Jockey Jump : "జాకీ" పరిశ్రమ రాప్తాడు నుంచి తెలంగాణకు ఎందుకు మారింది ? ఎమ్మెల్యే బెదిరింపుల ఆరోపణలు నిజమేనా ?
లో దుస్తుల పరిశ్రమ జాకీ అనంతపురం నుంచి తెలంగాణకు వెళ్లిపోవడంపై ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. లంచం కోసం ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చేసిన బెదిరింపుల వల్లేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Jockey Jump : అంతర్దాతీయ బ్రాండ్ అయిన " జాకీ " లోదుస్తుల పరిశ్రమ అనంతపురం నుంచి తెలంగాణకు తరలి వెళ్లిపోవడపై రాజకీయ దుమారం రేగుతోంది. బెంగళూరులో పెట్టాల్సిన పరిశ్రమను గత ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఆఫర్ చేసి మరీ రాప్తాడు నియోజకవర్గంలో ఏర్పాటు చేయించేలా ఒప్పించింది. భూమి కేటాయింపు పూర్తవడంతో పాటు ఫ్యాక్టరీ నిర్మాణాలను కూడా ఆ కంపెనీ ప్రారంభించింది. కానీ ఇప్పుడు మాకు భూమి వద్దని చెప్పి ప్రభుత్వానికి సరెండర్ చేసి.. తెలంగాణకు వెళ్లిపోయింది. అక్కడి ప్రభుత్వం భూమి కేటాయించడంతో పరిశ్రమ పెట్టే పనులు ప్రారంభించారు. అసలు ఏపీ నుంచి ఆ పరిశ్రమ ఎందుకెళ్లిపోయింది ? రాజకీయ దుమారం ఎందుకు సాగుతోంది ?
రాప్తాడు నియోజకవర్గంలో మహిళలు, యువత ఉపాధి కోసం జాకీ పరిశ్రమ ఏర్పాటుకు గత ప్రభుత్వం ప్రయత్నం !
"జాకీ" బ్రాండ్ లో దుస్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంటుంది. ఈ బ్రాండ్ పేజ్ ఇండస్ట్రీస్ కి చెందినది. కర్ణాటకలో మొదట ప్లాంట్ పెట్టాలనుకున్నారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పరిశ్రమల మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులు పేజ్ ఇండస్ట్రీస్ యాజమాన్యాన్ని సంప్రదించి.. బెంగళూరుకు దగ్గరగా ఉండే రాప్తాడులో ప్లాంట్ పెట్టాలని ఆహ్వానించారు. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలను ఇస్తామని హామీ ఇచ్చారు. వారు కూడా అంగీకరించారు. దీంతో 2018 సెప్టెంబర్‌లో అనుమతుల ప్రక్రియ ప్రారంభమయింది. భూముల కేటాయింపు .. ప్లాంట్ అనుమతుల ప్రక్రియ 2019కి పూర్తయింది.
కొంత ఖర్చు పెట్టుకున్న తర్వాత పరిశ్రమను తెలంగాణకు తరలించేసిన పేజ్ ఇండస్ట్రీస్ !
'
అయితే మూడున్నరేళ్లవుతున్నా ఇంకా జాకీ ప్లాంట్ పూర్తి కాలేదు. ఉత్పత్తి ప్రారంభం కాలేదు. ఇంకా చెప్పాలంటే.. 2019లో అన్ని రకాల అనుమతులు వచ్చిన తర్వాత .. నిర్మాణాలు నిలిపివేసింది. అప్పటికి ప్రభుత్వం కూడా మారింది. కానీ హఠాత్తుగా ఆ సంస్థ తెలంగాణలో ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. కేటీఆర్ సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకుంది. ఏడు వేల మందికి ఉపాధి కల్పించేలా నిర్ణయం జరిగింది. ఏం జరిగిందా అని ఆరా తీస్తే.. తాము ప్లాంట్ పెట్టదల్చుకోలేదని.. భూమిని వెనక్కి తీసేసుకుని తాము కట్టిన డబ్బులు తమకు ఇచ్చేయాలని ఆ సంస్థ కోరింది. ఈ లేఖ కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో తెరవెనుక ఏం జరిగిందా అన్న చర్చ ప్రారంభమయింది.
Delighted to share that popular inner wear brand Jockey (Page Industries) will be setting up garment manufacturing factories in Ibrahimpatnam & Mulugu, producing 1 Cr garments creating 7000 jobs in the state
— KTR (@KTRTRS) November 16, 2022
Hearty Welcome & best wishes to the company as it embraces Telangana 👍 pic.twitter.com/HAHGtqy3jx
లంచం కోసం స్థానిక ఎమ్మెల్యే బెదిరించారనే ఆరోపణలు !
ప్రభుత్వం మారడమే కాదు.. రాప్తాడులో ఎమ్మెల్యేగా కూడా వైఎస్ఆర్‌సీపీ తరపున తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విజయం సాధించారు. ఆయన తరపున మనుషులు.. పనుల్ని అడ్డుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. పెద్ద ఎత్తున కమిషన్ అడిగారని పేజ్ కంపెనీ వాళ్లు ఇవ్వకపోవడంతో పనులు ఆపేయించారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే కూడా స్పందించారు. అంత విలువైన స్థలం ఇస్తే తాను రూ.15 కోట్లు కూడా లంచం ఇస్తానని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పేజ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం, పరిశ్రమల శాఖ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో ఇక భూములు వెనక్కి ఇచ్చి ఆ సంస్థ తెలంగాణకు వెళ్లిపోయిందని చెబుతున్నారు.
జాకీ పరిశ్రమ వచ్చి ఉంటే ప్రజలకు ఉద్యోగులు - ప్రభుత్వానికి పన్నుల ఆదాయం !
జాకీ పరిశ్రమ నిర్మాణం పూర్తి అయి ఉంటే.. ఆరేడు వేల ఉద్యోగాలు వచ్చి ఉండేవి. వస్త్ర సంబంధిత పరిశ్రమ కావడంతో మహిళలకు ఎక్కువ అవకాశాలు వచ్చి ఉండేవి. రాప్తాడు ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ది చెంది ఉండేది. పరిశ్రమ రావడం వల్ల అక్కడ జరిగే కార్యకలాపాల్లో ఖర్చయ్యే ప్రతీ పైసాలో రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వచ్చేది. అయితే ఇప్పుడు ఆ పరిశ్రమ వెళ్లిపోవడం వల్ల అన్నీ కోల్పోవడమే కాదు... పరిశ్రమలు పెట్టాలంటే.. ఎమ్మెల్యేలకు లంచాలు.. ముడుపులు ఇవ్వాలన్న ఇమేజ్ ఏపీపై పడిందని.. అందుకే పరిశ్రమల రావడం లేదన్న ఆరోపణలు రావడానికి కారణం అవుతోంది.