Actress Payal Rajput: కోనసీమలో పాయల్ రాజ్ పుత్ సందడి - గోదారోళ్ల అభిమానానికి హీరోయిన్ ఫిదా
Actress Payal Rajput:అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నటి పాయల్ రాజ్ పుత్ సందడి చేస్తున్నారు. 'మంగళవారం' సినిమా షూటింగ్ కోసం వచ్చిన పాయల్ ను చూసేందుకు జనం ఎగబడ్డారు.
Actress Payal Rajput: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సందడి చేస్తున్నారు. కేపీపీ ప్రభుత్వ విద్యాసంస్థల ప్రాంగణంలో జరుగుతున్న షూటింగ్ లో ఆమె పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పాయల్ రాజ్ పుత్ ను చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు, స్థానికులు భారీ సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా ఆమె అక్కడికి వచ్చిన వారిని ఉద్దేశిస్తూ మాట్లాడారు.
'మంగళవారం' సినిమా షూటింగ్
"తెలుగులో నా మొదటి సినిమా ఆర్‌ఎక్స్ 100 సినిమా కోసం ఎక్కువ భాగం అంతా గోదావరి జిల్లాలోనే గడపాల్సి వచ్చింది. ఇక్కడి వారి అభిమానం ఎప్పటికీ మరచిపోలేనిది. వారు చూపించే అభిమానానికి నేను ఎప్పటికీ ఫిదానే" అని అన్నారు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. "మంగళవారం" సినిమా చిత్రీకరణలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో షూటింగ్‌లో పాల్గొనేందుకు నటి రాజ్‌పుత్ విచ్చేశారు.
ఇక్కడ మూడు రోజులుగా కేపీపీ ప్రభుత్వ విద్యాసంస్థల ప్రాంగణంలో జరుగుతోన్న షూటింగ్‌లో ఆమె పాల్గొంటున్నారు. ఆర్‌ఎక్స్ 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలోనే ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుండగా ఆర్‌ఎక్స్ 100 లాగానే ఈ చిత్రం కూడా తనకు మంచి గుర్తింపును తీసుకొస్తుందని తెలిపారు. తనకు తెలుగు చిత్రాల ద్వారానే మంచి గుర్తింపు వచ్చిందని, తెలుగు సినిమాను, గోదారోళ్ల అభిమానాన్ని ఎప్పటికీ మరువలేనని రాజ్ పుత్ అన్నారు. చిత్ర యూనిట్ కాలేజీలో పలు సన్నివేశాలు చిత్రీకరణ జరుపుతున్నారు. దీంతో విద్యార్థులు పాయల్ రాజ్‌పుత్ తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.
తెలుగులో ఆర్‌ఎక్స్ 100 ద్వారా మంచి గుర్తింపు
చిత్ర దర్శకుడు అజయ్ భూపతికి, ఈ చిత్రంలోని హీరోగా నటించిన కార్తికేయకు, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు ఆర్‌ఎక్స్ 100 సినిమా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అజయ్ భూపతి స్వస్థలం కూడా గోదావరి జిల్లానే కావడం, సినిమా కథాంశం కూడా గోదావరి జిల్లాల నేపథ్యం చుట్టూ తిరిగేది కావడంతో ఎక్కువ భాగం అంతా ఉభయ గోదావరి జిల్లాల్లోనే చిత్రీకరణ చేశారు. ఆత్రేయపురం, లొల్ల, రాజమండ్రి, కోరంగి, కొవ్వూరు, భీమవరం, కాకినాడ, రామచంద్రపురం ఇలా గోదావరి తీరప్రాంతాల్లోనే ఈ చిత్రం ఎక్కువ సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సమయంలో చిత్ర యూనిట్ తో పాటు కథానాయిక రాజ్‌పుత్ ఎక్కువ రోజులు గోదావరి జిల్లాలోనే గడపాల్సి వచ్చింది. ఈ నేపథ్యమే పాయల్ రాజ్ పుత్ కు గోదావరి జిల్లాతో అనుబంధం ఏర్పడింది.
ఆర్ఎక్స్ 100 మ్యాజిక్ రిపీట్ చేస్తారా?
పెద్దగా అంచనాలేవీ లేకుండా వచ్చింది ఆర్ఎక్స్ 100 మూవీ. టైటిల్ కొంత ఆకట్టుకున్నప్పటికీ సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ కాలేదు. కానీ విడుదలైన తర్వాత కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమాతో హీరో హీరోయిన్లతో పాటు డైరెక్టర్ కు మంచి పేరు, గుర్తింపు వచ్చింది. అయితే ఆర్ఎక్స్ 100 మూవీలో పాయల్ రాజ్ పుత్ నటనే ప్రధానం.
పాయల్ రాజ్ పుత్ అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. ఈ మూవీలో పాయల్ గ్లామర్, రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్స్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేశాయి. ఈ సినిమా తర్వాత హీరో, హీరోయిన్, డైరెక్టర్ మరో హిట్ లేదనే చెప్పాలి. హీరోగా కార్తికేయ, హీరోయిన్ పాయల్ ఆర్ఎక్స్ 100 తర్వాత చాలా సినిమాలే చేశారు. కానీ ఏదీ సరైన విజయం అందుకోలేకపోయింది. ఆ మార్కు మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయారు. 'మంగళవారం' అనే సినిమాతో వస్తున్న అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ మరోసారి ఆర్ఎక్స్ 100 రిజల్ట్ ను రిపీట్ చేయాలని అనుకుంటున్నారు.