Ambati Rambabu: పద్మనాభ రెడ్డి అయినా ముద్రగడ ముద్రగడే, పరామర్శించిన అంబటి రాంబాబు
Mudragada Padmanabham: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లి అంబటి రాంబాబు భేటీ అయ్యారు. ఆయన్ని అభినందించడం కోసం వచ్చినట్లు చెప్పారు.
AP News Latest: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో గెలిస్తే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాలు విసిరి ఇటీవలి కాలంలో ముద్రగడ పద్మనాభం వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. నోరుజారి అన్నమాట ప్రకారం.. తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా లీగల్‌గా ఆయన మార్చుకున్నారు. తాజాగా ముద్రగడ పద్మనాభాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు. బుధవారం (జూలై 17) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం నివాసంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్నప్పటికీ.. ముద్రగడ ముద్రగడేనని అన్నారు. ముద్రగడ వంటి లీడర్లు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారని కొనియాడారు. కాపుల కోసం.. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ ఎంతో తీవ్రంగా ఉద్యమాన్ని నడిపారని గుర్తు చేశారు. రాజకీయాల్లో ముద్రగడ నష్టపోయినప్పటికీ.. ఎప్పుడూ కులాన్ని మాత్రం వాడుకోలేదని అన్నారు. ప్రత్యర్థుల ఛాలెంజ్ స్వీకరించి తన పేరు మార్చుకున్న వ్యక్తి ముద్రగడ అని ఆయన గుర్తు చేశారు. అందుకే ఆయన్ని అభినందించడం కోసం తాను కిర్లంపూడికి వచ్చానని అంబటి రాంబాబు వివరించారు.
వంగవీటి రంగా జైలులో ఉన్న సమయంలో కాపునాడు సభకు హాజరు కావడం కోసం ముద్రగడ పద్మనాభం తన పదవికి కూడా రాజీనామా చేశారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. కాపు ఉద్యమానికి కారణంగా ముద్రగడ చాలా నష్టపోయారని అంబటి అన్నారు.
పద్మనాభం - పద్మనాభ రెడ్డి
కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ సీపీలో చేరారు. ఆ క్రమంలోనే పవన్ కల్యాణ్ పై ఓ సవాలు విసిరారు. పవన్ కల్యాణ్ గెలిస్తే.. తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. ఇక ఆ ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ అఖండ మెజారిటీతో గెలిచారు. దీంతో ముద్రగడపై సోషల్ మీడియాలో ట్రోల్స్ పెరిగాయి. చివరికి ముద్రగడ అన్నంత పని చేశారు. తాను ప్రకటించినట్లుగానే తన మాటపై తాను నిలబడుతున్నానని ముద్రగడ పద్మనాభం తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు.