్ణాజిల్లాలో 1977 లో వచ్చిన దివిసీమ ఉప్పెన ఎంత భయంకరమైనదో.. 1986 లో వచ్చిన గోదావరి వరద గోదావరి జిల్లా వాసుల పాలిట అలాంటి పీడకలనే మిగిల్చింది.
కదిలి వచ్చిన సినీలోకం..
1986 వరద బాధితులను ఆదుకోవడానికి తెలుగు సినీలోకం ముందుకు వచ్చింది. చాలామంది నటులు తమ శక్తి కొద్దీ విరాళాలు ఇచ్చారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ రెండున్నర లక్షల రూపాయలను విరాళంగా ఇవ్వగా.. అప్పుడే తొలి సినిమాలో హీరోగా నటించిన నాగార్జున తన విక్రమ్ సినిమా 100 రోజుల వేడుకలను రద్దు చేసుకున్నారు. అంతే కాక, అక్కినేని కుటుంబం తరపున వరద బాధితులకు 2 లక్షల పాతిక వేల రూపాయలను వారు తమ సాయంగా ప్రకటించారు.