PIL on Trees cutting: ఏపీలో చెట్ల నరికివేతను అడ్డుకోండి, హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం
ఏపీలో చెట్ల నరికివేత తక్షణమే అడ్డుకోవాలని పర్యావరణ శాస్త్ర రిటైర్డ్ ప్రొఫెసర్లు హైకోర్టులో పిల్ దాఖలుచేశారు. కోనో కార్పస్ ఆరోగ్య సమస్యలు వస్తాయని ప్రచారం జరుగుతోంది.
PIL on Tree Cutting In AP ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న కోనో కార్పస్ చెట్ల నరికివేత కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఆ చెట్ల వలన పర్యావరణానికి హాని జరుగుతోందంటూ ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా ఉద్యమంలా కనపడిన చెట్టునల్లా నరికేస్తున్నారు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్లాంట్ ప్రొఫెసర్ కె.రామచంద్రారెడ్డి, నాగార్జున యూనివర్సిటీ బోటనీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ కె.బయపురెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆ చెట్ల వల్ల పర్యావరణానికి హాని ఉందో లేదో తేల్చడానికి నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు కోర్టును విజ్ఞప్తి చేశారు.
ఈ కేసులో కేంద్ర రాష్ట్ర పభుత్వతాలతోపాటు కాకినాడ, నెల్లూరు జిల్లాల కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చారు. కోనో కార్పస్ చెట్ల వలన పర్యావరణ, ఆరోగ్య సమస్యలున్నాయని నిరూపితం కాలేదన్నారు. దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండానే చెట్ల వలన మానవాళికి హాని జరుగుతుందని ప్రచారం చేయడంపై వారు కోర్టను ఆశ్రయించారు. ఇతర దేశాల్లోనూ ఈ చెట్లు విరివిగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్తితుల్లో అయినా జీవించగలిగే ఈ చెట్ల నిర్వహణ సులభంగా ఉంటుందని వారు తెలిపారు.
ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయనే కారణంతో ఏపీ ప్రభుత్వ పెద్దలు ఈ చెట్లను నరికివేయిస్తున్నారని వ్యాజ్యంలో పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో ఇప్పటికే 4600 లకు పైగా చెట్లను నరికేశారని నెల్లూరు జిల్లాలోనూ నరికివేత కొనసాగుతోందని వెల్లడించారు. ఆధారాలు లేకుండా అధ్యయనం చేయకుండా ప్రజలను భయాందోళనకు నెట్టేయడం తగదన్నారు. విచక్షణారహితంగా ఈ చెట్లను కొట్టేసే వారిపై వాల్టా చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోర్టును విజ్ఞప్తి చేశారు. చట్ట ప్రకారం నష్టపరిహారం వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై బుధవారం విచారణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
కోనో కార్పస్ చెట్ల పొప్పొడితో అస్తమా, ఎలర్జీ వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయని ప్రచారం జరుగుతోంది. ఆ మొక్కలు ఆక్సిజన్ విడుదల చేయవనే ప్రచారం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ మొక్కల నరికివేత కార్యక్రమానికి ఆదేశాలిచ్చారు. తాజాగా ఈ చెట్ల నరికివేతపై కోర్టును ఆశ్రయించడంపై ఉత్కంఠ నెలకొంది.