East Godavari News: టీడీపీలో మరోసారి భగ్గుమన్న వర్గ విభేదాలు, పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలు
East Godavari News: టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో టీడీపీకి చెందిన రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
East Godavari News: తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో టీడీపీ నేతల్లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తెలుగు దేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో టీడీపీకి చెందిన ఇరువర్గాలు.. ఒకరిపై ఒకరు దాడికి దిగారు. నియోజకవర్గ ఇంఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 41 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో టీడీపీ జెండా ఆవిష్కరించడానికి ఇంచార్జ్ మద్దిపాటి వర్గం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వర్గం పోటీపడ్డాయి. ఈ క్రమంలోనే ఒక వర్గంపై మరో వర్గం ఘర్షణకు దిగి పరిసర ప్రాంతాల్లో దొరికిన వస్తువులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువురు నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు.
ముప్పిడి వెంకటేశ్వర రాను పదవి నుంచి తప్పించడంతో గొడవ!
టీడీపీ అధిష్టానం సుమారు సంవత్సరం కిందట గోపాలపురం నియోజకవర్గ ఇంఛార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు ని తప్పించి మద్దిపాటి వెంకటారాజును నియమించింది. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. రెండు గ్రూపులు పార్టీ కార్యక్రమాలు కూడా వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. శ్రేణుల మధ్య విభేదాలు తొలగించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు.