Raghurama On Ysrcp : వైఎస్ఆర్‌సీపీ గుర్తింపు రద్దు చేయాలి - ఈసీకి రఘురామ లేఖ !
వైఎస్ఆర్‌సీపీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు.
Raghurama On Ysrcp : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష పదవి నిర్వహించడం లేదని.. నిబంధనలు ఉల్లంఘిస్తున్న తమ పార్టీని రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లుగా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన తాను ఎన్నికల సంఘానికి లేఖ రాసిన విషయాన్ని చెప్పారు. తమ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడం లేదని ఆయన అంటున్నారు. ఇటీవల ప్లీనరీలో శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ను నియమిస్తూ తీర్మానం చేశారని..కానీ అది చట్ట ప్రకారం చెల్లుబాటు కాదన్నారు. తర్వాత ఈ అంశాన్నివెనక్కి తీసుకుంటున్నట్లుగా చెప్పారు కానీ.. మళ్లీఅధ్యక్ష పదవి నిర్వహించలేదన్నారు. ఒక వేళ నిర్వహించకపోతే తమ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఆయన ఈసీకీ రాసిన లేఖలో పేర్కొన్నారు.
పార్టీని ధిక్కరించిన రఘురామపై ఇప్పటి వరకూ చర్యలు తీసుకోని వైఎస్ఆర్‌సీపీ
పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయలేదుకాబట్టి.. ఎన్నికలు నిర్వహిస్తే తాను వైసీపీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని రఘఉరామచెబుతున్నారు. తమ పార్టీ వైఎస్ఆర్‌సీపీనా లేకపోతే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీనా అనేది క్లారిటీ లేదని.. దీనిపైనా స్పష్టత ఇవ్వాలని కోరారు. గతంలో ఈ అంశంపై రఘురామ కోర్టుకెళ్లారు. ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీ నేతలు తమ లెటర్ ప్యాడ్ల మీద యువజన శ్రమిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పేరు మార్చారు. అయితే షార్ట్ కట్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీ గుర్తింపురద్దు చేయాలని ఆయన ఈసీ దగ్గర పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.
గత ప్లీనరీలో పార్టీ పేరు మార్పు , జీవిత కాల అధ్యక్షుడిగా జగన్ ఎంపిక తీర్మానాలు
గత జూలైలో నిర్వహించిన ప్లీనరీలో తమ పార్టీ రాజ్యాంగంలో సవరణలు చేస్తున్నట్టు తీర్మానాలు చేశారు. వైఎస్ జగన్‌ని జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించారు. అధ్యక్ష నియామకంలో మార్పులతో పాటుగా పార్టీ రాజ్యాంగం సవరణల ప్రతిపాదనలకు కూడా ప్లీనరీ ఆమోదం తెలియజేసింది. పార్టీ రాజ్యాంగంలోని ఆర్టికల్ -1 ప్రకారం... యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా లేదా వైఎస్సార్సీపీగా మారుస్తూ తీర్మానం చేశారు. ఇకపై ఎన్నికల సంఘం వద్ద కూడా పార్టీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా ప్రస్తావిస్తారని తెలిపారు. అది పొడి అక్షరాల్లో వైఎస్సార్సీపీగా ఉంటుంది. తాజాగా ప్లీనరీలో చేసిన తీర్మానం ప్రకారం ఎన్నికల సంఘం ఈ రెండింటిలో ఏ పేరుకి అంగీకరిస్తే దానినే ఖరారు చేయాలి.
శాశ్వత అధ్యక్ష నియామకం చెల్లదన్న ఈసీ !
పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదని తేల్చేంది ఈసీ. ఈ మేరకు సెప్టెంబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. ఏ పార్టీలోనైనా శాశ్వత పదవులు ఉండకూడదని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ఎన్నికల నియమావళికి అనుగుణంగా ఎన్నికలు జరగాలని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అయినా తరుచూ ఎన్నికలు జరుగుతూ ఉండాల్సిందేని చెప్పింది. ఏ పార్టీలోనూ శాశ్వత అధ్యక్షుడిగా, శాశ్వత పదవులు వర్తించవు అని పేర్కొంది. ఈసీ నియామవళికి తగ్గట్టుగానే రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయని వివరించింది. అయితే ఆ తర్వాత వైసీపీ అధ్యక్ష పదవి ఎన్నిక నిర్వహించలేదు. ఈ కారణంగానే తమ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని రఘురామ ఈసీకి లేఖ రాశారు.