Pawan To Ippatam : శనివారం ఇప్పటం గ్రామానికి పవన్ కల్యాణ్ - కూల్చివేతలపై జనసేనాని ఆగ్రహం !
శనివారం పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించనున్నారు. కూల్చివేసిన ఇళ్లను పరిశీలించనున్నారు.
Pawan To Ippatam : గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం పర్యటించనున్నారు. శుక్రవారం రాత్రికే ఆయన మంగళగిరి చేరుకొని శనివారం ఉదయం ఇప్పటం ప్రజలను కలుస్తారు. జనసేన ప్లీనరీ సమావేశానికి ఇప్పటం గ్రామస్తులు తమ పొలాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు గ్రామంలో 120 అడుగుల రోడ్ నిర్మిస్తామంటూ దారిలో ఉన్న ఇళ్లననింటినీ కూల్చేస్తున్నారు. ప్రధాన రహదారి నుంచి గ్రామానికి వచ్చే అప్రోచ్ రోడ్ కేవలం పదిహేను అడుగులు మాత్రమే ఉందని.. గ్రామంలో అంతర్గత రహదారి మాత్రం 120 అడుగుల పేరుతో ఇళ్లను కూల్చేస్తున్నారని అక్కడి గ్రామస్తులు ఆందోళన చేశారు. జనసేన వర్గీయులు అన్న కారణంగానే ఇళ్లను కూల్చేస్తున్నారని ఆరోపించారు.
జనసేన ప్లీనరీ సభకు పొలాలు ఇచ్చినందుకు కక్ష సాధింపులని ఆరోపణలు
ఇటీవల ఇప్పటం గ్రామస్తులు పవన్ కల్యాణ్‌ను కలిశారు. ప్రభుత్వానికి భయపడకుండా ప్లీనరీకి స్థలాలు ఇచ్చినందుకు పవన్ కల్యాణ్.. గ్రామానికి యాభై లక్షల విరాళం ఇచ్చారు. దాంతో వారు ఓ కమ్యూనిటీ హాల్ నిర్మించుకున్నారు. అయితే... ఆ డబ్బులు సీఆర్డీఏకు జమ చేయాలని .. అధికారులు ఒత్తిడి చేశారు. వారు వినిపించుకోలేదు.. పవన్ కల్యాణ్ ఇచ్చిన వాటితో పాటు మరికొంత జమ చేసి.. కమ్యూనిటి హాల్ నిర్మహించుకున్నారు. అయితే దానికి బలవంతంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారు. దీనిపై మూడు రోజుల కిందట ..ఆ గ్రామంలో నాదెండ్ల మనోహర్ పర్యటించారు. అప్పుడు కరెంట్ నిలిపివేశారన్న ఆరోపణలు వచ్చాయి.
కూల్చే ప్రభుత్వం కూలిపోతుందన్న పవన్ కల్యాణ్
ఇప్పటం ఇళ్ల తొలగింపు అంశంపై పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో స్పందించారు. వైసీపీకి అనుకూలంగా ఓటు వేసినవారే మనవాళ్లు, ఓటు వేయనివారు శత్రువులు అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రాక్షస రాజ్యం ఆవిష్కృతం అయిందన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలన నూటికి నూరు శాతం మనవారు కాని వారిని తొక్క నార తీయండి అనే విధంగా కొనసాగుతోందన్నారు. వైసీపీకి ఓటు వేసిన 49.95 శాతం ఓటర్లకు మాత్రమే పాలకులం అనే విధంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు ఇప్పటం గ్రామంలో ఘటనలు నిదర్శనం అన్నారు. రోడ్డు విస్తరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తుందని పవన్ మండిపడ్డారు. బాధితులకు అండగా నిలబడాలని .. ఇప్పటం గ్రామ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
హైకోర్టులో స్టే వచ్చినా కూల్చివేతలు కొనసాగించారని విమర్శలు
కూల్చివేతలపై ఉన్నపళంగా ఇప్పటం గ్రామాస్తులు హైకోర్టును ఆశ్రయించారు. కూల్చివేతలపై హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే ఆర్డర్స్ అందే వరకూ తాము కూల్చివేతలు కొనసాగిస్తామని సిబ్బంది తేల్చి చెప్పారు. దీంతో సాయంత్రం వరకూ కూల్చివేతలు కొనసాగాయి. ఇదంతా రాజకీయ కక్ష పూరితమని ఆరోపిస్తూండటంతో వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.
చెట్ల పొదల్లో మరో మహిళతో సీఐ రాసలీలలు, ఐ ఫోన్ లోకేషన్ ట్రాక్ చేసి పట్టుకున్న భార్య!