Pawan Kalyan: వాలంటీర్ వ్యవస్థలో పుచ్చులు, కుళ్లిన వ్యక్తులే! వీటికి బాధ్యత ఎవరు? నిలదీసిన పవన్ కల్యాణ్
తాడేపల్లిగూడెంలో నిర్వహించిన వారాహి విజయయాత్ర రెండో విడతలో పాల్గొని పవన్ కల్యాణ్ మాట్లాడారు.
వాలంటీర్లు అందరూ తన సోదర సమానులనీ, అందరూ అక్కాచెల్లెళ్లు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వాలంటీర్ల పొట్ట కొట్టాలని తాను కలలో కూడా అనుకోబోనని చెప్పారు. అవసరమైతే వారికి వచ్చే రూ.5 వేలకు ఇంకో 5 వేలు వేసి ఇచ్చే మనసున్నవాడినని అన్నారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన వారాహి విజయయాత్ర రెండో విడతలో పాల్గొని పవన్ కల్యాణ్ మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, వాటిని పవన్ ఎత్తి చూపారు.
వాలంటీర్ అంటే అర్థం.. ప్రతిఫలం ఆశించకుండా తమకు తాముగా వచ్చి సాయం చేయడం అసలు అర్థం అని అన్నారు. రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థకి దేశానికి రాష్ట్రపతి ప్రెసిడెంట్‌గా ఉంటారని, రాష్ట్రాలకు గవర్నర్‌లు బాధ్యత వహిస్తారని అన్నారు. అలాంటి ఏపీలో జగన్ వాలంటీర్ వ్యవస్థకి అధిపతి ఎవరని ప్రశ్నించారు. ఏపీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏపీ డేటా మొత్తం హైదరాబాద్ లోని నానక్‌రాం గూడలో ఉందని ఆరోపించారు. ఏపీకి చెందిన ప్రజల ఆధార్ డేటా మొత్తం ఓ సంస్థకు ఎందుకు అప్పగించావని నిలదీశారు. ఆ ఏజెన్సీలో పని చేస్తున్న దాదాపు 700 మంది ఉద్యోగులకు ఎవరు జీతాలు ఇస్తున్నారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వాలంటీర్లు నేరాలకు పాల్పడిన ఘటనలను పవన్ కల్యాణ్ ప్రస్తావించారు.
గద్ద కాళ్ల కింద కోడిపిల్లల్లా ఆడపిల్లలు!
జగనన్న నేరం చేసి జైల్లోకి వెళ్లి వచ్చేసి.. హాయిగా సీఎం అయిపోయాడు. మేం కూడా జైలుకెళ్లొచ్చి నాయకులవుతామనే ధీమాతో వాలంటీర్లు ఉన్నారు. జనసేన జనవాణి ప్రారంభించడానికి వాలంటీర్లే కారణం. వాలంటీరు జీతం రోజుకు రూ.164.38 అంటే ఉపాధి హామీ కూలీ వేతనం కంటే చాలా తక్కువ. వాలంటీరు జీతం బూమ్ బూమ్ మద్యం బ్రాండుకి తక్కువ.. ఆంధ్రా గోల్డ్‌కి ఎక్కువ. ఆడబిడ్డల తాళిబొట్లు తెగిపోతే జగన్ ముఖంలో నవ్వు వస్తుంది. మన్ని మహేశ్ బాబు తండ్రి క్రిష్ణ గారు చనిపోతే పరామర్శకు వెళ్లి పుట్టెడు దు:ఖంలో ఉన్న మహేశ్ బాబుని నవ్వుతూ పలకరిస్తున్నాడు.
మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్.. ఇప్పటి దాకా లక్ష కోట్ల మద్యాన్ని అమ్ముకున్నాడు. ఆడ బిడ్డల మానప్రాణాల సంరక్షణే జనసేన విధానం. మహిళలు కోరుకున్న చోట మద్య నిషేధం అమలు చేస్తాం. లిక్కర్ వల్ల మహిళలకు ఇబ్బంది ఉండకూడదు. తాగిన వాడు ఓ మూలకి వెళ్లి గొడవ చేయకుంటే పర్లేదు, కానీ గోల చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నా’’ అని పవన్ కల్యాణ్ మాట్లాడారు.