Pawan Kalyan : పొత్తులు ఖాయం - సీఎం పదవి అడగను - పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు !
పొత్తులు, సీఎం పదవిపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కండిషన్స్ పెట్టి సీఎం పదవి సాధించలేమన్నారు.
Pawan Kalyan : రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకుంటున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ఫష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ నుంచి అధికారం లాక్కోవాలి.. దాన్ని ప్రజలకు అప్పగించాలనేదే తమ లక్ష్యం అని పవన్ కల్యాణఅ స్పష్టం చేసారు. ఖచ్చితంగా పొత్తులు ఉంటాయని.. ఢిల్లీ పర్యటనలోనూ ఈ అంశంపై చర్చించామన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే తమ బలం రెట్టింపు అయిందన్నారు. జనసేనకు పట్టు ఉన్న ప్రాంతాలలో 30శాతం ఓటింగ్ ఉందన్నరు. తమకు బలం ఉన్న మేరకే సీట్లు అడుగుతామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
సీఎంను చేయాలని బీజేపీ, టీడీపీలను అడిగేది లేదన్న పవన్
షరతులు పెట్టి ముఖ్యమంత్రి స్థానాన్ని పొందలేమని స్పష్టం చేశారు. తనకు సీఎం పదవి ఇవ్వాలని బీజేపీనో, టీడీపీనో అడిగే ప్రశ్నే లేదన్నారు. ప్రజలు కావాలని కోరుకుంటే సీఎం అవుతానన్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీకి 30 స్థానాలు ఇచ్చి ఉంటే సీఎం రేసులో ఉండేవాడిన్నారు. ముందస్తు ఎన్నికలు అంటున్నారని అందుకే జూన్ మూడో తేదీ నుంచి తాను ఏపీలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా పవన్ ప్రకటించారు. మన బలం అన్నది చూపి పదవి తీసుకోవాలన్నారు.
రాష్ట్రం కోసేమే పొత్తులని స్పష్టీకరణ
పొత్తుల విషయంలో తన స్టాండ్ మారలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా పొత్తులతోనే బలపడ్డాయని గుర్తు చేశారు. ఎవరైనా పొత్తులకు ఒప్పుకోకుండా ఉంటే ఒప్పిస్తామని స్పష్టం చేశారు. పొత్తులకు సీఎం అభ్యర్థి ప్రామాణికం కాదని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. లెఫ్ట్ , రైట్ పార్టీలతో కలిసి వైసీపీపై పోరాడాలని ఉందన్నారు. కానీ లెఫ్ట్ పార్టీలు రావని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పొత్తులనేవి కులానికి సంబంధించినవి కావని.. రాష్ట్రానికి సంబంధించినవని పవన్ స్పష్టం చేశారు. బలమైన పార్టీలు కలసి నడవాలని స్పష్టం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్నదానికి కట్టుబడి ఉన్నాన్నరు.
బీజేపీని ఒప్పిస్తానని పవన్ భావన !?
పొత్తులకు ఒప్పుకోని వారు ఎవరైనా ఉంటే వారిని ఒప్పిస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇదే విషయం పవన్ కల్యాణ్ ఢిల్లీలో కూడా మాట్లాడానని అంటున్నారు. అంటే బీజేపీ కూడా కలిసి రావాలని ఢిల్లీలో పవన్ చర్చలు జరిపినట్లుగా భావిస్తున్నరు. ఒక వేళ బీజేపీ రాకపోతే.. టీడీపీతో కలిసి వెళ్లేందుకు పవన్ సిద్ధమయ్యారని తాజా వ్యాఖ్యలతో ఎక్కువ మంది ఓ అభిప్రాయానికి వస్తున్నారు. సీఎం పదవి విషయంలో తమ క్యాడర్ చేస్తున్న వ్యాఖ్యలతో పొత్తు అంశం ముందుకు సాగకుండా అడ్డం పడకుండా..ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారని భావిస్తున్నారు.