Deputy CM Pawan Kalyan: వినాయకచవితి సందర్భంగా పవన్ కళ్యాణ్ గుడ్‌న్యూస్, త్వరలో వారి ఖాతాల్లోకి నగదు జమ
కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులను ఏపీకి విడుదల చేస్తుంది. సెప్టెంబర్ తొలి వారానికి ఏపీ పంచాయతీలకు రూ.1120 కోట్లు విడుదల చేస్తామని Andhra Pradesh Deputy CM పవన్ కళ్యాణ్ అన్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశంలో గ్రామ పంచాయతీలకు ఉద్దేశించిన ఆర్థిక సంఘం గ్రాంట్లను వాటి ప్రయోజనం కోసం మాత్రమే వినియోగించేలా ప్రభుత్వం చూస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వినాయక చవితి సందర్భంగా గ్రామ పంచాయతీలు, సర్పంచ్‌లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. సెప్టెంబర్ మొదటి వారంలో పెండింగ్‌లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లను పంచాయతీలకు విడుదల చేయన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అటువంటి నిధులను ఇతర పథకాలకు దారి మళ్లించిందని, అలా నిధులను మళ్లించేయడం వల్ల స్థానిక సంస్థలపై ఆర్థిక భారం ఏర్పడిందని పేర్కొన్నారు. దాని ఫలితంగా వైసీపీ హయాంలో గ్రామాల అభివృద్ధి కుంటుపడింది. మరోవైపు జీతాల చెల్లింపులలో జాప్యం జరిగిందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ప్రధాని మోదీకి ధన్యవాదాలు
‘ఏపీకి కేంద్ర ఆర్థిక సంఘం నిధులను సకాలంలో విడుదల చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్రంలో పంచాయతీల అభివృద్ధికి అన్ని విధాలుగా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోంది. కమిషనర్, పంచాయతీరాజ్ కార్యాలయాన్ని ఈ నిధుల అంశంపై ఆగస్టు 5వ తేదీన సర్పంచ్‌లు సంప్రదించారు.
సీఎం చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు
పెండింగ్‌లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లను సెప్టెంబర్ తొలివారంలోపు అన్ని పంచాయతీలకు విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అందుకు వారికి నా కృతజ్ఞతలు. స్థానిక సంస్థల పాలనకు సాధికారత కల్పించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నిబద్ధత ఈ హామీ నెరవేర్చడం ద్వారా తెలుస్తోంది. ఏపీలోని కూటమి ప్రభుత్వం పారదర్శకతతో పాటు బాధ్యతాయుతమైన, ప్రజా కేంద్రీకృత నాయకత్వానికి ఉదాహరణ’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
‘ఆర్థిక సంఘం నిధుల విడుదలైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్పంచ్‌లకీ, స్థానిక సంస్థలకు ఉపశమనం కలుగుతుంది. సభలో హామీ ఇచ్చినట్లుగా ఆర్థిక సంఘం నిధులను కేవలం గ్రామ పంచాయతీలు, వాటి అభివృద్ధికి మాత్రమే ఉపయోగిస్తూ, వాటిని సద్వినియోగం చేయాలనే వైఖరిని మా ప్రభుత్వం తీసుకుంది. స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేస్తూ, గ్రామ స్థాయిలో కనీస మౌలిక వసతులు, సేవలు సమర్థంగా అందించాలన్నదే మా కూటమి ప్రభుత్వ ఉద్దేశం. గ్రామ పంచాయతీలను శక్తివంతంగా చేయాలని సంకల్పించాం. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయని’ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.























