Polavaram Project: పోలవరంలో కుంగిపోయిన గైడ్ బండ్ - సమీక్షించిన జల సంఘం ఛైర్మన్
Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే ఎగువన ఎడమ వైపును నిర్మిస్తున్న గైడ్ బండ్ కుంగిపోయింది. 500 మీటర్ల పొడవున దిగువ నుంచి సుమారు 26 మీటర్ల ఎత్తున దీని నిర్మాణం చేపట్టారు.
Polavaram Project: పోలవరంలో ప్రాజెక్టులో స్పిల్ వే ఎగువన ఎడమ వైపు నిర్మిస్తున్న గైడ్ బండ్ కుంగిపోయింది. దాదాపు 500 మీటర్ల పొడవున దిగువ నుంచి సుమారు 26 మీటర్ల ఎత్తున దీని నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టు పనుల కాంట్రాక్టర్ అయిన మేఘా ఇంజినీరింగ్ కంపెనీయే ఈ పనులను కూడా చేస్తోంది. ఏడాది కింద చేపట్టిన నిర్మణ పనులు దాదాపు కొలిక్కి వచ్చిన సమయంలో గైడ్ బండ్ మధ్యలో పగులుగా ఏర్పడి అప్రోచ్ ఛానల్ వైపునకు కుంగిపోయింది. గైడ్ బండ్ లో భాగంగా నిర్మించిన కట్ట, అందులోని రాళ్లు దిగువకు జారిపోయాయి. దీంతో ఇందులోని రిటైనింగ్ వాలు కుంగింది. ఇందులో కటాఫ్ సరిగా లేకపోవడం వల్లే కుంగి ఉంటుందని కొందరు ఇంజనీర్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఈ విషయం తెలియజేశారు. గైడ్ ఫండ్ ఎందుకు కుంగింది, కారణాలేంటి, ఎలా సరిదిద్దాలి అనే అంశంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ సభ్యులు కలిసి సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. శుక్ర, శనివారాల్లో గైడ్‌బండ్‌లో కొన్ని పగుళ్లు వచ్చాయని, ఆదివారం నాటికి కట్ట పూర్తిగా కుంగిపోయిందని చెబుతున్నారు.
గైడ్‌బండ్ కుంగినట్లు తెలియగానే సోమవారం సిడబ్ల్యుసి ఛైర్మన్ ఖుష్విందర్ వోహ్రా.. ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి, చీఫ్ ఇంజినీరు సుధాకర్ బాబు, ఎస్‌ఈ నరసింహ మూర్తి, ఇతర నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. డిజైన్స్ సంస్థకు చెందిన నిపుణులు పోలవరాన్ని సందర్శించి, గైడ్‌బండ్ కుంగడానికి కారణాలు గుర్తించి, విశ్లేషించాలని సీడబ్ల్యూసీ ఛైర్మన్ సూచించారు. గైడ్‌బండ్ రక్షణపై తక్షణ చర్యలు ఏం తీసుకోవాలో తేల్చాలన్నారు. ఇంజినీర్లు పరిశీలించి ఈ సమస్య పరిష్కారానికి మార్గం కనుగొని తక్షణమే కేంద్ర జల సంఘానికి నివేదించాలని ఆదేశించారు. ఈ అంశంపై చర్చించేందుకు పోలవరం ప్రాజెక్టు ఇంజినీరు కేంద్ర జలసంఘం పెద్దలను కలిసేందుకు మంగళవారం ఢిల్లీ వెళుతున్నారు.
పోలవరంలో సీఎం జగన్ టూర్- పనుల జరుగుతున్న తీరుపై ఏరియల్ సర్వే
పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రాజెక్టు ఏరియాకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఏరియల్ సర్వే చేపట్టారు. ఏరియల్ సర్వే ద్వారా పోలవరం పనులను పరిశీలించారు. రెండుసార్లు ప్రాజెక్టు ప్రాంతంలో హెలికాప్టర్‌లో తిరిగిన సీఎం జగన్ పనులు తీరును పరిశీలించారు. గతం కంటే భిన్నంగా ఏం జరిగిందనే విషయంపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పోలవరం ప్రాజెక్టులో చిన్న చిన్న సమస్యలను కూడా విపత్తులా చూపిస్తున్నారని మీడియాపై విమర్శలు చేశారు జగన్. గత ప్రభుత్వం ఎగువ కాఫర్ డ్యామ్‌లో ఖాలీలు వదిలేశారని దీని వల్ల చాలా నష్టం వాటిల్లిందన్నారు. దీని వల్ల ప్రాజెక్టు ఆలస్యం కావడమే కాకుండా రెండు వేల కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. ఇలాంటివి ఓ వర్గం మీడియాకు కనిపించడం లేదని విమర్శించారు. ప్రాజెక్ట్ స్ట్రక్చర్‌కు సంబంధం లేని గైడ్‌వాల్ కుంగితే దాన్నో పెద్ద సమస్యగా చిత్రీకరించారన్నారు.