Raghurama : కస్టోడియల్ టార్చర్ చేసిన వారిపై చర్యలు తీసుకోండి - ప్రధాని మోదీకి మరోసారి ఎంపీ రఘురామ లేఖ !
తనపై కస్టోడియల్ టార్చర్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రఘురామ .. ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇప్పటికే ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు.
Raghurama : ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని మోదీకి లేఖ రాశారు. తనపై కస్టోడియల్ టార్చర్‌కు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తనపై దాడి జరిపిన అధికారుల్లో ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఉన్నారని ఫిర్యాదు చేశారు. లోకసభ నేతగా ప్రధాని తనపై జరిగిన దాడిపై సీబీఐ, ఎన్‌ఐఏల దర్యాప్తుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ కమిటీ ద్వారా కూడా తనపై జరిగిన దాడి పట్ల విచారణ జరిపించాలని కోరుతూ ఎంపీ రఘురామ లేఖలో పేర్కొన్నారు.
సీఐడీ అధికారుల కాల్ డేటాలను భద్రపరిచేలా గతంలో ఆదేశాలు
తన కస్టోడియల్ టార్చర్‌పై సీబీఐ విచారణ జరపాలని ఏపీ హైకోర్టులో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. రఘురామను అదుపులోకి తీసుకున్న సమయంలో సీఐడీ అధికారుల కాల్ డేటాను స్వాధీనం చేసుకొని భద్ర పరచాలని సీబీఐకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. కాల్ డేటాను వెంటనే సేకరించాలని సీబీఐను హైకోర్టు ఆదేశించింది. టెలికం నిబంధనల ప్రకారం రెండేళ్లు మాత్రమే కాల్ డేటా ఉంచుతారని రఘురామ కృష్ణంరాజు న్యాయవాది నౌమీన్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కాల్ డేటాను ప్రిజర్వ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ హరినాథ్ వాదనలు వినిపించారు. ఈ కేసు ఎఫ్ఐఆర్ సీఐడీ వద్దనే ఉందని...అందుకే కాల్ డేటా కూడా సీఐడీ అధికారులే సేకరించాలని సీబీఐ తరఫు న్యాయవాది హరినాథ్ కోర్టుకు తెలిపారు.
తనను అక్రమంగా అరెస్టు చేసి కొట్టారని రఘురామ ఆరోపణ
సీబీఐ న్యాయవాది వాదనలపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో పిటిషనర్ ఆరోపణలు చేసింది సీఐడీ మీదే అయితే, కాల్ డేటా సేకరించాలని ఆ సంస్థను ఎలా ఆదేశిస్తామని ప్రశ్నించింది. ఇకపోతే ఈ కేసులో సీఐడీ అధికారులు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. కాల్ డేటా సేకరించాలని చెప్పడం చట్టవిరుద్ధమని సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే సీఐడీ ఇంప్లీడ్ పిటిషన్‌ను ఇంకా అనుమతించలేదని హైకోర్టు తెలిపింది. ఈ కేసు దర్యాప్తు సీబీఐకు ఇవ్వాలా.? లేదా అనేది కోర్టు ఇంకా నిర్ణయించలేదని...ఈ కేసులో కాల్ డేటా కీలకమని ఎంపీ రఘురామ తరఫు న్యాయవాది నౌమీన్ అన్నారు. దీంతో వెంటనే కాల్ డేటాను సేకరించి భద్రపరచాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.
మిలటరీ ఆస్పత్రిలో పరీక్షలతో తేలిన నిజం
రెండేళ్ల కిందట రఘురామకృష్ణరాజును ఆయన పుట్టిన రోజున హైదరాబాద్ లోని ఇంట్లో అరెస్ట్ చేశారు. ఏ కేసులు పెట్టారో కూడా చెప్పలేదు. నోటీసులు ఇవ్వలేదు. బలవంతంగా హైదరాబాద్ నుంచి తీసుకెళ్లారు. ఆ రాత్రి కస్టడీలో ఉంచుకున్నారు. తర్వాతి రోజు కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈసందర్భంగా తనను సీఐడీ అధికారులు తీవ్రంగా కొట్టారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. అప్పట్లో కోర్టు వైద్య పరీక్షలకు ఆదేశించింది. సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలో పరక్షలు చేశారు. గాయాలు అయినట్లుగా తేల్చారు. తనను కొట్టింది సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ అని, వీడియోలో చూసింది సీఎం జగన్ అని, దీని వెనుక ఎవరున్నారన్న దానిపై విచారణ జరపాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. లోక్ సభ ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేశారు.