Pawan On Byjoos : బైజూస్ కాంట్రాక్ట్‌పై పవన్ ప్రశ్నలు - వైసీపీ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ !
బైజూస్ తో ఏపీ సర్కార్ చేసుకున్న ఒప్పందంపై పవన్ కల్యాణ్ స్పందించారు. వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
Pawan On Byjoos : వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ మరో అంశంపై గురి పెట్టారు. బైజూస్ సంస్థతో చేసుకున్న ఒప్పందం విషయంలో సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మెగాడీఎస్సీని ప్రకటించలేదని.. ఒక్కరంటే ఒక్క టీచర్ నూ రిక్రూట్ చేయలేదన్నారు. కానీ తీవ్ర నష్టాల్లో ఉన్న ఓ స్టార్టప్‌కు మాత్రం వందల కోట్లు కాంట్రాక్టులు ఇచ్చారన్నారు. బైజూస్‌కు కాంట్రాక్టులు ఇచ్చే విషయంలో స్టాండర్డ్ ప్రోటోకాల్ ను వైసీపీ ప్రభుత్వం పాటించిందా ? ఎన్ని కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి ? ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయ్యారు ? ఈ వివరాలన్నీ పబ్లిక్ డోమైన్‌లో ఉన్నాయా ? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వీటిపై వైసీపీ గవర్నమెంట్ స్పందించాలన్నారు.
No Mega DSC Notification, No Teacher Recruitment, No Teacher Training. But, a loss making startup gets crores of contract. Has YCP Govt followed Standard Protocol? How many companies applied for the tender, who were shortlisted? Is it in Public Domain? YCP GOVT RESPOND!… pic.twitter.com/DAySn82x62
— Pawan Kalyan (@PawanKalyan) July 22, 2023
తన ట్వీట్‌లో పవన్ కల్యాణ్.. బైజూస్ ఎలా కుప్పకూలిపోయిందో వివరించే న్యూస్ ఆర్టికల్ లింక్ ను కూడా ఇచ్చారు. ట్యాబ్స్ మంచివే కానీ.. స్కూళ్లలో టాయిలెట్స్ ను ముందుగా నిర్మించాలన్నారు. యాప్స్ ఓ చాయిసేనని.. కానీ టీచర్లు మాత్రం ఖచ్చితంగా ఉండాలని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కరోనా సమయంలో బైజూస్ ఆన్ లైన్ క్లాసులకు విపరీతమైన ఆదరణ లభించింది. దీంతో ఆ సంస్థ ఆర్థికంగా అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. అయితే సరైన క్వాలిటీ లేని ఆన్ లైన్ చదువులు.. స్కూళ్ల ప్రారంభం తర్వాత బైజూస్ పై అంతా పూర్తిగా నమ్మకం పోగొట్టుకున్నారు. దీంతో శరవేగంగా ఆ సంస్థ కూలిపోతోంది. అప్పుల పాలైంది. ఆదాయం కన్నా నాలుగైదు రెట్లు ఎక్కువ నష్టాలు చూపిస్తోంది. బైజూస్ కంటెంట్ పై ఏ మత్రం సానుకూల ఫీడ్ బ్యాక్ లేకపోయినప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ కంపెనీతో కనీసం రూ. ఏడు వందల కోట్ల రూపాయల ఒప్పందం చేసుకున్నారు. ఎనిమిదో తరగతి ఆపైన ఉండే విద్యార్థులకు బైజూస్ కంటెంట్ తో ఉచితంగా ట్యాబ్స్ పంపిణ చేస్తామని ఒప్పందం చేసుకున్నారు. అయితే అంతా ట్యాబ్స్ ఖర్చేనని.. కంటెంట్ ఉచితంగా ఇస్తున్నారని ప్రభుత్వ వాదిస్తోంది.
అసలు బైజూస్ తో ఒప్పందం గురించి బయటకు ఏమీ తెలియదు. జీవోలు ఇతర వివరాలు బయటకు రాలేదు. బైజూస్‌కు ఎంత బిల్లులు చెల్లించారన్నదనిపైనా స్పష్టత లేదు. అందుకే పవన్ కల్యాణ్ ఈ వివరాలన్నింటినీ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం స్పందిస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది.