Power Cut Problems In AP: సెల్‌ఫోన్ లైటింగ్‌లో పిల్లల చదువులు! పది పరీక్షల వేళ కరెంటు కోతలు - ఈ ఫోటోలు నిజమేనా?
సెల్ ఫోన్ వెలుతురులో ఓ విద్యార్థిని చదువుకునే ఫొటో వాట్సప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇచ్చిన సమాచారం కరెక్టా కాదా అనేది తేలడంలేదు.
ఏపీలో కరెంటు కోతల సమస్య ఉన్నమాట వాస్తవమే. అయితే పదో తరగతి పరీక్షలు జరుగుతున్న తరుణంలో రాత్రి కరెంటు పోతే పిల్లలకు ఇక నరకమే. ఏడాది మొత్తం చదివింది ఒక ఎత్తయితే, పరీక్ష ముందురోజు చదివేది మరో ఎత్తు. అందుకే రాత్రి పూట పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు విద్యార్థులు. అలాంటి సమయంలో కరెంటు పోతే ఏం చేయాలి. ఇన్వర్టర్లు, ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్నవారి పరిస్థితి సరే.. ఏమీ లేని పేద పిల్లలు ఎలా చదువుకోవాలి. దీపం వెలుగులో పుస్తకాలతో కుస్తీ పడితే బుర్కకెక్కేది ఎంత..? అయితే నెల్లూరు జిల్లాలో సెల్ ఫోన్ వెలుతురులో చదువులు అంటూ కొన్ని ఫొటోలు వాట్సప్ గ్రూపుల్లో తిరుగుతున్నాయి. రాత్రిపూట కరెంటు పోతే పిల్లలు చివరకు సెల్ ఫోన్, బ్యాటరీల వెలుగుల్లో చదువుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే వీటిలో ఏది నిజం..? ఎంత నిజం..?
సెల్ ఫోన్ వెలుతురులో ఓ విద్యార్థిని చదువుకునే ఫొటో వాట్సప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. అయితే ఆ విద్యార్థిని ఎవరు, ఏ ఊరు అనే విషయంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇచ్చిన సమాచారం కరెక్టా కాదా అనేది తేలడంలేదు. మరి ఇలాంటి ఫొటోలు ఎందుకు సర్కులేట్ అవుతున్నాయి. వీటి వెనక ఉంది ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది.
పల్లెల్లో పరిస్థితి ఏంటి..?
ప్రస్తుతం పల్లెల్లో రాత్రివేళ కరెంటు కోతలు సహజంగా మారాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కరెంటు కోతలు ఉంటున్నాయి. పది పరీక్షలు మొదలు కావడంతో విద్యుత్ శాఖ అధికారులు కూడా రాత్రివేళల్లో సరఫరా నిలిపివేయడానికి భయపడుతున్నారు. అందుకే కరెంటు కోతల సమయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. రాత్రి వేళ కరెంటు తీసినా 11 గంటల తర్వాతే కోతలు ఉంటున్నాయి.
నష్టం ఎవరికి..?
పల్లెటూళ్లలో కూడా దాదాపుగా ఇన్వర్టర్లు, చార్జింగ్ లైట్లు అందుబాటులోకి వచ్చిన పరిస్థితి చూస్తున్నాం. అయితే హాస్టళ్ల విషయంలో పిల్లలకు మాత్రం కరెంటు పోతే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సామాజిక హాస్టళ్లలో ఉంటూ చదువుకునేవారు కరెంటు పోతే చదువుకి బ్రేక్ పడినట్టే. ప్రస్తుతానికి ఏపీలో కరెంటు కోతలు ఉన్నా కూడా.. పరీక్షల సీజన్ కావడంతో రాత్రివేళ కరెంటు కోతలపై ప్రభుత్వం కూడా ఆలోచిస్తోంది. ఆమేరకు పగటిపూట సర్దుబాటు చేసుకునే దిశగా ఆలోచిస్తోంది.
అటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తు కోసం పరీక్షల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎగ్జామ్స్ సీజన్ కావడంతో జిల్లాలో చార్జింగ్ లైట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇన్వర్టర్ల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి.