Amalapuram Violence: అమలాపురం అల్లర్ల కేసులో 135 మంది అరెస్ట్, హైదరాబాద్‌లోనూ కొనసాగుతున్న స్పెషల్ టీమ్స్ ఆపరేషన్
Amalapuram Violence Case Updates: అమలాపురం అల్లర్ల కేసులో ఇప్పటివరకు 135 మందిని అరెస్ట్ చేసినట్లు డీఐజీ పాలరాజు వెల్లడించారు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.
Amalapuram Violence Case Updates: కోనసీమ: గత నెలలో జరిగిన అమలాపురం అల్లర్ల కేసులో మంగళవారం నాడు మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వారి సంఖ్య 135కు చేరుకుందని డీఐజీ పాలరాజు ఓ ప్రకటనలో వెల్లడించారు. పరారీలో ఉన్న మరికొంతమంది కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. అల్లర్ల నేపథ్యంలో గత నెలలో అక్కడ నిలిపివేసిన ఇంటర్నెట్ సేవల్ని కొన్ని ప్రాంతాల్లో పునరుద్ధరించారు. గత నెల 24వ తేదీన అమలాపురంలో జరిగిన విధ్వంసం నేపథ్యంలో అధికారులు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మంగళవారం నుంచి జిల్లాల్లో కొన్ని పట్టణాల్లో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు. అల్లర్ల కేసులో చాలావరకు పురోగతి సాధించామని పోలీసులు చెబుతున్నారు.
ప్రత్యేక బృందాలు గాలింపు...
జిల్లాల్లో పలు చోట్ల ఆస్తుల విధ్వంసం, పోలీసులపై రాళ్లు రువ్వడం లాంటి చర్యలకు నిరసనకారులు పాల్పడటంతో అల్లర్లు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడులు జరపడంతో పాటు వారి ఇళ్లకు నిప్పుపెట్టారు. ఈ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయని, హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు పారిపోయిన అనుమానితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని డీఐజీ పాలరాజు స్పష్టం చేశారు. ప్రత్యేక బృందం హైదరాబాద్ నుంచి కొందరిని పట్టుకుని అమలాపురం తీసుకువచ్చింది. మరికొందరి కదలికలపై నిఘాపెట్టింది.
ఇంకా పునరుద్ధరించని మొబైల్ ఇంటర్నెట్ సేవలు...
గత నెలలో జరిగిన అల్లర్ల కారణంగా నిలిపివేసిన ఇంటర్నెట్ సేవల్ని అమలాపురం పట్టణం, రూరల్ ప్రాంతాలకు పూర్తి స్థాయిలో ఇంకా పునరుద్ధరించలేదు. అయితే కేవలం వైర్డ్ బేస్డ్ ఇంటర్నెట్ సేవలకు మాత్రమే అధికారులు అనుమతినిచ్చారు. సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా వివాదాస్పద పోస్టింగ్స్, ప్రేరేపిత పోస్టింగులు పెడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
అసలేం జరిగింది?
కోనసీమ జిల్లా పేరు బీఆర్ అంబేద్కర్ కోనసీమగా మార్చడంపై గత నెలలో మామూలుగా ప్రారంభమైన ఆందోళన హింసాత్మకంగా మారింది. మొదట పోలీసులపైకి రాళ్లు రువ్విన ఆందోళనకారులు క్రమంగా ప్రజాప్రతినిధుల ఇళ్లను టార్గెట్ చేసుకున్నారు. తొలుత ఏపీ మంత్రి పినిపె విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టారు. ఆ తర్వాత అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపైకి దూసుకెళ్లారు. కలెక్టరేట్ ముట్టడి పేరుతో కోనసీమ జిల్లా జేఏసీ చేపట్టిన ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అమలాపురంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ ఆందోళనకారులు ఏమాత్రం పట్టించుకోలేదు. జిల్లా పేరు మార్పును అంగీకరించబోమంటూ ఉద్యమించారు. ముఖ్యంగా యువత ఆగ్రహావేశాలతో ఊగిపోయింది. ఆందోళన వద్దని పోలీసులు వేడుకుంటున్నా ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. ఓ దశలో లాఠీ ఛార్జ్ చేసినప్పటికీ నిరసనకారులు ఏమాత్రం భయపడలేదు. పోలీసులపైకి రాళ్ల వర్షం కురిపించారు. అప్పటి వరకు కాస్త ఆందోళకరంగా సాగిన ముట్టడి రక్తసిక్తమైంది.
Also Read: Gold-Silver Price: బంగారం కొంటున్నారా? నేడు తగ్గిన పసిడి ధరలు! వెండి కూడా దిగువకు