Pawan Hindutva Tour: పవన్ కల్యాణ్ మిషన్ దక్షిణాది స్టార్ట్ - ఆలయాల సందర్శన ఎప్పటి నుంచంటే ?
Pawan Kalyan: పవన్ కల్యాణ్ హిందూత్వ ఎజెండాతో దక్షిణాది పర్యటన ప్రారంభిస్తున్నారు. కేరళ, తమిళనాడులో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు.

Pawan Kalyan schedule to visit temples in South has been finalized: జనసేన అధినేత పవన్ కల్యాణ్ దక్షిణాది పర్యటనలు ప్రారంభిస్తున్నారు. ఈ నెల 12వ తేది నుంచి కేరళ, తమిళనాడులో పర్యటించనున్నట్లుగా జనసేన వర్గాలు ప్రకటించాయి. మొత్తం నాలుగు రోజుల పర్యటన ఉంటుంది. అనంతపద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుసరామస్వామి, అగస్థ్యజీవసమాధి కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకుంటారు.
సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కల్యాణ్ ఆలయాల పర్యటన
సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ పర్యటన ఉంటుంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గతంలో సనాతన ధర్మంపై మాట్లాడినప్పుడు.. ఆయన దక్షిణాదిలో హిందూత్వ లీడర్ గా ఆవిర్భవించేందుకు అవసరమైన కార్యాచరణ ఖరారు చేసుకుంటున్నారని రాజకీయవర్గాలు అంచనా వేశాయి. కానీ పవన్ ఎప్పుడూ అలాంటి రాజకీయ టార్గెట్లు తనకు ఉన్నాయని చెప్పలేదు. కానీ ఇప్పుడు మెల్లగా తన కార్యాచరణ ప్రారంభిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ ఆలయాలను సందర్శించబోతున్నారు. మొదటగా ఆయన కేరళ వెళ్తున్నారు. ఆయన పర్యటన ఖచ్చితంగా రాజకీయం అవుతుంది. పవన్ కల్యాణ్ రాజకీయం లేదని.. చెప్పవచ్చు. కానీ జరుగుతున్న రాజకీయంలో భాగంగానే పర్యటనలు అని మీడియా ఖచ్చితంగా ప్రచారం చేస్తుంది.
తమిళనాడులో పవన్ పర్యటన రాజకీయ దుమారం రేపే చాన్స్
కేరళ తర్వాత పవన్ తమిళనాడు వెళ్లేలా షెడ్యూల్ ఖరారు అయింది. తమిళనాడులో అధికారం అందుకోవడం బీజేపీ దీర్ఘకాలిక లక్ష్యాల్లో ఒకటి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తనదైన ప్రభావం చూపాలని పట్టుదలతో ఉంది. అన్నామలై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా హిందూత్వవాదం, దేశభక్తి నినాదంతో తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. అయితే అనుకున్నంతగా ప్రయత్నాలు సక్సెస్ కావడం లేదు. గతంలో ఉదయనిధి చేసిన సనాతన ధర్మ వ్యతిరేకత వ్యాఖ్యలను కూడా సరిగ్గా ఉపయోగించుకోలేకయారన్న అభిప్రాయం ఉంది. హిందూ వర్గాల్లో కదలిక తీసుకువచ్చి అందర్నీ ఏకతాటిపైకి తీసుకురావాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆ బాధ్యతను పవన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
దక్షిణాది హిందూత్వ లీడర్ గా పవన్ కల్యాణ్ నిలుస్తారా ?
ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పవన్ విమర్శలు చేశారు. తమిళనాడులో పవన్ చేసే పర్యటన అక్కడి రాజకీయాల్లో మార్పులు తెచ్చే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. కర్ణాటక. తెలంగాణలోనూ పవన్ ఆలయాల సందర్శన ఉంటుంది. ఇదంతా ఓ ప్రణాళిక ప్రకారం జరుగుతుందని.. ఈ వర్యటనలతో పవన్ కల్యాణ్.. దక్షిణాదిన పూర్తి స్థాయి హిందూత్వ లీడర్ గా అవతారం ఎత్తుతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

