Nidadavolu: ఎర్రకాలువ ముంపునకు గురై పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదల
Andhra Pradesh News | నిడదవోలులో ఎర్రకాలువ ముంపుకు గురై పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.

తూర్పు గోదావరి జిల్లా లోని నిడదవోలు సమీపంలోని ఎర్ర కాలువ వర్షాకాలం వచ్చింది అంటే చాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గత ఏడాది అంటే 2024 జూలై నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల ధాటికి నిడదవోలు నియోజకవర్గంలో ఎర్రకాలువ ముంపుకు గురై పంట నష్టపోయిన 4,631 మంది రైతులకు రూ.5.22 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ అందించినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ వెల్లడించారు.
చంద్రబాబుకు మంత్రి ధన్యవాదాలు
ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేసినందుకు నియోజకవర్గ రైతాంగం తరపున సీఎం చంద్రబాబునాయుడుకు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంత్రి కందుల దుర్గేష్ చొరవతో తమకు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల కావడంపై నియోజకవర్గ బాధిత రైతాంగం హర్షం వ్యక్తం చేసింది. మంత్రి దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలపడమే గాక, సమస్యల పరిష్కారంలో చూపిన చొరవను ప్రశంసించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ 2024 జూలై నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా నిడదవోలు నియోజకవర్గంలోని ఎర్రకాలువ పొంగిపొర్లి, పలు గ్రామాల్లో పంటలు ముంపుకు లోనయ్యాయన్నారు. ఆ పరిస్థితులను తాను ప్రత్యక్షంగా చూశానని మంత్రి పేర్కొన్నారు. అనేక ప్రాంతాల్లో 3,071.41 హెక్టార్లలో పంటలు నష్టపోయి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ పరిస్థితులను గమనించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించి 4,631 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 5 కోట్ల 22 లక్షల 919 వేల పంట నష్టపరిహార సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. వర్షాకాలం ప్రారంభం కావడం, నాట్లు వేస్తున్న సమయంలో ఈ ఇన్ పుట్ సబ్సిడీ సాయం అందడంతో రైతులకు ఉపశమనం లభించిందని మంత్రి దుర్గేష్ అన్నారు.
ఎర్రకాలువ ముంపు శాశ్వత పరిష్కారం
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి దుర్గేష్ అన్నారు. గత ప్రభుత్వం ఎర్రకాలువ వరద నియంత్రణకు దీర్ఘకాలిక పరిష్కారం కోసం ఏ చర్యలు చేపట్టకపోవడం వల్ల ప్రతి సంవత్సరం రైతులు నష్టాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఎర్రకాలువ ఆధునీకరణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఎర్రకాలువ ముంపు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని వెల్లడించారు.
ఎర్ర కాలువ వరద అంటేనే రైతుల గుండెల్లో భయం
నిన్నా మొన్నటి వరకూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే నిడదవోలు తదితర ప్రాంతాల గుండా ఎర్ర కాలువ ప్రవహింస్తుంది. అక్కడ వ్యవసాయానికి ఈ కాలువ చాలా అవసరం. కానీ దీని గట్లు సరిగా ఉండకపోవడం వల్ల వర్షాలు గట్టిగా కురిస్తే చుట్టుపక్కల వ్యవసాయ భూములు జలమయమైపోతాయి. ఒకప్పుడు అయితే ఈ కాలువ వరద దెబ్బకి రైలు కూడా నిలిపేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైల్వే ట్రాక్ ఎత్తు పెంచడం ఎర్రకాలువ గట్లను ఆ ప్రాంతం లో విశాలం చేయడంతో ఎర్రకాలువ వరద వల్ల రైళ్లకు ప్రాబ్లం ఉండట్లేదు.
నిడదవోలు నియోజకవర్గానికి చెందిన ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు ఎర్ర కాలువ వరద బారిన తరచు పడుతున్నాయి. ఎర్ర కాలువ గట్లను వెడల్పు చేసి వాటి ఎత్తు పెంచితే వరద ముంపు నుంచి పొలాలు తప్పించుకునే అవకాశం ఉంటుంది. దీనిపై ఎప్పటినుంచో డిమాండ్ అయితే ఉంది. దీని ని త్వరలోనే నెరవేరుస్తామని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కందుల దొరికేసి అంటున్నారు. మరి ఎంత త్వరగా ఆ హామీ నెరవేరుద్దో చూడాలి.





















