Madanapalle Fire Accident Case: మదనపల్లె ఘటనలో కదులుతున్న డొంక, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పీఏ ఇంట్లో సోదాలు
Madanapalle Incident :మదనపల్లె ఫైళ్ల దహనం వ్యవహారంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హైదరాబాదులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పీఏ శశికాంత్ నివాసంలో సోదాలు ముగిశాయి.
Madanapalle Fire Accident Case: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్నిప్రమాదం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల కాల్చివేత ఘటనలో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డూ అదుపులేకుండా భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో వారు చేసిన దోపిడీని కప్పిపుచ్చేందుకు వైసీపీ నేతలు రెవెన్యూ ఫైళ్లను దహనం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అగ్నిప్రమాదం జరిగిన మరుసటి రోజే డీజీపీ ద్వారకా తిరుమలరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.. ప్లాన్ ప్రకారమే ఫైళ్లను కాల్చారని చేశారని ప్రమాదవశాత్తు జరిగింది కాదని ప్రకటించడంతో వైసీపీ నేతలు అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన రోజు అనుమానిత సిబ్బందిని విచారించారు. వారి నుంచి వచ్చిన సమాచారం మేరకు వైసీపీ నేతలపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
నాలుగు పెట్టెల దస్త్రాలు స్వాధీనం
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏ శశికాంత్‌పై పోలీసులు నిఘా పెట్టారు. శనివారం రాత్రి నుంచి హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలోని శశికాంత్ నివాసంలో సోదాలు నిర్వహించారు. శశికాంత్ నివాసంలో ఉన్నటువంటి భారీగా ఫైళ్లను గుర్తించారు. పోలీసులు అతడి నివాసం నుంచి నాలుగు పెట్టెల నిండా ఫైళ్లను తరలించినట్టు సమాచారం. పోలీసులు ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. సీఐ రమేశ్ ఆధ్వర్యంలో ఈ సోదాలు ఆదివారం మధ్యాహ్నం వరకు జరిగాయి. పోలీసులు గుర్తించిన ఫైళ్లను పోలీసులు నాలుగు బాక్సుల్లో తీసుకెళ్లారు. ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పెద్ది రెడ్డి పీఏ శశికాంత్ ఉంటున్నారు. పోలీసులు సోదాలకు వచ్చిన సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యేను పిలిపించి పోలీసులు తనిఖీలు చేపట్టారు. మరో వైపు ఫోరెన్సిక్ నివేదికల కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. ఫైళ్ల దహనం ఘటనలో రెవెన్యూ సిబ్బంది పాత్ర కూడా ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత అరెస్టులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధమైన కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాషాకు నోటీసులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం బెంగుళూరులో ఉండడంతో విచారణ అధికారులు మదనపల్లెలోని ఆయన ఇంటికి నోటీసులు అందించారు. ఇంట్లో నోటీసులు ఇచ్చిన విషయాన్ని బెంగళూరులో ఉన్న నవాజ్ భాషాకు ఫోన్ లో సమాచారం అందించారు. విచారణకు హాజరు కావాలని ఆయనకు సూచించారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో దగ్ధమైన ఫైళ్లలో చాలావరకు భూములకు సంబంధించినవేనని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భూ అక్రమాలకు సంబంధించిన కుట్ర కోణం ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగిన విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు... డీజీపీ, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ లను అలర్ట్ చేశారు. వారిని వెంటనే మదనపల్లె వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పీ సిసోడియా కూడా మదనపల్లె వెళ్లి తనిఖీలు నిర్వహించారు.