Polavaram Project: నత్తనడకన సాగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు, పీపీఏ నివేదిక వెల్లడి!
Polavaram Project: పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయని పీపీఏ నివేదిక వెల్లడించింది. ఇప్పటి వరకు సగం పనులు కూడా పూర్తి కాలేవని తెలిపింది. ప్రభుత్వం చెబుతున్నది వేరు జరుగుతున్నది వేరని వివరించింది.
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా సాగడం లేదని పీపీఏ నివేదిక వెల్లడించింది. ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని వివరించింది. గత ఏడాది కాలంలో కీలకమైన భూసేకరణ, పునరావాసం పనులు కేవలం 1.97 శాతమే పూర్తయ్యాయని తెలిపింది. మొత్తం పనుల్లో ఏడాదిలో జరిగినవి 5.4 శాతం మాత్రమేనని చెప్పింది. ఇందులోనూ అత్యంత ప్రధానమైన బెడ్ వర్క్స్ లో పురోగతి 0.99 శాతమే. భూసేకరణ, పునరావాస పనులు 2021 అక్టోబర్ 31 నాటికి 20.19 శాతం జరిగితే, 2022 అక్టోబర్ 31 నాటికి పూర్తయింది. 22.16 శాతమే. మొత్తంగా ప్రాజెక్టులో హెడ్ వర్క్స్, కాలువలు అన్నీ కలపి నిరుడు అక్టోబర్ 31 నాటికి 42.56 శాతం పూర్తయితే, ఈ ఏడాది అక్టోబర్ నాటికి అది అతి కష్టం మీద 47.96 శాతానికి చేరింది.
ఎప్పుడు చేపడతారో ఎప్పటికి పూర్తవుతాయో తెలీదు..
ఈనెల 16వ జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సమావేశంలో సంబంధిత ఇంజినీర్లు ఇచ్చిన ప్రజెంటేషన్ ప్రకారమే ప్రాజెక్టులో 50 శాతం పనులు పూర్తి కాలేదు. ప్రాజెక్టులో కొన్ని పనులు చేసే గుత్తేదారులను తొలగించారు. ఆ స్థానంలో కొత్త గుత్తేదారులను ఎంపిక చేయలేదు. బెడ్ వర్క్స్ లో ఎడమ వైపు నావిగేషన్ కాలువ, లాక్ కు సంబంధించిన పనిని ముందుగానే ముగిస్తూ.. 2020 జులై ఎనిమిదవ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనిని ఇప్పటి వరకు మరొకరికి అప్పగించలేదు. ఎడమ కాలువకు సంబంధించి మిగిలిన 5 ప్యాకేజీల పనుల గుత్తేదారులను రెండేళ్ల క్రితం తొలగించినా ఇప్పటి వరకు కొత్త వారిని ఎంపిక చేయలేదు. డిస్ట్రిబ్యూటరీ పనులు అయితే ఎప్పుడు చేపడతారో, ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి.
ప్రభుత్వం, పీపీఏ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు..
2017 - 18 సంవత్సరం ధరల ప్రకారం రూ.55,656.87 కోట్ల సవరించిన అంచనాను కేంద్రానికి పంపారు. ఆర్తిక శాఖ ఆధ్వర్ంలోని కమిటీ రూ.47,725..74 కోట్లకు సిఫార్సు చేసింది. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించలేదు. 2013 - 14 ధరల ప్రకారమే చెల్లిస్తామని చెప్పింది. అదే జరిగితే తాజా అంచనాలో సగం కూడా రాదు. ఈ క్రమంలోనే తాజా వ్యయాన్ని ఆమోదించాలంటూ రాష్ట్రం పంపిన దస్త్రం రెండేళ్లుగా అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. తుది ఆమోదంతో సంబంధం లేకుండా మొదట 41.15 మీటర్ల వరకు నీటి నిల్వకు వీలుగా రూ.10 వేల కోట్లు ఆడ్ హక్ గా విడుదల చేయాలని రాష్ట్రం కోరినా దానికీ అతీగతీ లేదు. పైగా గతంలో చెల్లించిన బిల్లలుపైనే ఆడిట్ పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తాగునీటి సరఫరాకు అయ్యే మొత్తాన్ని ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో భాగంగా చూడాలన్న రాష్ట్ర వినతిపైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పీపీఏ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉన్నాయి.
మొదట 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసి పాక్షిక ప్రయోజనాలు కల్పించేందుకు రూ.10,485.38 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేసి ఆరు నెలలు దాటింది. కానీ ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. తాజా నివేదిక ప్రకారం 2022 అక్టోబర్ వరకు రూ.20,174.24 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత రూ.15,970.53 కోట్ల పనులు చేశారు. దీనిలో కేంద్రం రూ. 13,097 కోట్లు తిరిగి ఇచ్చిందని, మరో రూ.2,873 కోట్లు రావాల్సి ఉందని తాజాగా ఏపీ పీపీఏకు ఇచ్చిన నివేదిక వెల్లడించింది.