Vundavalli Aruna Kumar : కాంగ్రెస్ పార్టీ చేసిన అతి పెద్ద తప్పు జగన్ ను జైలులో పెట్టడం, అనపర్తి ఇష్యూ వైసీపీకి మైనస్- ఉండవల్లి
Vundavalli Aruna Kumar : ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు, అదానీ వ్యవహారం, నిన్న అనపర్తిలో చంద్రబాబు పర్యటనలో జరిగిన విషయంపై మాజీ ఎంపీ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Vundavalli Aruna Kumar : అనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవడం వైసీపీకి మైనస్ అవుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ నుంచి లోకేశ్ వరకూ పాదయాత్రలు చూశానన్న ఆయన... నిన్న చంద్రబాబును అడ్డుకున్న పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయన్నారు. నాడు కాంగ్రెస్ జగన్ ను జైలుకు పంపడం వల్ల ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేశారు. సరిగ్గా ఇదే రోజున తొమ్మిదేళ్ల క్రితం లోక్ సభలో అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ ను విభజించారన్నారు. సుప్రీంకోర్టులో ఈనెల 22న విభజన కేసుపై వాయిదా ఉందని ఉండవల్లి అన్నారు. ఇంకా నాలుగు రోజులు సమయం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేయాలని, ఇదే లాస్ట్ ఛాన్స్ అని గుర్తుచేశారు. నా వాదన సరైందని సజ్జల అన్నారని ఉండవల్లి తెలిపారు. కేంద్రంపై పోరాటం చేస్తేనే విభజన హక్కులు సాధిస్తామన్నారు.
12 కెమెరాలు ఒక్కసారే పాడైపోయాయి
"ఇదే రోజు తొమ్మిదేళ్ల క్రితం లోక్ సభ తలుపులు మూసేసి, టెలికాస్ట్ ఆపేసి, ఆంధ్రా ఎంపీలను సస్పెండ్ చేసి ఎంత మంది అనుకూలం, వ్యతిరేకం అనేది తెలియకుండా భారతదేశం చరిత్రలో పాసైపోయింది అని ప్రకటించిన మొట్టమొదటి బిల్లు ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు. నేను అప్పటి నుంచి చెబుతూనే ఉన్నాను. ఈ బిల్లు పాస్ అవ్వలేదు. ఏదైనా బిల్లు పాస్ అవ్వాలంటే ముందు దానిపై చర్చ జరగాలి. ఎంతమంది అనుకూలం, వ్యతిరేకం అనే స్పీకర్ అడగాలి. 367 ఆర్టికల్ స్పీకర్ వాడుకుని డివిజన్ పెట్టలేదు. అలాగే లైవ్ టెలికాస్ట్ ఆగిపోయిందని చెప్పింది కూడా మొట్టమొదటి సారి ఇదే. ఈ బిల్లు చర్చ జరిగినప్పుడు మాత్రమే 12 కెమెరాలు పాడైపోయాయి. ఆ తర్వాత వెంటనే రిపేర్ అయిపోయింది. ఈ విషయంపై చాలా మంది పిటిషన్ వేశాం. ఈ బిల్లులో పోలవరం, ప్రత్యేక హోదా కూడా ఉంది. ఈ బిల్లుపై సమాచార హక్కు కింద వివరాలు అడిగితే సెక్షన్ 8 ప్రకారం సమాచారం ఇవ్వలేమని చెప్పారు. ఈ బిల్లుపై కోర్టుకు వెళ్తే తొమ్మిదేళ్ల తర్వాత వింటాం అన్నారు. " - ఉండవల్లి అరుణ్ కుమార్
అదానీ వ్యవహారంపై
"అదానీ వ్యవహారంపై విచారణ జరగాలి. మోదీ అధికారంలోకి వచ్చే టైంకి 609వ స్థానంలో అదానీ ఉన్నారు. 2020 నాటికి అదానీ ఆస్తి పెరిగి 4వ స్థానానికి వచ్చారు. డిసెంబర్ 2021 లో ఆస్ట్రేలియా నుంచి అదానీ బొగ్గు దిగుమతి చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత భారత ప్రభుత్వం బొగ్గుపై దిగుమతి సుంకాన్ని 2.5 శాతం నుంచి జీరో చేసేసింది. బొగ్గుపై దిగుమతి చేసుకుంటే ఎటువంటి సుంకం కట్టక్కర్లేదని ప్రకటించింది. ఆ తర్వాత కోల్ ఇండియాను భారత ప్రభుత్వం 12 మి.టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవాలని ఆదేశించింది. అదే రోజు అదానీకి 8 వేల కోట్ల ఎన్టీపీసీ ఆఫర్ ఇచ్చింది. దీన్ని క్రోనీ క్యాపిటలిజమ్ అంటారు. ఒక్క శాతం ఇండియన్స్ దగ్గర 42 శాతం ఆదాయం ఉంది. " - మాజీ ఎంపీ ఉండవల్లి
వైసీపీకీ మైనస్
"రాజశేఖర్ రెడ్డి, షర్మిల, జగన్, చంద్రబాబు, లోకేశ్ పాదయాత్రలు జరిగాయి. అయితే ఏ పాదయాత్రలోనూ నిన్న అనపర్తిలో జరిగిన ఘటనలు చూడలేదు. ఇందిరా గాంధీని కూడా ఇలాగే చేసి జైలు పెట్టారు. దీంతో ఆమె మళ్లీ ప్రధాని అయ్యారు. జగన్ మోహన్ రెడ్డిని జైలు పెట్టడం అనేది కాంగ్రెస్ పార్టీ చేసినటు వంటి అదిపెద్ద తప్పు. తుడిచేయలేనటువంటి తప్పు. ఆ తప్పు వల్లే జగన్ పై ప్రజల్లో సింపథీ వచ్చింది. రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి. దీన్ని అధికారంలో ఉన్నవాళ్లు గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తారు. నిన్న జరిగిన సంఘటనలు వైసీపీకి మైనస్ అవుతాయి." - ఉండవల్లి అరుణ్ కుమార్