Chandrababu Arrest: ప్రజల సొమ్ము దోచుకొని, దాచుకునే అలవాటు చంద్రబాబుకు లేదు - భువనేశ్వరి
తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని నారా భువనేశ్వరి సందర్శించారు.
ప్రజల సొమ్ము దోచుకొని, దాచుకునే అలవాటు చంద్రబాబుకు లేదని సతీమణి భువనేశ్వరి వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏ తప్పు చేయలేదని ఈ విషయం ప్రజలందరికీ తెలుసని ఆమె అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని నారా భువనేశ్వరి సందర్శించారు.
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ... " చంద్రబాబు ఏ తప్పు చేశారని 19 రోజులుగా జైలులో నిర్వహించారు. ఇలాంటి విచారణ లేకుండానే నిర్బంధిస్తారా? ఆరోపణల్లో వాస్తవాలు ఏంటో తెలుసుకోరా? అని ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఆయన ఏం తప్పు చేశారో చెప్పలేకపోయారు... ఈ ఆధారాలు కూడా చూపించలేకపోయారు. ప్రజల మనిషిని జైల్లో నిర్బంధించారు. శాంతియుత నిరసనలను పోలీసులు అడ్డుకుంటున్నారు. లోకేష్ పాదయాత్రను కూడా పలుమార్లు అడ్డుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ పొందిన యువత లక్షల సంపాదించుకుంటున్నారు. చేయి చేయి కలిపి చంద్రబాబుకు అండగా నిలుద్దాం" అని భువనేశ్వరి అన్నారు.
చంద్రబాబును జైల్లో వేధింపులకు గురి చేసేందుకే ఆయనను అరెస్టు చేశారని చెప్పారు. సీఎంగా పనిచేసిన వ్యక్తిని రాత్రికి రాత్రి అరెస్టు చేయాల్సినంత అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబుకు మద్దతుగా నిరసనలు, ర్యాలీలు చేస్తే అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అరాచకాన్ని, కక్ష సాధిపుచ్చర్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతిపై చర్చించడం హాస్యస్పదంగా ఉందని చెప్పారు. ప్రజల్లో చంద్రబాబుకు విశ్వాసం పెరుగుతుంది కాబట్టే వారిని ఎక్కడికక్కడ అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని భువనేశ్వరి వెల్లడించారు.
గత 45 సంవత్సరాల నుంచి ప్రజల కోసం చంద్రబాబు కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రెండు లక్షల మందికి చంద్రబాబు దారి చూపించారని తెలిపారు. పాడేరు ఏజెన్సీలో కూడా స్కిల్ డెవలప్మెంట్లో వేలాదిమంది శిక్షణ పొందారని చెప్పారు. ఇప్పటివరకు చంద్రబాబు ఏ తప్పు చేసినట్లు రుజువు కాలేదన్నారు. సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు మహిళల అభివృద్ధి కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని చెప్పారు. మహిళలంటే చంద్రబాబుకు నమ్మకమని చెప్పుకొచ్చారు. ఇప్పుడు బయటకు రాని మహిళలు చంద్రబాబు కోసం ఇప్పుడు రోడ్డుపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారని భువనేశ్వరి అన్నారు. టీడీపీ కుటుంబ పెద్ద ఆయన చంద్రబాబుని జైల్లో పెట్టారని మండిపడ్డారు.
చంద్రబాబు కోసం శాంతియుతంగా పనిచేస్తున్న మహిళలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. సృష్టికి మూలమైన మహిళలను అసభ్యంగా మాట్లాడుతున్నారని భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ యువకులం పాదయాత్రలో కూడా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని మైకులు పట్టుకుపోయిన పాదయాత్ర ఆగలేదని అన్నారు. మాజీ ఎంపీ తోట సీతామహాలక్ష్మి ఆసుపత్రిలో ఉంటే హత్య నేరం కేసు పెట్టారన్నారు. రాష్ట్రంలో పోలీసులు ఇష్టారాజ్యంగా పనిచేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. సేవ్ డెమోక్రసీ సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సత్యమేవ జయతే అంటూ నారా భువనేశ్వరి నినాదాలు చేశారు. త్వరలో చంద్రబాబు బయటకు వస్తారని అవినీతి పాలనను అంతం చేసే సమయం ఆసన్నం అయిందని నారా భువనేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు.