Pariksha Pe Charcha: 'పరీక్ష పే చర్చ'లో ఏపీ టీచర్ ప్రశ్న - ప్రధాని మోదీ ఏం చెప్పారంటే?
Andhra Pradesh News: ప్రధాని మోదీ 'పరీక్షా పే చర్చ'లో అనకాపల్లి జిల్లాకు చెందిన టీచర్, విద్యార్థి పాల్గొన్నారు. టీచర్ అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ ఆసక్తికర సమాధానం చెప్పారు.
PM Modi Answer to AP Teacher Question in Pariksha Pe Charcha: పరీక్షల ముందు విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు ప్రధాని మోదీ ఢిల్లీ ప్రగతి మైదాన్ లోని ఐటీపీవో, భారత్ మండపం టౌన్ హాల్ లో సోమవారం 'పరీక్షా పే చర్చా' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో ఏపీకి చెందిన టీచర్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అనకాపల్లి జిల్లా ఉప్పరపల్లి జడ్పీ హైస్కూల్ సంగీతం టీచర్ సి.సంపత్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'పరీక్షల టైంలో విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళన పూర్తిగా తొలగించాలన్నదే నా లక్ష్యం. అందుకు మార్గనిర్దేశం చేయండి.' అంటూ విజ్ఞప్తి చేయగా.. ప్రధాని మోదీ పలు సూచనలు చేశారు. 'టీచర్, విద్యార్థి మధ్య బంధం కేవలం పరీక్షల వరకే పరిమితం కాకూడదు. తమకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు విద్యార్థులు ధైర్యంగా టీచర్లకు చెప్పుకొనే పరిస్థితి ఉండాలి. అలాంటప్పుడే పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడిని జయించగలుగుతారు. విద్యార్థులు చదువుల్లో మంచి ప్రతిభ కనబరిచినప్పుడు టీచర్లు వారి ఇళ్లకు వెళ్లి మీ పిల్లలు బాగా రాణిస్తున్నారని తల్లిదండ్రులతో చెబితే మొత్తం వాతావరణమే మారిపోతుంది.' అంటూ సమాధానం ఇచ్చారు.
కార్యక్రమంలో ఏపీ విద్యార్థి
అటు, ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా చీడికాడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి కొంచా అనిల్ కుమార్ పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో చదువుకునేందుకు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించినట్లు తెలిపాడు.
మోదీ ఇంకా ఏం చెప్పారంటే.?
- పరీక్షల సమయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై ఒత్తిడి పెంచకూడదన్నారు. విద్యార్థులు తమపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. కొన్నిసార్లు పిల్లలు తమ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నారని ఒత్తిడికి లోనవుతారు. ప్రిపరేషన్ సమయంలో చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకుని, క్రమంగా మీ పనితీరును మెరుగుపరుచుకోవాలి. తద్వారా పరీక్షలు బాగా రాయగలరు.
- మీ పిల్లలను మరొకరితో పోల్చకూడదు. అది వారి భవిష్యత్తుకు హాని కలిగిస్తుంది. ఇతర పిల్లలను పోలుస్తూ తల్లిదండ్రులు, టీచర్లు, బంధువులు ఇలా ప్రతి ఒక్కరి నుంచి వచ్చే రన్నింగ్ కామెంట్రీతో విద్యార్థులు ప్రతికూల ఆలోచనల్లోకి వెళ్తారు. అది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
- తల్లిదండ్రులు వారి పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను తమ సొంత విజిటింగ్ కార్డ్‌గా భావిస్తున్నారు. ఎవరినైనా కలిసినప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్లినప్పుడు వారి పిల్లల గురించి గొప్పగా చెబుతారు. అది సరైన విధానం కాదు.
- ఉపాధ్యాయులు తమ పనిని కేవలం ఉద్యోగంగా భావించకూడదు. విద్యార్థుల జీవితాలను బలోపేతం చేసే సాధనంగా మార్చుకోవాలి. విద్యార్థులపై తోటి స్నేహితుల వల్ల, తల్లిదండ్రుల వల్ల, స్వీయ ప్రేరేపితంగా ఒత్తిళ్లు ఉంటుంది. వీటిని అధిగమించాలి. పోటీ, సవాళ్లు మన జీవితంలో ఎంతో ప్రేరణ కలిగిస్తాయి. కానీ అవి ఆరోగ్యకరంగా ఉండాలి. ఏ విషయంలోనూ పక్క వాళ్లతో పోటీ పడొద్దు. మీతో మీరే పోటీపడండి.
- విద్యార్థులే దేశ భవిష్యత్తు రూపకర్తలు. ఇప్పటి పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ 'పరీక్షా పే చర్చ కార్యక్రమం' నాకూ పరీక్ష లాంటిది.
- ఇళ్లలో గ్యాడ్జెట్స్ వాడకాన్ని తగ్గించండి. కుటుంబ సభ్యులతో హాయిగా గడపండి. టెక్నాలజీ మీ మధ్య దూరం పెంచకూడదు. గ్యాడ్జెట్స్‌ని రీఛార్జ్ చేస్తున్నాం. మరి మన శరీరానికీ ఇలాంటి రీఛార్జ్ అవసరమే కదా. మొబైల్స్‌ని పక్కన పెట్టి కంటినిండా నిద్రపోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర అవసరం. మీరు మీ కుటుంబ సభ్యులతో కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవసరం ఏముంటుంది..? మీరు మాట్లాడుకోడానికి అవి అవసరం లేదు. నేరుగా మాట్లాడుకోండి.
- విద్యార్థులు ఒత్తిడిని జయించి మనసును ఉల్లాసంగా ఉంచుకుంటూ పరీక్షలు రాసి విజయం సాధించాలి.
Also Read: Sharmila District Tours: ఫిబ్రవరి నుంచి జనాల్లోకి షర్మిల-మడకశిర నుంచే జిల్లాల పర్యటన ప్రారంభం