Vundavalli Aruna Kumar : విభజన కేసులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు, ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
Vundavalli Aruna Kumar : సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ విభజనపై ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రత్యేక హోదా, పోలవరంతో సహా పలు విభజన హామీలను రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ప్రస్తావించిందని ఉండవల్లి తెలిపారు.
Vundavalli Aruna Kumar : ఆంధ్రప్రదేశ్ విభజనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి స్పందించారు. ఏపీ విభజన కేసులో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం శుభపరిణామం అన్నారు. రాజమండ్రిలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్... ఆంధ్రప్రదేశ్ విభజన కేసులో ఏప్రిల్ 11న తదుపరి విచారణ జరగనుందన్నారు. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు అఫిడవిట్ కారణంగా రాష్ట్రానికి న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు సహా కేంద్రం నుంచి ఏపీకి న్యాయపరంగా రావాల్సిన వాటిపై అఫిడవిట్ లో వివరించారని తెలిపారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలను అఫిడవిట్ లో వివరించారన్నారు. గతంలో చంద్రబాబును కూడా ప్రభుత్వం తరఫున అఫిడవిట్ వేయాలని కోరామని, కానీ ఆయన అఫిడవిట్ దాఖలు చేయలేదని తెలిపారు.
మరో ఏడాదిలో ముగియనున్న గడువు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తొమ్మిదేళ్లు గడిచింది. మరో ఏడాదిలో విభజన చట్టం అమలు గడువు ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్ విభజనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సహా పలువురు సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. కొన్ని ప్రత్యేక కేసులపై ధర్మాసనాలు విచారణ చేపట్టినట్లు సుప్రీంకోర్టు తెలిపారు. అయితే బుధవారం విచారణకు రావాల్సిన విభజన పిటిషన్లను న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఏప్రిల్ 11న చేపడతామని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ పార్దేవాల ధర్మాసనం వెల్లడించింది.
విభజన బిల్లు పాస్ అవ్వలేదు
"తొమ్మిదేళ్ల క్రితం లోక్ సభ తలుపులు మూసేసి, టెలికాస్ట్ ఆపేసి, ఆంధ్రా ఎంపీలను సస్పెండ్ చేసి ఎంత మంది అనుకూలం, వ్యతిరేకం అనేది తెలియకుండా భారతదేశం చరిత్రలో పాసైపోయింది అని ప్రకటించిన మొట్టమొదటి బిల్లు ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు. నేను అప్పటి నుంచి చెబుతూనే ఉన్నాను. ఈ బిల్లు పాస్ అవ్వలేదు అని. ఏదైనా బిల్లు పాస్ అవ్వాలంటే ముందు దానిపై చర్చ జరగాలి. ఎంతమంది అనుకూలం, వ్యతిరేకం అనే స్పీకర్ అడగాలి. 367 ఆర్టికల్ స్పీకర్ వాడుకుని డివిజన్ పెట్టలేదు. అలాగే లైవ్ టెలికాస్ట్ ఆగిపోయిందని చెప్పింది కూడా మొట్టమొదటి సారి ఇదే. ఈ బిల్లు చర్చ జరిగినప్పుడు మాత్రమే 12 కెమెరాలు పాడైపోయాయి. ఆ తర్వాత వెంటనే రిపేర్ అయిపోయింది. ఈ విషయంపై చాలా మంది పిటిషన్ వేశాం. ఈ బిల్లులో పోలవరం, ప్రత్యేక హోదా కూడా ఉంది. ఈ బిల్లుపై సమాచార హక్కు కింద వివరాలు అడిగితే సెక్షన్ 8 ప్రకారం సమాచారం ఇవ్వలేమని చెప్పారు. ఈ బిల్లుపై కోర్టుకు వెళ్తే తొమ్మిదేళ్ల తర్వాత వింటాం అన్నారు. పార్లమెంటు చరిత్రలో ఇలా గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. బిహార్, జార్ఖండ్ విభజన సమయంలో ఏకాభిప్రాయం సాధించారు. గతంలో ఒక కమిషన్ సిఫార్సుల ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉంది. నేను విభజనకు వ్యతిరేకం అని ఎక్కడా చెప్పలేదు. నిబంధనల ప్రకారం విభజన ప్రక్రియ జరగలేదన్నదే నా అభ్యంతరం" - ఉండవల్లి అరుణ్ కుమార్