Rain Updates: ఏపీలో ఆ జిల్లాల్లో రెండు రోజులపాటు వర్షాలు - తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ
Rains in AP Telangana: రుతుపవనాల తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించినా కొన్ని జిల్లాల్లో ఇంకా వర్షాలు మొదలుకాలేదు. నేడు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Southwest Monsoon: నైరుతి రుతుపవనాల తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించినా కొన్ని జిల్లాల్లో ఇంకా వర్షాలు మొదలుకాలేదు. శనివారం నాడు ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. జూలై 4 నాటికి ఉత్తర ఒడిశా దాని పరసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఏపీలోని కోస్తాంధ్రలో నేటి నుంచి రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో..
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేటి నుంచి మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కొనసీమ, అనకాపల్లి జిల్లాల్లో విస్తారంగా కురవనున్నాయి. జిల్లాల్లోని కొన్ని చోట్ల మాత్రం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. రేపు, ఎల్లుండి ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో నేటికి వర్షాలు మొదలుకాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు ఎప్పుడు మొదలుపెట్టాలో అర్థం కాని పరిస్థితి ఆ జిల్లాల రైతుల్లో నెలకొంది.
7 Day mid day forecast of Andhra Pradesh dated 02.07.2022 pic.twitter.com/59k0EnVkbS
— MC Amaravati (@AmaravatiMc) July 2, 2022
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి జల్లులు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణా జిల్లాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కర్నూలు, నంద్యాల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురవనున్నాయి. గుంటూరు, బాపట్ల జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురుస్తాయి. నెల్లూరు పెంచలకోన - సోమశిల మీదుగా మేఘాలు కమ్ముకోవడంతో వాతావరణం చల్లగా మారుతుంది. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో చిరు జల్లులు పడతాయి.
హెచ్చరిక: వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అన్నదాతలను హెచ్చరించింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) July 2, 2022
తెలంగాణలో వర్షాలు
ఉత్తర తెలంగాణను మేఘాలు కమ్మేశాయి. ఇక్కడి నుంచి ఏపీ వైపుగా మేఘాలు కదులుతున్నాయి. ఉత్తర తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంధ్ర వైపుగా వర్షాలు కురుస్తాయి. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌ను మేఘాలు కమ్మేశాయి. నేడు సైతం వర్షం కురిసే అవకాశం ఉంది. పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయి.
Also Read: Gold-Silver Price: నేడు పసిడి ధర షాక్! ఏకంగా రూ.150 పెరుగుదల, వెండి మాత్రం భారీ ఊరట