(Source: Poll of Polls)
Prabhas Fan Dies: సలార్ రిలీజ్ సంబరాల్లో విషాదం, ఫ్లెక్సీ కడుతూ ప్రభాస్ అభిమాని మృతి
Prabhas Fan Dies: సలార్ విడుదల రోజే విషాదం చోటుచేసుకుంది. థియేటర్ ఎదుట ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్ కు గురై ప్రభాస్ అభిమాని చనిపోయాడు.
Prabhas Fan Dies of Electric shock in Dharmavaram: ధర్మవరం: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ విడుదల రోజే విషాదం చోటుచేసుకుంది. థియేటర్ ఎదుట ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్ కు గురై ప్రభాస్ అభిమాని చనిపోయాడు. శ్రీసత్యసాయి జిల్లా (Sri Sathyasai District) ధర్మవరంలో ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే..
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన మూవీ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ (Salaar Part 1 – Ceasefire) నేడు విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ భారీ కటౌట్స్ పెట్టారు. కొన్ని చోట్ల భారీ లైట్లతో సెటింగ్ ఏర్పాటు చేసి డ్యాన్స్ తో దుమ్మురేపారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో రంగా సినీ కాంప్లెక్స్ ఎదుట ప్రభాస్ అభిమాని బాలరాజు ఫ్లెక్సీ కట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ప్రభాస్ అభిమాని బాలరాజు (27) కరెంట్ షాక్ కు గురయ్యాడు. దాంతో అక్కడికక్కడే అతడు చనిపోయాడని స్నేహితులు చెబుతున్నారు.
ప్రభాస్ సలార్ మూవీ విడుదల కావడంతో అనంతపురం తపోవనానికి చెందిన బాలరాజు, అతడి ఫ్రెండ్స్ ఫ్లెక్సీ తయారు చేయించారు. సలార్ రిలీజ్ డే కావడంతో రంగా సినీ కాంప్లెక్స్ ఎదుట ఓ ఇంటిపై ప్రభాస్ ఫ్లెక్సీ కడుతుండగా ఇనుప చువ్వలు కరెంట్ తీగలకు తాకడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. మరో యువకుడు గజేంద్రకు సైతం కాలిన గాయాలయ్యాయి. బాలరాజు మరికొందరు ఫ్రెండ్స్ కొంచెం దూరంగా ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
అనంతపురానికి చెందిన బాలరాజు కనగానపల్లి మండలం మామిళ్లపల్లిలో నివాసం ఉంటున్నాడు. చిరు వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మృతుడు బాలరాజుకు భార్య శిరీష, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రభాస్ పై వీరాభిమానంతో సలార్ పార్ట్ 1 మూవీ విడుదల సందర్భంగా ధర్మవరానికి వెళ్లి థియేటర్ ఎదుట ఫ్లెక్సీ కట్టే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న ధర్మవరం వన్‌టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కరెంట్ తీగలు కిందకు వేలాడటం వల్లే బాలరాజు చనిపోయాడని, అతడి బంధువులు ధర్నాకు దిగారు. బాలరాజు కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్, మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. పోలీసులు వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించివేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
Also Read: Salaar Movie Review - సలార్ రివ్యూ: ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా హిట్టా? ఫట్టా?