ఆంధ్రప్రదేశ్‌లోని రైతు కుటుంబాలు దేశంలోనే అత్యధిక అప్పుల భారంతో ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. దేశ సగటుతో పోలిస్తే ఏపీ రైతులకు దాదాపు మూడు రెట్లు ఎక్కువ అప్పు ఉంది.
Andhra Pradesh News: ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ అన్నదాత అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాడని కేంద్రం వెలుగులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ టాప్‌లో ఉందని పార్లమెంట్‌లో తేల్చింది.

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ సహా ఎమ్మెల్యేలంతా హాజరుకానున్నారు. అయితే ఇంతలో కేంద్రం పార్లమెంట్‌లో పెట్టిన ఓ నివేదిక ఇక్కడ రాజకీయ చిచ్చు రేపింది. ఆంధ్రప్రదేశ్‌లోని రైతు అప్పుల ఊబిలో ఉన్నాడని చెప్పిన రిపోర్టు సంచలనంగా మారుతోంది. అయితే దీన్ని అధికార ప్రతిపక్షాలు ఇరువురు కూడా బురద చల్లేలా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
దేశానికి వెన్నెముక రైతు అని గర్వంగా చెప్పుకునే రైతు అప్పుల భారతంతో కుంగిపోతున్నాడని పార్లమెంట్‌లో కేంద్రం కీలక నివేదిక బయటపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని రైతు కుటుంబాలు దేశంలోనే అత్యధిక అప్పుల భారంతో ఉన్నాయనేది చేదు నిజం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలు చూస్తుంటే ఏపీలో రైతు దీనస్థితి ఏంటో కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది.
ఫిబ్రవరి 10న లోక్‌సభలో ఏపీ రైతు అప్పులపై ఒక కీలక చర్చ జరిగింది. దీనిపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఎంతటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో దేశానికి స్పష్టమైంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న రైతులతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రైతుల అప్పులే అత్యధికంగా ఉన్నట్టు తేలింది.
ఒక్కో రైతు కుటుంబంపై ఎంత అప్పు ఉందంటే?
మంత్రి శివరాజ్ సింగ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం జులై 2018-జూన్ 2019 మధ్య కాలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని ఒక సగటు రైతు కుటుంబం అప్పు 2,35, 554 రూపాయలుగా ఉంది. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే కాదు. ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన వాస్తవం. అంటే మన రాష్ట్రంలో ఒక సాధారణ రైతు కుటుంబం సుమారు రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల అప్పుతో కాలం వెళ్లదీస్తోంది.
తెలంగాణ, జాతీయ సగటుతో పోలిక
పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం తెలంగాణతో పోల్చి చూసినా ఏపీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తెలంగాణలో ఒక రైతు కుటుంబం సగటు అప్పు 1,52, 113రూపాయలుగా ఉంది. అంటే ఏపీ కంటే ఇది చాలా తక్కువ. భారత్‌లో మొత్తం మీద ఒక రైతు కుటుంబం సగటు అప్పు కేవలం 74, 121 రూపాయలు మాత్రమే. జాతీయ సగటు 74వేలు ఉంటే ఏపీలో అది 2.35 లక్షలకు చేరడం ఆందోళనకరంగా ఉంది. దేశ సగటు కంటే ఏపీలో రైతులు దాదాపు మూడు రెట్లు ఎక్కువ అప్పుల్లో ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి.
రైతులకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?
కేంద్ర మంత్రి ప్రకటన ద్వారా అప్పుల భారం అయితే తెలిసింది కానీ, సామాన్యంగా రైతుకు ఈ తిప్పలు ఎందుకు వస్తాయో అందరికి తెలిసిందే. పెట్టుబడి పెరగడం, గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రకృతి వైపరిత్యాలు వంటి ఎన్నో కారణాలు రైతును అప్పుల వైపు నెడుతున్నాయి. ఒక్కో రైతు కుటుంబంపై ఇంత భారీ స్థాయిలో అప్పు ఉండటం అనేది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది.
పార్లమెంట్ సాక్షిగా బయటపడిన ఈ లెక్కలు ఇటు టీడీపీపై వైసీపీ దుమ్మెత్తి పోస్తుంటే, వారి హయాంలోనే ఇలాంటి లెక్కలు వెలుగు చూశాయని అప్పటి ప్రభుత్వం చేతకానితనం వల్లే ఇదంతా జరిగిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఈ కేంద్ర విడుదల చేసిన లెక్కలను ఇరు వర్గాలు వాడుకుంటున్నారు.
Frequently Asked Questions
పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని రైతు అప్పులపై కేంద్రం విడుదల చేసిన నివేదికలో ఏం వెల్లడైంది?
ఆంధ్రప్రదేశ్‌లో ఒక సగటు రైతు కుటుంబంపై ఎంత అప్పు ఉంది?
జులై 2018-జూన్ 2019 మధ్య కాలానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్‌లోని ఒక సగటు రైతు కుటుంబంపై సుమారు 2,35,554 రూపాయల అప్పు ఉంది.
తెలంగాణ, జాతీయ సగటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో రైతు అప్పుల పరిస్థితి ఎలా ఉంది?
తెలంగాణలో రైతు కుటుంబం సగటు అప్పు 1,52,113 రూపాయలు కాగా, జాతీయ సగటు 74,121 రూపాయలు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ అప్పు 2.35 లక్షలకు పైగా ఉండటం ఆందోళనకరం.
రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి గల కారణాలు ఏమిటి?
పెట్టుబడి పెరగడం, గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు వంటి అనేక కారణాలు రైతులను అప్పుల వైపు నెడుతున్నాయి.























