Pawan Kalyan: అనాథ పిల్లలకు పవన్ కల్యాణ్ జీతం - ప్రతీ నెలా ఇవ్వాలని నిర్ణయం !
Janasena: ప్రతీ నెలా తన జీతాన్ని అనాథ పిల్లలకు ఇవ్వాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. పిఠాపురంలో ఇలాంటి అనాథల్ని గుర్తించి పంపిణీ చేశారు.

Pawan Kalyan donate salary to orphans : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు అండగా ఉండేందుకు తన జీతాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఒక్కొక్కరికీ రూ. 5వేల చొప్పున సాయం... మిగిలిన వేతనం వారి బాగోగులకే కేటాయించారు. ప్రతి నెలా ఇంటి వద్దనే అందించేలా ఏర్పాట్లు చేశారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజల సంక్షేమంతోపాటు సమస్యల పరిష్కారం తన బాధ్యత అని పవన్ కల్యాణ్ తెలిపారు.
పిఠాపురం నియోజకవర్గంలో కన్నవారు దూరమైన బిడ్డలతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో శాసనసభ్యుడిగా గెలిపించారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధితోపాటు సమస్యలను పరిష్కరించడం నా బాధ్యత అని డిప్యూటీ సీఎం తెలిపారు. పిఠాపురం ప్రజలు ఇచ్చిన అధికారం ద్వారా వచ్చిన జీతాన్ని అక్కడే వినియోగించాలని నిర్ణయించుకున్నాను... అందులో భాగంగా నియోజకవర్గం పరిధిలోని తల్లిదండ్రులు లేని బిడ్డల భవిష్యత్తు కోసం ఆ మొత్తం ఇస్తున్నట్టు ప్రకటించారు. పదవి ఉన్నంతకాలం వచ్చే జీతం మొత్తాన్ని ఆ బిడ్డల సంక్షేమానికి వినియోగించనున్నట్టు స్పష్టం చేశారు.
శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు పవన్ కళ్యాణ్ తన వేతనం నుంచి ఒక్కొక్కరికీ నెలకి రూ. 5 వేల చొప్పున రూ. 2,10,000 ఆర్థిక సాయం అందించారు. జీతంలో మిగిలిన మొత్తాన్ని కూడా వారి బాగోగులు చూసేందుకే ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. శుక్రవారం అందుబాటులో ఉన్న 32 మందికి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా సాయాన్ని అందజేశారు. మిగిలిన పది మందికీ జిల్లా యంత్రాంగం ద్వారా ఆ మొత్తాన్ని అందిస్తారు. ప్రతి నెలా ఈ సాయం వారి ఇళ్ల వద్దే అందించేలా ఏర్పాట్లు చేశారు.
నా జీతం... మీ జీవితం కోసం…
— JanaSena Party (@JanaSenaParty) May 9, 2025
•పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు అండగా నా వేతనం
•ఒక్కొక్కరికీ రూ. 5వేల చొప్పున సాయం... మిగిలిన వేతనం వారి బాగోగులకే
•ప్రతి నెలా ఇంటి వద్దనే అందించేలా ప్రణాళికలు
•పదవి ఉన్నంతకాలం సాయం కొనసాగుతుందని ప్రకటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు… pic.twitter.com/jABZCQjWKm
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని శాసన సభ్యుడిగా ఎన్నికైన తర్వాత వేతనం తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను కానీ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్న భావనతోనే వేతనం తీసుకున్నానని తెలిపారు. వేతనం రూపంలో తీసుకున్న ఆ మొత్తాన్ని నన్ను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గం పరిధిలో కన్నవారు దూరమైన పిల్లల భవిష్యత్తు కోసం, వారి చదువుల ఖర్చు చేయాలనుకున్నాను. ప్రభుత్వం, పదవి ఉన్నంతకాల జీతం మొత్తం అనాథ బిడ్డల సంక్షేమానికి వినియోగిస్తాను అని అన్నారు. పవన్ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది.





















