Nara Lokesh : ఆడబిడ్డల్ని ఏడిపిస్తున్న పాపం ఊరికే వదలదు, మాజీ మంత్రి బాలినేనిపై లోకేశ్ ఫైర్
Nara Lokesh : ప్రకాశం జిల్లా ఆలూరుకు చెందిన మహిళ కవిత ఇంటికి తాళం వేశారు. ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి బాలినేని అనుచరులు మహిళను వేధిస్తున్నారని ఆరోపించారు.
Nara Lokesh : ఆడబిడ్డల్ని ఏడిపిస్తున్న పాపం ఊరికే వదలదు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీపై ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో మహిళలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆయన ట్వీట్ చేశారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఆలూరుకు చెందిన కవిత గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో తమ సమస్యలపై మాజీ మంత్రి బాలినేనిని ప్రశ్నించింది. అప్పటి నుంచి కవితకు కష్టాలు మొదలయ్యాయని లోకేశ్ అన్నారు. కవిత ఇంటి గేటుకు బాలినేని అనుచరులు తాళాలు వేసి వేధిస్తున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించమని ప్రశ్నించినందుకు కనీసం నీళ్లు, పాలు కూడా తెచ్చుకునే వీలులేకుండా నిర్బంధించారని బాధితురాలు వాపోతుందన్నారు. వైసీపీ పాలనలో మహిళలకు దక్కిన గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. కవితను వేధిస్తున్న బాలినేని అనుచరగణం, వారికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
ఆడబిడ్డల్ని ఏడిపిస్తున్న పాపం ఊరికే వదలదు జగన్ రెడ్డి. వైసిపి నాయకుల పైశాచికత్వానికి రాష్ట్రంలో మహిళలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కొత్తపట్నం మండలం ఆలూరులో జరిగిన గడప గడపకు కార్యక్రమంలో తమ సమస్యలపై #HawalaKingBalineni ని ప్రశ్నించిన మహిళ..,(1/2) pic.twitter.com/sVuembfo3H
— Lokesh Nara (@naralokesh) June 25, 2022
అసలేం జరిగింది?
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఆలూరుకు చెందిన కవిత అనే మహిళ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులపై ఆరోపణలు చేశారు. తనకు ఏమైనా జరిగితే వారిదే బాధ్యత అని కన్నీతి పర్యంతమన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెలరోజుల క్రితం అల్లూరు గ్రామానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చారు. ఆ సమయంలో ఓ మహిళ రైతు సమస్యలపై బాలినేనిని నిలదీసింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో కవిత.. తనను స్థానిక నేతలు వేధిస్తున్నారని ఆరోపించారు. సమస్యలపై ప్రశ్నించినందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు తన ఇంటిగేటుకు తాళం వేశారని వాపోయింది. ప్రశ్నించినందుకే తమ ఇంటికి విద్యుత్తు సరఫరా, మంచినీరు నిలిపివేశారని ఆరోపించింది. ఇంటికి పాలు రానివ్వకుండా చేశారన్నారు.
బాలినేని శ్రీనివాసరెడ్డే బాధ్యుడు!
మొన్న వాసన్న గడప గడపకు కార్యక్రమానికి వచ్చినప్పుడు ప్రశ్నించానని నెల రోజులు ఇంటికి కరెంట్ కట్ చేశారు. నీరు, పాలు రానివ్వడంలేదు. ఇప్పుడు ఇంటికి తాళం వేశారు. ఓ మహిళను ఇంతలా వేధిస్తారా? జనగన్న అక్కచెల్లెమ్మలుగా చూసుకుంటానన్నారు. ఇలా ఏ ప్రభుత్వంలో, ఏ రాష్ట్రంలో ఉందని నాకు ఆన్సర్ కావాలి. ఒక సమస్యపై ప్రశ్నిస్తే ఇంతలా చేస్తారా? ఇంట్లో ఒక్క దానిని, ఆడపిల్లను ఇలా వేధిస్తారా? ఇంటికి తాళం వేశారు. ఇదెక్కడి న్యాయం. రైతుల గురించి ప్రశ్నించినందుకు ఇలా వేధిస్తున్నారు. నాకు ఏమైనా జరిగితే బాలినేని శ్రీనివాసరెడ్డే బాధ్యుడు. పోలీసులు కూడా వాళ్ల పక్షానే మాట్లాడుతున్నారు. రౌడీ రాజ్యంలా ప్రవర్తిస్తున్నారు. ఒక ఆడపిల్లపైనా మీ ప్రతాపం. -బాధితురాలు కవిత